జీవితం ఒక సముద్రం. ముత్యపు చిప్పల కంటే, సొర చేపలే ఎక్కువ వుంటాయి. పైకి కనపడని రంగులు, రూపాలు, గాఢత వుంటాయి. సముద్రపు హోరులో జీవిక కోసం పోరాడే చిన్న చేప పిల్ల వ్యథని పట్టుకోవడం, గుర్తించడం అంత సులభం కాదు. ఆ పని కుప్పిలి పద్మ చేయగలరు. కాలానికంటే ముందుండే రచయిత్రి. 20 ఏళ్ల తర్వాత నగర జీవితం ఎలా వుంటుందో ఆమె ఎప్పుడో చెప్పారు. నగరంలో బతకాడానికి వచ్చిన మంగ కథ “మెట్రోకి ఆవల”. కనీసం కుక్కలకి ఉన్న భద్రత కూడా మనుషులకి వుండని నగరం. అయితే ఆ కుక్కకి కూడా డబ్బుండాలి. అది వేరే సంగతి.
బతకడం కోసం యుద్ధం నడుస్తోంది. గాయాలు, రక్తం వుండదు. నిశ్శబ్ద మరణాలే. పేదరికం ప్రపంచ భాష. దానికి సబ్ టైటిల్స్ అక్కర్లేదు. మియామి పుట్‌పాత్‌లపై దోమ తెరల్లో జీవిస్తున్న వందలాది మంది అర్థం కావాలంటే ఇంగ్లీష్, స్పానిష్ తెలియక్కర్లేదు. బతుకు బావుంటుందని మెక్సికో నుంచి అక్రమంగా వచ్చిన వాళ్లు. ఆకాశ భవంతులను చూసి అద్భుతాలను సాధిద్దామని వచ్చిన ఎందరో భవనాల పునాదుల్లో కంకాళాలుగా మిగిలిపోతారు. నగరం అంటే కంటికి కనపడని ఉరితాడు. ఈ తాడు ఊగుతున్న శబ్దాన్ని, కదలికని పద్మ గుర్తించగలరు.
పల్లెటూరు ప్రశాంతంగా వుంటుంది. కానీ అది నచ్చదు. ఉరుకులు పరుగులు వుంటేనే డబ్బులొస్తాయి. మన పక్కింటి వాడు, ఎదురింటివాడు నగరాల్లో డబ్బులు సంపాదిస్తూ వుంటాడు. వాళ్లు ఎలా జీవిస్తున్నారో మనకి అనవసరం. బాగా బతకాలని మంగ కుటుంబం నగరం వస్తుంది. తన యజమానురాలి కుక్కని డేకేర్‌లో వదలడంతో కథ ప్రారంభం అవుతుంది. మంగకి చిన్న పాప వుంటుంది. బడికి వెళ్లాలంటే పాపని చూసుకునే వాళ్లు కావాలి. పల్లె నుంచి అత్తమ్మను పిలిపిస్తుంది. కానీ ఆమె లెక్కలు ఆమెకుంటాయి. వెళ్లిపోతుంది. పాపని ఇంట్లో కట్టేసి వెళుతుంది. ప్లాస్టిక్ బిందెలో తల పెట్టి పాప ప్రాణం మీదకి తెచ్చుకుంటుంది. ఒకావిడ దగ్గర వదిలి వెళితే అక్కడ ఇంతకు మించిన ప్రమాదం. వస్తున్న ఆదాయం ఆధారంగా భర్త చీటీలు కట్టి కమిట్మెంట్స్ పెంచేశాడు. డబ్బులున్న వాళ్లు కుక్కని కూడా బాగా చూసుకోగలరు. లేని వాళ్లు కూతురిని కూడా కాపాడుకోలేరు. అపుడు మంగ ఏం చేసింది.
ఈ కథలో అలంకారాలు, ట్విస్టులు, మెరుపులు ఏమీ లేవు. రచయిత్రి హృదయంతో కథ చెబుతారు. ఎవరినీ నిందించరు, ఆగ్రహించరు. నగర జీవితంలోని ఒక చిన్న భాగాన్ని చూపుతారు. తిమింగళాలు బతకాలంటే చేపలుండాలి. ఈ చేపలు పల్లెల నుంచి వస్తూనే వుంటాయి. వాస్తవానికి ఈ ప్రపంచం రెండుగా ఎప్పుడో విడిపోయింది. ఊర్ద్వ జగత్తు, అథోజగత్తు… ఈ రెంటిని కలపాలని మార్క్స్ అనుకున్నాడు కానీ, మనుషులు అనుకోలేదు. పైకి ఎగబడడానికి జరిగే యుద్ధ రంగమే నగరం.
మానవ జీవిత అంతరంగంలో జరిగే మహాభారత యుద్ధం గురించి తెలుసుకోవడమే రచయితల గొప్పతనం. ఈ విషయం పద్మకి తెలుసు.
జీఆర్ మహర్షి