వాట్సాప్ గ్రూప్ నుంచి అడ్మిన్ తనను తొలిగించాడని కోపం పెంచుకున్నాడు ఓ వ్యక్తి. అతడి ఆఫీస్ కు వెళ్లి మరీ దాడికి పాల్పడ్డాడు. అతడి నాలుక కోసేశాడు. పూణెలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూణెలోని ఫుర్సుంగిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతానికి చెందిన బాధితుడు తన కుటుంబంతో కలిసి ఓ సొసైటీలో నివశిస్తున్నాడు. ఆ సొసైటీకి సంబంధించి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేశాడు. దాని పేరు ఓం హైట్స్. దానికి అతడే అడ్మిన్. సొసైటీ సభ్యులంతా అందులో ఉన్నారు.
కొన్ని కారణాల వల్ల ఆ గ్రూప్ నుంచి ఓ వ్యక్తిని తొలిగించాడు అడ్మిన్. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆ వ్యక్తి, సంజాయిషీ ఆడిగాడు. ఎలాంటి సమాధానం రాకపోవడంతో, మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి సదరు అడ్మిన్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అడ్మిన్ నాలుక చీలిపోయింది. వైద్యులు అతడి నాలుకకు సర్జరీ చేసి కుట్లు వేశారు.
అడ్మిన్ భార్య కాస్త ఆలస్యంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడంతో జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే నగరంలో 3 రోజుల కిందట మరో వింత ఘటన చోటుచేసుకుంది. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పనందుకు, ఓ వ్యక్తి చేయి విరిచేశాడు మరో వ్యక్తి. ఇప్పుడిలా వాట్సాప్ గ్రూప్ నుంచి తొలిగించినందుకు, అడ్మిన్ నాలుక కోసేశాడు మరో వ్యక్తి.