హైదరాబాద్ లోని ఏటీఎంలో నోట్ల వర్షం

ఏటీఎంలో డెబిట్ కార్డ్ పెట్టారు. ఓ 500 రూపాయలు కావాలని ఎంటర్ చేశారు. కానీ మీకు ఒకేసారి 500 రూపాయల నోట్లు 5 వస్తే ఎలా ఉంటుంది? హైదరాబాద్ లోని ఓ ఏటీఎంలో ఇది…

ఏటీఎంలో డెబిట్ కార్డ్ పెట్టారు. ఓ 500 రూపాయలు కావాలని ఎంటర్ చేశారు. కానీ మీకు ఒకేసారి 500 రూపాయల నోట్లు 5 వస్తే ఎలా ఉంటుంది? హైదరాబాద్ లోని ఓ ఏటీఎంలో ఇది జరిగింది. దీంతో జనాలు ఎగబడ్డారు. ఫలితంగా ఏటీఎంకు తాళం వేశారు.

హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ఏటీఎం 2 రోజులుగా పనిచేయలేదు. సిబ్బంది వచ్చి దాన్ని రిపేర్ చేసి వెళ్లారు. ఓ కస్టమర్ అందులోకి వెళ్లాడు. కార్డు పెట్టి 500 కొట్టాడు, కానీ అతడికి 2500 రూపాయలొచ్చాయి.

విషయం తెలుసుకున్న స్థానిక జనం డెబిట్ కార్డులు పట్టుకొని ఎగబడ్డారు. అలా ఏటీఎం నుంచి క్షణాల్లో 45వేల రూపాయలు బయటకెళ్లిపోయాయి. అంతమంది జనాన్ని చూసిన ఏటీఎం సిబ్బందికి అనుమానం వచ్చింది. చెక్ చేసి చూస్తే అసలు విషయం తెలిసింది.

వెంటనే ఏటీఎంకు తాళం వేశారు. సాంకేతిక లోపాన్ని సరిదిద్దే పనిలో పడ్డారు. బయటకు వెళ్లిన డబ్బును వెనక్కి తెచ్చుకోవడం ఎలా అనే అంశాన్ని బ్యాంక్ సిబ్బంది పరిశీలిస్తున్నారు.

దేశంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఢిల్లీ, పూణె నగరాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఏటీఎంలో అప్పడప్పుడు సాంకేతిక లోపాలు తలెత్తుతుంటాయని, వాటి పర్యవసానంగానే ఇలా నోట్ల వర్షం కురుస్తుందని చెబుతున్నారు టెక్ నిపుణులు.