ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. కళ్లు తెరిచి, మూసేలోపు ఎన్నికలు వచ్చి పడేలా ఉన్నాయి. వైసీపీకి దాదాపు నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి కావస్తోంది. సొంత పార్టీలో అసమ్మతి గళాలు నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరో 16 నెలల్లో జరిగే ఎన్నికలు వైసీపీ, టీడీపీలకు అత్యంత ఆవశ్యకమైనవి. మరీ ముఖ్యంగా వైసీపీకి అని చెప్పక తప్పదు.
వైసీపీ మరోసారి అధికారంలోకి రాకపోతే మాత్రం… భవిష్యత్ ప్రశ్నార్థకమే. వైసీపీ పుట్టుకను గమనిస్తే… ఓ భావోద్వేగం నుంచి అవతరించింది. భావోద్వేగాలు సుదీర్ఘ కాలం పాటు ఉండవు. కాలం గడుస్తున్న కొద్ది భావోద్వేగాలు మరుగున పడతాయి. ఇది ప్రకృతి సహజ లక్షణం. ఇదే సిద్ధాంత పునాదులపై ఏర్పడిన రాజకీయ పార్టీకి భవిష్యత్ వుంటుంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు జయాపజయాలతో సంబంధం లేకుండా నిలదొక్కుకోగలిగాయి.
1983లో ఎన్టీఆర్ సునామీలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయింది. ఆ తర్వాత టీడీపీలో సంక్షోభం, తిరిగి మళ్లీ ప్రజాదరణ పొందడం తెలిసిందే. ఇదే ఎన్టీఆర్ నేతృత్వంలో 1989లో టీడీపీ ఓడిపోయింది. ఇలా టీడీపీ, కాంగ్రెస్ గెలుస్తూ, ఓడుతుండడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలాగే దేశంలో రెండు పార్లమెంట్ స్థానాలతో ప్రారంభమైన బీజేపీ రాజకీయ ప్రస్థానం… ఇప్పుడు తిరుగులేని పార్టీగా అధికారాన్ని చెలాయిస్తోంది. మోదీ నేతృత్వంలో రెండోసారి జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మూడోసారి కూడా బీజేపీనే అధికారంలోకి వస్తుందనే సంకేతాలు స్పష్టంగా వెల్లడవుతున్నాయి.
అందుకే బీజేపీ అంటే ఏ మాత్రం గౌరవం లేకపోయినా, ఆ పార్టీ అధికారాన్ని చూసి దేశ వ్యాప్తంగా భయంతో మెలుగుతున్న పార్టీలను, ప్రభుత్వాల్ని చూస్తున్నాం. ఇందుకు నిలువెత్తు ఉదాహరణగా మన కళ్లెదుటే ఉన్న టీడీపీ, వైసీపీల గురించి చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు స్థానం వుండదు. అధికారమే అన్ని భావోద్వేగాల్ని కంట్రోల్ చేస్తుంది. లేని అభిమానాల్ని పుట్టిస్తుంది. కనుచూపు మేరలో అధికారం లేదంటే లేని కోపాల్ని కూడా రగుల్చుతుంది.
ఇక వైసీపీ విషయానికి వస్తే … పూర్తిగా వైఎస్సార్ అనే నాయకుడి ఆకస్మిక మరణం నుంచి ప్రాణం పోసుకున్న రాజకీయ పార్టీ. 2011లో మొదలైన ఆ పార్టీ ప్రస్థానం… వైఎస్ జగన్ నాయకత్వ సమర్థతతో ఇంత కాలం నెగ్గుకు రాగలిగింది. 2014లో అధికారం తృటిలో చేజారినప్పటికీ, 2019లో దక్కింది. వైఎస్ జగన్‌పై ప్రజాభిప్రాయం సీఎం కాకముందు, అయిన తర్వాత అని మాట్లాడు కోవాల్సి వుంటుంది. ముఖ్యంగా వైసీపీ శ్రేణుల్లో జగన్ సీఎం అయిన తర్వాత అభిమానం సన్నగిల్లడం ప్రారంభమైంది. పదవీ కాలం పూర్తవుతున్న ప్రస్తుతం కాలానికి జగన్ అంటే… ప్చ్ అనే నిట్టూర్పు.
జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనలో అందరూ వైఎస్సార్‌ను చూసుకున్నారు. అధికారంలోకి వస్తే వైఎస్సార్‌ను మరిపించేలా పాలన సాగిస్తారని ఆశించారు. సంక్షేమ పాలన అందించడంలో మాత్రం తండ్రిని మించిన తనయుడిగా ప్రశంసలు అందుకుంటున్నారు. మిగిలిన వాటిలో వైఎస్సార్‌కు సమీప దూరంలో కూడా జగన్ నిలబడలేకపోయారనేది జనాభిప్రాయం. అలాగే ముఖ్యమంత్రిగా ఇటు జనానికి, సొంత పార్టీ నేతలకు కూడా చేరువ కాలేకపోయారనే బలమైన విమర్శ వుంది.
వైసీపీ కార్యకర్తల్ని కూడా సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాలోనే పడేశారు. దీన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా జగన్ నాలుగేళ్ల పాలనలో కొన్ని వర్గాలను శాశ్వతంగా శత్రువుల్ని చేసుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగుల విషయంలో ఏపీ సర్కార్ వ్యవహరించిన తీరు… వారికి జగన్‌ను ఎప్పటికీ దగ్గర కాకుండా చేసిందనడంలో సందేహం లేదు. అలాగే ప్రత్యర్థుల విషయంలో రాజకీయంగా వ్యవహరించకుండా, కక్షతో వేధింపులకు పాల్పడుతున్నారనే విమర్శ లేకపోలేదు. అలాగే రాజకీయంగా ఏ ఒక్క పార్టీతోనూ వైసీపీకి సంబంధాలు లేవు.
రాజకీయంగా వైసీపీ ఏకాకి అని చెప్పొచ్చు. ఇది మంచిది కాదు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అంత మాత్రాన శత్రువులుగా ఉండాల్సిన అవసరం లేదు. జగన్ తన చుట్టూ పెట్టుకున్నోళ్లను చూస్తే… ముఖ్యమంత్రి మనస్తత్వం ఎలాంటిదో అంచనా వేయొచ్చు. జగన్‌కు అధికారం వుండడం వల్ల అందరూ అభిమానంగా ఉన్నట్టు నటిస్తున్నారు. అదే లేకపోతే ….ఇప్పుడు ఆయన్ను పొగుడ్తున్న వారే విమర్శించడం ఖాయం. 2011లో వైసీపీని స్థాపిస్తే… ఇంత వరకూ ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశమైందనే వార్త ఎప్పుడూ చూడలేదు. దీన్ని బట్టి పార్టీ సమావేశాలకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలుసుకోవచ్చు.
ఇదే చంద్రబాబు విషయానికి వస్తే… పార్టీ నేతలతో పదేపదే సమావేశం అవుతుంటారు. ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు, నిర్ణయాలు తీసుకోడానికి పొలిట్‌బ్యూరో సభ్యులతో సమావేశం అవుతుంటారు. వైసీపీ, టీడీపీలకు ఇదే తేడా. చంద్రబాబులా జగన్ పార్టీని నడపాలనే రూల్ లేదు. కానీ పార్టీ కోసం ఏది చేస్తే మంచిదో, ఆ పని చేయాలని చెప్పడమే ఉద్దేశం. వైసీపీకి ఒక్కసారి అధికారం దూరమైతే మాత్రం… ఆ పార్టీ భవిష్యత్‌ను ఊహించుకోలేం. ఎందుకంటే ఈ నాలుగేళ్లు చాలా మంది ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చడంలో జగన్ ఫెయిలా, పాసా అనేది రానున్న ఎన్నికల్లో తేలనుంది.
ఒకవేళ 2024 ఫలితం వైసీపీకి వ్యతిరేకంగా వుంటే మాత్రం ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతాయనడంలో సందేహం లేదు. సింగిల్ టైమ్ అధికారం అని చెప్పక తప్పదు. గెలిస్తే మాత్రం…తమిళనాడులో జయలలితకు పాదాక్రాంతం అయిన చందంగా, జగన్‌కు నాయకులు దాసోహం కావడం ఖాయం.