ఏడాదికి రెండు మూడు సందర్భాల్లో తప్ప.. నిర్దిష్టంగా ఒక వేదిక మీద ఒక బహిరంగ సభ నిర్వహించగల దమ్ము లేదు. నిర్వహించడానికి తగిన పార్టీ యంత్రాంగం లేదు. ఉన్నదెల్లా ప్రజలను వేలం వెర్రిగా ఆకర్షించగలా సినీనటుడనే క్రేజ్ మాత్రమే. దానిని పెట్టుబడిగా పెట్టి.. రోడ్ల మీద సభలు నిర్వహిస్తే నేల ఈనినట్టుగా ఎటూ జనం వస్తారని.. దాన్నంతా తనకున్న ప్రజాబలం కింద ప్రచారం చేసుకుని.. రాజకీయ బేరసారాలకు దిగవచ్చునని అనుకుంటే ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవో అశనిపాతం అయికూర్చుంది.
పోలీసులు ఎంపిక చేసిన, అనుమతించిన స్థలాల్లో మాత్రమే రాజకీయ సభలు పెట్టాలి. ఎక్కడపడితే అక్కడ రోడ్ల మీద కూడళ్లలో సభలు పెట్టడం తగదు అంటూ ప్రభుత్వం తెచ్చిన జీవో పవన్ కల్యాణ్ చాలా అసహనం కలిగిస్తున్నట్టుగా ఉంది. ఈ క్రమంలోనే, ఎప్పటిలాగానే పవన్ కల్యాణ్ తన రాజకీయ మరియు రాజ్యాంగ అజ్ఞానాన్ని ప్రదర్శించుకుంటున్నారు.
ప్రాథమిక హక్కులకు సంబంధించిన 19వ అధికరణాన్ని ప్రస్తావిస్తున్న పవన్ కల్యాణ్.. అందులోని భావప్రకటన స్వేచ్ఛ అంశానికి తోచిన భాష్యం చెబుతున్నారు. రాజకీయ పార్టీల కార్యక్రమాలు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కిందికి వస్తాయని అంటున్నారు. బాగానే ఉంది. రాజ్యాంగాన్ని కోట్ చేసి భావ ప్రకటన చేయడానికి హక్కు ఉంది కరక్టే.. కానీ, ఆ ముసుగులో వేల మంది జనాన్ని పోగేసి, ఆ తొక్కిడిలో ప్రజల ప్రాణాలతో ఆడుకోవడానికి ఎవరికి హక్కు ఉంటుంది.
చంద్రబాబునాయుడు కందుకూరు, గుంటూరుల్లో నిర్వహించిన సభలు ఏకంగా 11 మంది ప్రాణాలను బలితీసుకున్నప్పుడు.. ఏ రాజ్యాంగప్రస్తావన చేశారు.. పవన్ కల్యాణ్. ఎంపిక చేసిన స్థలాల్లోనే సభలు పెట్టాలనే కొత్త జీవో ను చీకటిజీవో గా అభివర్ణిస్తున్న పవన్ ఎందుకు భయపడుతున్నారో తెలియడం లేదు. ‘‘బ్రిటిష్ కాలం నాటి చట్టం ద్వారా ఆంక్షలు విధిస్తారా?’’ అని రెచ్చిపోతున్న పవన్ కల్యాణ్.. దేశంలో 80 శాతం బ్రిటిష్ కాలం నాటి చట్టాలే అమలవుతున్నాయని తెలియక మాట్లాడుతున్నారా? అనే సందేహం కలుగుతుంది.
ఆయనకు అంతగా ధైర్యం ఉంటే.. బ్రిటిష్ కాలం నాటి చట్టాలన్నింటినీ సరికొత్తగా తిరగరాసి స్వదేశీ చట్టాలను తయారుచేయాలని.. తన మిత్రపక్షం భాజపాను డిమాండ్ చేయాలి. అంతే తప్ప.. ఏ చట్టం అమల్లో ఉంటే దాని ప్రకారం జీవోలు తయారవుతాయిగానీ.. అసలు ఎక్కడా లేని చట్టం ద్వారా జీవో రాదు అని తెలుసుకోవాలి.
ఇంతకూ పవన్ సభలకు అనుమతి అసలు ఇవ్వకపోతే విలపించాలి. అలా కాకుండా, ఎంపిక చేసిన స్థలాల్లో మీటింగులు పెట్టుకోమని అన్నందుకే ఇంత రెచ్చిపోవడం ఎందుకో తెలియదు. నిత్యం జనం తిరిగి రోడ్ల కూడళ్లలో తప్ప తన సభలకు జనం రారని ఆయనకు భయమా? వారాహి యాత్రలో రోడ్ల మీద ప్రసంగించాలనుకున్న తన స్కెచ్ దెబ్బతిన్నందుకు అసహనమా? అని ప్రజలు అనుకుంటున్నారు.