ఏపీ వ్యవహారాల్లో బండి వేలుపెట్టడం ఎందుకు?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నిందలు వేయడానికి, ఆయనను ఇరుకున పెట్టేలా మాటలను సంధించడానికి భారతీయ జనతా పార్టీ నిత్యం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటుందనే సంగతి అందరికీ తెలుసు. ఈ విద్యలో తెలంగాణ సారథి…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నిందలు వేయడానికి, ఆయనను ఇరుకున పెట్టేలా మాటలను సంధించడానికి భారతీయ జనతా పార్టీ నిత్యం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటుందనే సంగతి అందరికీ తెలుసు. ఈ విద్యలో తెలంగాణ సారథి బండి సంజయ్ కాస్త అతిగానే స్పందిస్తుంటారు. తాజాగా భారాసకు ఏపీలోని కొందరు నాయకుల్ని చేర్చుకుని, ఏపీ అధ్యక్షుడిని కూడా నియమించిన కేసీఆర్ గురించి ఆయన అనేక ప్రశ్నలు సంధించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో భారాస వైఖరి ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేయడం మాత్రం చాలా తమాషాగా ఉంది. 

పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచాలో తగ్గించాలో చెప్పాలనే డిమాండ్ ద్వారా ఆయన తాను కేసీఆర్ ను ఇరుకున పెడుతున్నాననే అనుకుంటున్నారు కానీ.. బండి సంజయ్ ముందుగా తెలుసుకోవాల్సినది ఏంటంటే.. అసలు తమ పార్టీ వైఖరి ఏంటి? అనేది. పోలవరం జాతీయ ప్రాజెక్టు, దానిని కేంద్రమే నిర్మిస్తుంది అని సన్నాయి నొక్కులు నొక్కడం తప్ప ఎనిమిదేళ్లుగా పనులు చురుగ్గా సాగనివ్వకుండా పోలవరం ప్రాజెక్టుకు, తద్వారా ఏపీ ప్రజలకు ఎడతెగని ద్రోహం చేస్తున్నది కేంద్రంలోని బిజెపి సర్కారు. 

ఈ నేపథ్యంలో అసలు ఆ ప్రాజెక్టు కేంద్రానిదే గనుక.. ఆ ప్రాజెక్టు ఎత్తు విషయంలో ఆ ప్రభుత్వానికి ఒక వైఖరి అంటూ ఉన్నదా? ఎత్తు పెంచాలో తగ్గించాలో తమ వైఖరి ఏంటో బండి సంజయ్ చెప్పగలరా? అనేది ప్రజల ప్రశ్న. బండి సంజయ్ ఒక్కడూ కాదు, ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమువీర్రాజుతో కలిసి ఒకటే ప్రెస్ మీట్ లో పోలవరంపై బిజెపి వైఖరిని.. దానిని పూర్తి చేయడానికి వారికి అవసరమైన డెడ్ లైన్ ను ప్రకటించగల ధైర్యం వారికి ఉన్నదా అనేది ప్రజల ప్రశ్న.

విశాఖ ఉక్కును ప్రెవేటీకరించడం తగదని ఉద్యోగులు పోరాటం చేస్తుండగా.. తమ ప్రభుత్వం వస్తే ఆ ప్రెవేటీకరణను అడ్డుకుంటాం అని కేసీఆర్ అన్నారు. ఆ హామీని కూడా బండి ఎద్దేవా చేస్తున్నారు. నిజాం సుగర్స్ కేసీఆర్ వచ్చాకే మూతపడ్డాయని అంటున్నారు. నిజాం సుగర్స్ మూత పడడానికి, విశాఖ ఉక్కు ప్రెవేటీకరణకు ముడిపెట్టడం అనేది మోకాలికీ బోడిగుండుకీ ముడిపెట్టినట్టే ఉన్నదనే విమర్శలు ప్రజలనుంచి వస్తున్నాయి.

ఇవన్నీ కూడా ఓకే. కానీ.. భారాస ఏపీలో అడుగుపెడితే అక్కడి వ్యవహారాల గురించి మాట్లాడుతుంటే.. ఏపీలోని భాజపా నాయకులు ఎందుకు స్పందించడం లేదు. ఏపీకి ఏ రకంగా బీజెపీ ద్రోహం చేస్తున్నదో ఆయా అంశాల గురించి కేసీఆర్ మాట్లాడుతోంటే.. ఏపీ ప్రజలకు తన తరఫు హామీ ఇస్తోంటే.. ఏపీ బీజేపీ నాయకులకు నోట మాట రావడం లేదు. కానీ తగుదునమ్మా అంటూ.. తన పరిధిని దాటి బండి సంజయ్ విమర్శలు రువ్వడం ఏపీ యవ్వారాల్లో కూడా వేలుపెట్టడం అతిగా కనిపిస్తోంది.