బాబు, జ‌గ‌న్ పంతంః నువ్వా? నేనా?

సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌నపై టెన్ష‌న్ నెల‌కుంది. ఇటీవ‌ల బాబు ప‌ర్య‌ట‌న‌ల్లో వ‌రుస విషాద ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఈ దుర్ఘ‌ట‌న‌ల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా, ప‌లువురు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. ఈ…

సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌నపై టెన్ష‌న్ నెల‌కుంది. ఇటీవ‌ల బాబు ప‌ర్య‌ట‌న‌ల్లో వ‌రుస విషాద ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఈ దుర్ఘ‌ట‌న‌ల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా, ప‌లువురు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. ఈ నేప‌థ్యంలో జాతీయ‌, రాష్ట్ర ర‌హ‌దారులు, ఇరుకు రోడ్ల‌పై స‌భ‌లు, స‌మావేశాలు, ర్యాలీలు నిర్వ‌హించొద్ద‌ని ఏపీ ప్ర‌భుత్వం నిషేధం విధించింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు కుప్పం నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా ప‌ర్య‌టించాల‌ని ముందుగానే షెడ్యూల్ ప్ర‌క‌టించ‌డం, దానికి పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌నపై అంద‌రి దృష్టి ప‌డింది.

చంద్ర‌బాబు ప్రైవేట్ కార్య‌ద‌ర్శి విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న మేర‌కు…టీడీపీ అధినేత మూడు రోజుల కుప్పం ప‌ర్య‌ట‌న‌లో ఐదు రోడ్‌షోలు ఉన్నాయి. ఒక‌వైపు ప్ర‌జ‌ల ప్రాణాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని రోడ్‌షోలు నిషేధించామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. తాజాగా తీసుకొచ్చిన జీవో ప్ర‌కారం బాబు రోడ్‌షోలు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉన్నాయంటూ… పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. ఈ మేర‌కు ప‌ల‌మ‌నేరు డీఎస్పీ సుధాక‌ర్‌రెడ్డి టీడీపీ నేత‌ల‌కు నోటీసు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతుంద‌ని, షెడ్యూల్ ప్ర‌కార‌మే కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయ‌ని టీడీపీ తేల్చి చెప్పింది.

దీంతో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న అనుకున్న ప్ర‌కారం ముందుకు సాగుతుందా? లేక పోలీసులు అడ్డుకుంటారా? అనే విష‌య‌మై పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీసింది. ఇవాళ మొద‌టి రోజు శాంతిపురం మండ‌లంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ప్ర‌కారం ప్రారంభం కావాలి. పోలీసుల అడ్డ‌గింత‌తో అశాంతిపురం అవుతుందా? లేక సాఫీగా సాగిపోతుందా? అనేది మ‌రికొన్ని గంట‌ల్లో తేలిపోతుంది. జీవో-1 ప్ర‌కారం నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేసేందుకే ప్ర‌భుత్వం ప‌ట్టుద‌ల‌తో వుంది. మ‌రోవైపు వాటిని బేఖాత‌ర్ చేస్తూ జ‌నంలోకి వెళ్లాల‌ని చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

అస‌లే ఎన్నిక‌ల కాలం. ప్ర‌తిదీ రాజ‌కీయంగా పైచేయి సాధించాల‌ని అధినేత‌లు అనుకుంటారు. సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే తిర‌గ‌లేకుంటే, రాష్ట్ర వ్యాప్తంగా నెగెటివ్ సంకేతాలు వెళ్తాయ‌ని చంద్ర‌బాబు భ‌యం. అందుకే కుప్పం ప‌ర్య‌ట‌న‌ను ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న భిన్నంగా వుంది. కుప్పంలోనే బాబును క‌ట్ట‌డి చేస్తే, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల మ‌నోస్థైర్యాన్ని దెబ్బ తీయొచ్చ‌ని ఆలోచిస్తుంటారు. ఈ నేప‌థ్యంలో సొంత నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు, జ‌గ‌న్‌లలో ఎవ‌రి పంతం నెగ్గుతుందో కాసేపట్లో తెలియ‌నుంది.