ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. గతంలో వివిధ కారణాల వల్ల పలు స్థానిక సంస్థలకు ఎన్నికలు ముగిసిపోయిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తాము జోక్యం చేసుకోలేమని ఇటీవల హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టైంది.
ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు, నెల్లూరు కార్పొరేషన్, 12 మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. ఇదే సమయంలో వాయిదా పడిన, స్థానిక ప్రజాప్రతినిధులు మృతి చెంది ఖాళీలు ఏర్పడ్డ చోట కూడా ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 14న పంచాయతీలు, 15న మున్సిపాలిటీ, 16న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నాటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను అడ్డు పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో పరువు కాపాడుకోవాలని ప్రతిపక్ష టీడీపీ భావించింది. అయితే ప్రజాతీర్పు ముందు టీడీపీ ఎత్తులన్నీ చిత్తు అయ్యాయి.
తాజాగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ప్రతిపక్షం ప్రచారం చేస్తున్న నేపథ్యంలో, కనీసం పోటీ అయినా చేస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.