జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను ఒకప్పటి పాత మిత్రుడు, సీపీఐ సీనియర్ నేత జేవీ సత్యనారాయణమూర్తి దుమ్ము దులిపారు. విశాఖ జిల్లా సీపీఐ సీనియర్ నాయకుడైన జేవీ… ఉక్కు పరిశ్రమ ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేనతో సీపీఐ పొత్తు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం బీజేపీతో జనసేన పొత్తు కుదుర్చుకుంది. ఇప్పుడు బీజేపీతో జనసేన పొత్తులో ఉందో , లేదో తెలియని అయోమయ స్థితి. విశాఖలో పవన్ తాజా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోవాలనే డిమాండ్‌పై 262 రోజులుగా అక్కడి కార్మిక సంఘాలు చేస్తున్న దీక్షకు పవన్‌కల్యాణ్ మద్దతు ప్రకటించారు. స్టీల్‌ప్లాంటులో జరిగిన బహిరంగ సభలో పవన్‌కల్యాణ్ ఆవేశంగా ప్రసంగించారు. అయితే ప్రైవేటీకరిస్తున్న కేంద్రంలోని మోడీ సర్కార్‌ను ఒక్కసారైనా ప్రశ్నించకుండా కేవలం జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంపై కార్మికులు, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
తన రాజకీయ స్వార్థం కోసం విశాఖ ఉక్కు ఉద్యమ వేదికను పవన్ వాడుకున్నారని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక చానల్ డిబేట్లో కార్మిక సంఘం నాయకుడు, సీపీఐ సీనియర్ నేత జేవీ సత్యనారాయణమూర్తి తన ఆవేదనను, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.
ఆత్మగౌరవం లేని ఆంధ్రులు చనిపోవడమే మేలని పవన్ వ్యాఖ్యానించడాన్ని తాము ఎంత మాత్రం సహించమని ఆయన హెచ్చరించారు. తనకు మాత్రమే ఆత్మగౌరవం ఉన్నట్టు, ఇతరులెవరికీ లేనట్టు పవన్ వ్యాఖ్యానించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. నిన్నటి సభ ఓ ఈవెంట్‌ను తలపించిందని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
ప్రైవేటీకరణ కాకుండా నిలువరించే శక్తి కేవలం కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయితే రాష్ట్రాన్ని తప్పు పట్టొచ్చన్నారు. అయితే ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినంత చేసిందా లేదా? అనే విషయంపై మాట్లాడితే తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు.
అలా కాకుండా ఇదంతా మీదే బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకోవాలి, కేంద్రం బాధ్యత ఏమీ లేదన్నట్టు మాట్లాడితే ఎలా? అని ఆయన నిలదీశారు. మనం ఎవరితో ఉన్నామో వారినేమీ అనకూడదనే ధోరణితో పవన్ ప్రసంగించారన్నారు. పవన్ చిత్తశుద్ధితో వ్యవహరించినట్టు కనిపించలేదన్నారు.
పవన్ వచ్చి సంఘీభావం తెలిపితే ఢిల్లీ వెళ్దామని అంటారని కార్మికులంతా అనుకున్నారన్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను తప్పు పట్టలేమన్నారు.
అలా కాకుండా అఖిలపక్షాన్ని పిలిచే బాధ్యతను పోరాట కమిటీ తీసుకోవాలని పవన్ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. పోరాటం కమిటీ ఆ బాధ్యతను ఏ విధంగా తీసుకుంటుందని జేవీ సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని డిక్టేట్ చేసే పరిస్థితి పోరాట కమిటీకి వుండదు కదా! అని ఆయన అన్నారు. పోరాట కమిటీ రాజకీయాలకు అతీతంగా, అన్ని పార్టీలను కలుపుకుని విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు ముందుకెళుతోందన్నారు. ఈ వేదిక రాజకీయాలకు వాడుకోకూడదని పోరాట కమిటీ స్పష్టంగా చెబుతోందని ఆయన గుర్తు చేశారు.
ఈ సభా వేదికపై నుంచి తాను గాజువాక నియోజకవర్గం నుంచి ఓడిపోయిన అంశాన్ని ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ విజ్ఞత కలిగిన వ్యక్తి ఎవరూ పవన్‌కల్యాణ్ మాదిరిగా ఓటమి అంశాన్ని ప్రస్తావించరన్నారు. తనను ఓడించారు కాబట్టి ఇలా జరిగిందిని, తానెందుకు పోరాటం చేయాలని ప్రశ్నించడం బుద్ధి హీనత తప్ప మరొకటి కాదని పవన్ వ్యాఖ్యలపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆత్మగౌరవం వుంటే రాజకీయాలను పక్కన పెట్టి విశాఖ ఉక్కు కోసం పోరాడాలని పవన్‌కు ఆయన హితవు చెప్పడం గమనార్హం. అంతే తప్ప, ప్రజలను, పోరాట కమిటీని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్నారు. ప్రైవేటీకరణకు బాధ్యులైన కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట మాట్లాడకుండా సభలో పవన్ మాటలకు కార్మికుల వైపు నుంచి సానుకూలత రాలేదని జేవీ సత్యనారాయణమూర్తి తేల్చి చెప్పారు.