ఒకవైపు ఏపీ మండలి రద్దు తీర్మానం పార్లమెంట్ లో ఉంది. అయితే దాన్ని కేంద్రం పట్టించుకుని ఆమోదిస్తుందని ఎవరూ చెప్పలేరు! ఆ తీర్మానాన్ని ఢిల్లీకి తీసుకెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాన్ని పట్టించుకోవడం లేదు. మండలి రద్దుకు తాము కట్టుబడ్డట్టే అని వైఎస్ఆర్సీపీ అంటున్నా, ఇప్పుడు మండలి ఉంది కాబట్టి.. నియామకాల విషయంలో మాత్రం రాజీ లేదంటోంది.
ఏతావాతా.. ఏపీలో శాసనమండలి ఉనికిలో ఉన్నట్టే. అతి త్వరలోనే మండలిలో బలాబలాలు కూడా తారుమారు కానున్నాయి. ప్రస్తుతం మూడు ఎమ్మెల్సీ సీట్లకు సంబంధించి షెడ్యూల్ వచ్చింది. ఇక స్థానిక సంస్థల కోటాలో 11 మంది మండలి సభ్యులు ఎన్నిక కావాల్సి ఉంది. విశేషం ఏమిటంటే.. ఈ నియామకాలు అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సొంతం అవుతాయి. అసెంబ్లీ, స్థానిక సంస్థల్లో బలాబలాలను బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 ఎమ్మెల్సీలు సొంతం అవుతాయి.
ప్రస్తుతం మండలిలో ఆ పార్టీ బలం 18 అనుకోవాలి. కొత్తగా చేరి వచ్చే సభ్యులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం 32కు పెరగనుంది. 58 మంది సభ్యులున్న మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా మెజారిటీగా మారనుంది. మండలిలో మెజారిటీని అడ్డుపెట్టుకుని టీడీపీ ఇప్పటికే చాలా రాజకీయం చేసింది. ఈ నేపథ్యంలో మండలి రాజకీయం ఇకపై కూడా హాటుగా జరిగే అవకాశం ఉంది.
ఇక మరోవైపు మండలిలో చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది. టీడీపీ చైర్మన్ పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ల ఎన్నిక కూడా జరగాల్సి ఉంది. కొత్త ఎమ్మెల్సీల ఎన్నిక ప్రక్రియ అనంతరం మండలిలో నూతన చైర్మన్ ఎన్నిక మీద దృష్టి సారించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారట. 14 మంది ఎమ్మెల్సీల ఎన్నిక అనంతరమే.. నూతన చైర్మన్ ఎన్నిక ఉంటుందని సమాచారం.