వైఎస్ఆర్సీపీలో ఛాన్స్ ద‌క్కించుకునే ఆ ముగ్గురెవ‌రో!

ఎమ్మెల్యేల కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక‌కు సంబంధించి షెడ్యూల్ విడుద‌లైపోయింది. ఈ పాటికే ఎప్పుడో ఈ ఎన్నిక పూర్తి కావాల్సింది. అయితే క‌రోనా కార‌ణంగా వాయిదాప‌డ్డ ఈ ఎన్నిక‌, త్వ‌ర‌లోనే ఒక కొలిక్కి రానుంది.…

ఎమ్మెల్యేల కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక‌కు సంబంధించి షెడ్యూల్ విడుద‌లైపోయింది. ఈ పాటికే ఎప్పుడో ఈ ఎన్నిక పూర్తి కావాల్సింది. అయితే క‌రోనా కార‌ణంగా వాయిదాప‌డ్డ ఈ ఎన్నిక‌, త్వ‌ర‌లోనే ఒక కొలిక్కి రానుంది. సీఈసీ అయితే ఈ మేర‌కు ఏర్పాట్లు చేసింది కానీ, ఏపీలో కొత్త ఎమ్మెల్సీ అభ్య‌ర్థులెవ‌ర‌నే అంశం ఇంకా క్లారిటీకి రాన‌ట్టుగానే ఉంది.

ఖాళీ అవుతున్న మూడు సీట్లూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ద‌క్కుతాయి. అసెంబ్లీలో బ‌లాన్ని బ‌ట్టి మూడు ఎమ్మెల్సీ సీట్ల‌నూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా సొంతం చేసుకుంటుంది. మ‌రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆ అవ‌కాశాన్ని ఇప్పుడు ఎవ‌రెవ‌రికి ఇస్తారో చూడాల్సి ఉంది.

ఇప్ప‌టికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల్లో చాలా మందికి ర‌క‌ర‌కాల అవ‌కాశాలు ల‌భించాయి. ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారు, టికెట్ల‌ను త్యాగం చేసిన వారు.. ర‌క‌ర‌కాల అవ‌కాశాల‌ను అందిపుచ్చుకున్నారు.

ప్ర‌త్యేకించి ఇటీవ‌లి జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వుల‌తో ప‌ద‌వుల్లేని సీనియ‌ర్లు కొంద‌రు ప‌ద‌వుల‌ను పొందారు. ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన వారిలో ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యుల‌య్యారు. మ‌రి కొంద‌రు ఇప్ప‌టికే ఎమ్మెల్సీల‌య్యారు. ఇప్పుడు మ‌రో మూడు ప‌ద‌వులు అద‌నంగా ల‌భిస్తున్నాయి.

ఇప్పుడు ప‌ద‌వీ కాలాన్ని పూర్తి చేసుకున్న వారిలో ఒక‌రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతే. బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన డీసీ గోవింద రెడ్డి ఇప్పుడు వెకేట్ చేసిన వారిలో ఉన్నారు. అయితే ఆయ‌న‌కు మ‌రో ట‌ర్మ్ ఖాయ‌మ‌ని తెలుస్తోంది. బ‌ద్వేల్ ఉప ఎన్నిక ప్ర‌చారంలో కూడా గోవింద‌రెడ్డి గ‌ట్టిగా తిరిగారు. ఈ మేర‌కు ఆయ‌న‌కు జ‌గ‌న్ నుంచి హామీ ఉంద‌ని, ఆయ‌న‌కు మ‌రో ట‌ర్మ్ ఎమ్మెల్సీ స‌భ్య‌త్వం విష‌యంలో హామీ ల‌భించిన‌ట్టుగా స‌మాచారం.

ఇక మిగిలిన రెండు  సీట్ల విష‌యంలో మాత్రం ఇంకా ఊహాగానాలు కూడా లేవు. వాటిల్లో ఒక‌టి బీసీల‌కూ, మ‌రోటి ఎస్సీల‌కు ద‌క్కే అవ‌కాశం ఉంద‌నే మాట మాత్రం వినిపిస్తూ ఉంది.