కొలువుల జాతర.. నిరుద్యోగానికి పాతర..!

ఒక అభ్యర్ధి.. రెండు ఉద్యోగాలు జగన్‌ డేరింగ్‌కు జనం షేరింగ్‌లు… ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో కొలువుల జాతరను విజయవంతంగా నిర్వహిస్తోంది… ఎక్కడ చూసినా కొత్త ఉద్యోగాలపైనే సరికొత్త చర్చ జరుగుతోంది. గతంలో ఎన్నడూ…

ఒక అభ్యర్ధి.. రెండు ఉద్యోగాలు
జగన్‌ డేరింగ్‌కు జనం షేరింగ్‌లు…

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో కొలువుల జాతరను విజయవంతంగా నిర్వహిస్తోంది… ఎక్కడ చూసినా కొత్త ఉద్యోగాలపైనే సరికొత్త చర్చ జరుగుతోంది. గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగని రీతిలో జగన్‌ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపడుతోందని, అనేక సంవత్సరాలుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నోచుకోని నిరుద్యోగులకు ఇపుడు ఉద్యోగ అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయని జనం చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో నిరుద్యోగ యువత ఆనందానికి అవధుల్లేకపోయాయి. ఒక్కసారిగా ఉద్యోగావకాశాలు విద్యావంతులను వెతుక్కుంటూ వచ్చాయి. ముఖ్యంగా ప్రతిభ కలిగిన వారికి ఈ అవకాశాలు మరింతగా అందివచ్చాయనే చెప్పాలి!

చదువులో ఉత్తమ ఫలితాలు సాధించిన అభ్యర్ధులను వరుసగా రెండు, మూడు ఉద్యోగాలు వరించడం విశేషం! కీలకమైన గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలకు గాను రెండు, మూడు కేటగిరీలకు దరఖాస్తు చేసుకున్న ప్రతిభావంతులైన అభ్యర్ధులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో కుటుంబ సభ్యుల ఆశ్చర్యానికి అవధులుండడం లేదు! అభ్యర్ధులు ఎంపికైన ఉద్యోగాల్లో తమకు నచ్చిన కొలువును ఎంపిక చేసుకుని విధుల్లో చేరుతున్నారు.

గ్రామ సచివాలయ ఉద్యోగాలతో పాటు డిఎస్సీ ఉద్యోగాల జాతర ఇంకోవైపు జరుగుతోంది. ఇదిలావుంటే వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే గ్రామ/వార్డు వాలంటీర్లను నియమించిన విషయం తెలిసిందే! అనంతరం ప్రభుత్వ ఉద్యోగాలకు పలువురు వాలంటీర్లు ఎంపికయ్యారు. దీంతో గ్రామ/వార్డు వాలంటీర్ల పోస్ట్‌లు ఖాళీలయ్యాయి. వెనువెంటనే వాలంటీర్ల పోస్ట్‌లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో మద్యం షాపుల్లో పనిచేసేందుకు నియామకాలు చేపట్టిన విషయం తెలిసిందే!

మద్యం షాపుల్లో ఖాళీలనూ పూరించాలని స్పష్టంచేసింది. వైకాపా ప్రభుత్వం ఏర్పడి అర్ధ సంవత్సరం కాకుండానే ఉద్యోగాల విషయంలో జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చొరవ ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల విషయంలో గత చంద్రబాబు అనుసరించిన తీరుపైనా చర్చ జరుగుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ సాగించిన ఎన్నికలలో ప్రధానంగా 'జాబు రావాలంటే బాబు రావాలి' అంటూ పెద్దఎత్తున ప్రచారం చేశారు.

అధికారంలోకి రాగానే కొత్త జాబుల మాటెలా ఉన్నప్పటికీ ఉన్న జాబులను ఊడగొట్టారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. చంద్రబాబు నిరుద్యోగులకు అన్యాయం చేసి, తన కుమారుడు లోకేష్‌కు మాత్రం మంత్రి కొలువునిచ్చి ఆ విధంగా న్యాయం చేశారని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో ఇదే అంశాన్ని జగన్‌మోహన్‌రెడ్డి తమకు అనుకూలంగా వాడుకున్నారు. అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయ వ్యవస్థను పటిష్టం చేస్తామని, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకుస్తామని ఎన్నికల్లో హామీలిచ్చారు.

ప్రతి గ్రామానికి పదిమంది గ్రామ వాలంటీర్లను నియమించడంతో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థలో పర్మినెంట్‌ ఉద్యోగులను భర్తీ చేస్తామని హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రక్రియలను ప్రారంభించడం, వేలాది మందికి ఉద్యోగాలు కల్పించడం చూసి జనం ఇపుడు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ నియామకపు ప్రక్రియలను వేగవంతం చేయడంతో పాటు పారదర్శకంగా నియామకాలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని అభ్యర్ధులు స్పష్టం చేస్తున్నారు.

ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రజా ప్రతినిధులు వేలుపెట్టే అవకాశం లేకుండా చూడటంలో ప్రభుత్వం విజయవంతమైందని నిపుణులు పేర్కొంటున్నారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, ఇతర ప్రాధాన్యతలను అనుసరించి, కేవలం ప్రతిభ ఆధారంగానే ఉద్యోగ నియామకాలు జరుపుతున్నారంటూ అభ్యర్ధులు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లలో పెద్దఎత్తున షేర్‌ చేస్తుండటం గమనార్హం!
-డి.శ్రీనివాస్‌కృష్ణ

ఆంధ్రా రాజకీయం.. ఈవారం స్పెషల్ 'గ్రేట్ ఆంధ్ర' పేపర్