రాజకీయ పార్టీల అధినేతలు ఎప్పుడూ ఆశావహ దృక్పథంతోనే ఉంటారు. వారు కుంగిపోయే, డిప్రెషన్లో పడే సందర్భాలు అనేకం వస్తాయి. కాని మళ్లీ ఏవో ఆశలు చిగురింపచేసుకొని మంచి రోజులు వస్తాయని అనుకుంటూ ముందుకు సాగుతారు. సామాన్య ప్రజల్లా వారు కుంగిపోతే రాజకీయాల్లో మనుగడ సాగించలేరు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటమిని జీర్ణం చేసుకోలేక చాలాకాలం మధనపడ్డారు.
ప్రజలు తనను ఎందుకు ఓడించారో అర్థం కావడంలేదంటూ తీవ్ర ఆవేదనతో కుంగిపోయారు. 'నేను ఏం తప్పు చేశాను చెప్పండి' అంటూ విలపించారు. కాని ఇలా ఎన్నాళ్లో బాధపడుతూ కూర్చోలేరు కదా. ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్న చంద్రబాబు క్రమంగా కోలుకొని జగన్ ప్రభుత్వంపై పోరాటం ప్రారంభించారు. అదేపనిగా వెదకాలేగాని ప్రతిపక్షానికి ప్రభుత్వంలో అనేక తప్పులు కనబడతాయి. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చంద్రబాబు అనేక తప్పులను, లోటుప్లాట్లను, ప్రభుత్వం వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను, సమస్యలను లిస్టవుట్ చేశారు.
ముఖ్యంగా రాజధాని నిర్మాణంపై గందరగోళం, ఇసుక కొరతవంటి ప్రధాన సమస్యలపై టీడీపీ పోరాటం చేస్తోంది. 'నా పాలనలో ప్రజలు సమస్యలు లేకుండా హాయిగా బతికారు' అని ఈమధ్య అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. ఇసుక కొరతపై పోరాటం ప్రధానాంశంగా జనసేన పార్టీ తలపెట్టిన 'లాంగ్‌మార్చ్'కు చంద్రబాబు మద్దతు ఇవ్వడమే కాకుండా అందులో పార్టీ నేతలను భాగస్వాములను చేశారు. మిగతా ప్రతిపక్షాలన్నీ లాంగ్ మార్చ్‌కు దూరంగా ఉన్నా టీడీపీ మాత్రం పూర్తి మద్దతు ఇచ్చింది.
బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం తప్పేనని, ఆ పని చేయకుండా ఉండాల్సిందని చంద్రబాబు పశ్చాత్తాపపడుతున్నారు. బీజేపీ వాళ్లేమో చంద్రబాబుకు శాశ్వతంగా తలుపులు మూసేశామని తెగ చెప్పేస్తున్నారు. టీడీపీని బీజేపీలో విలీనం చేయడం మంచిదని వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని, జనసేనను దగ్గరకు చంద్రబాబు దగ్గరకు తీసుకుంటారని, పొత్తు పెట్టుకొని పోటీ చేస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి. అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పడం కష్టం.
జగన్ పరిపాలనపై చంద్రబాబు, టీడీపీ నాయకులు విరుచుకుపడని రోజు లేదు. రెండు పార్టీల మధ్య అనుక్షణం మాటల యుద్ధం జరుగుతోంది. మాటల యుద్ధం ఎంతకాలం జరిగినా ఏం ప్రయోజనం? చేతల యుద్ధం కావాలి కదా. ప్రజాస్వామ్యంలో చేతల యుద్ధమంటే బాహాబాహీ, ముష్టాముష్టి కాదు కదా. బలాలు తేల్చుకోవడానికి ఎన్నికల బరే సరైన వేదిక. అలాంటి బరి బాబుకు కనబడుతోంది. అదే మున్సిపల్ ఎన్నికల బరి. ఏపీలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుతుందని చంద్రబాబు గట్టి విశ్వాసంతో ఉన్నారు.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న పార్టీకి మున్సిపల్ ఎన్నికలు జీవం పోస్తాయని ఆశపడుతున్నారు. టీడీపీ ఓడిపోగానే బీజేపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. తనకు కుడి ఎడమ భుజాలుగా ఉన్న నేతలు ఎన్నికలు కాగానే బీజేపీలోకి వెళ్లడం టీడీపీకీ మొదటి బలమైన దెబ్బ. వీరిని ప్లాన్ ప్రకారమే చంద్రబాబు బీజేపీలోకి పంపారనే వాదన ఒకటి ఉంది. దాన్ని అలా పక్కన పెడితే వలసలు సాగుతున్నాయనేది నిజం.
తాజాగా వల్లభనేని వంశీ ఎపిసోడ్ చూశాం. పార్టీని బతికించుకోవడానికి తానే కష్టపడాలి కాబట్టి ప్రతి జిల్లాలో తిరుగుతున్నారు బాబు. ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై రివ్యూ చేస్తున్నారు. వలస వెళ్లాలనుకున్నవారిని బుజ్జగిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఆయన జిల్లా జిల్లాకు వెళుతున్నారు. ప్రతి జిల్లాలో రెండుమూడు రోజులు మకాం వేసి పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలకు వెళ్లారు. డిసెంబరు వరకు బాబు జిల్లా పర్యటనలు కొనసాగుతూనే ఉంటాయి.
బాబు తన జిల్లా పర్యటనల్లో భవిష్యత్తులో బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు విషయమై సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం. కేడర్‌లో ధైర్యం నింపడానికే ఆయన ఈ సంకేతాలు ఇస్తున్నారట..! జగన్ అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. రాజధాని నిర్మాణంపై గందరగోళం, ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికుల ఆత్యహత్యలు టీడీపీలో ఆశలు పెంచుతున్నాయి.
ఇక అక్రమాస్తుల కేసులో నిందితుడైన జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరుకావల్సిందేనంటూ ఆదేశాలు రావడం చంద్రబాబుకు బాగా సంతోషం కలిగిస్తోంది. జగన్‌పై విరుచుకుపడటానికి ఇది ఆయుధంగా ఉపయోగపడుతుంది. మొత్తంమీద మున్సిపల్ ఎన్నికలు జగన్‌కు పరీక్షగా, బాబుకు ఆశాజనకంగా మారుతాయా?