మైనర్‌ లవ్‌ దారుణాలు..!

'మీరు రోజులో కనీసం రెండు గంటలైనా మీ పిల్లలతో గడపలేకపోతే.. మీరు పిల్లల్ని కనడం కూడా వ్యర్థమే..' అంటాడు ఒక మానసిక నిపుణుడు. అయితే సంతతి ఉంటే సగం బలంగా భావించే మన సమాజం…

'మీరు రోజులో కనీసం రెండు గంటలైనా మీ పిల్లలతో గడపలేకపోతే.. మీరు పిల్లల్ని కనడం కూడా వ్యర్థమే..' అంటాడు ఒక మానసిక నిపుణుడు. అయితే సంతతి ఉంటే సగం బలంగా భావించే మన సమాజం మాత్రం ఇప్పుడు ఆ ప్రాథమిక విషయాన్ని మరిచిపోతోంది. ఉద్యోగాలు, సంపాదనలే బాధ్యతగా తీసుకుని.. ఆఖరికి పిల్లలు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోని దశకు చేరుకున్నారు. తెలంగాణలోని హయత్‌ నగర్‌లో ఒక మైనర్‌ బాలిక తన తల్లిని దారుణంగా హతమార్చడంలో సహకరించిన వైనం ఎన్నో ఆశ్చర్యాలకు గురిచేస్తుంది. చిన్న వయసులోనే చెడు స్నేహాలు ఆ అమ్మాయిని అలాంటి పనికి పురిగొల్పించిన వైనాన్ని పోలీసులు స్పష్టంగా వివరించారు.

ఒక కుర్రాడితో ప్రేమ- గర్భం, ఆపై అబార్షన్‌, దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని ఇంకొకడు ఆ అమ్మాయిని ఆటవస్తువుగా మార్చుకున్నాడు. ఆఖరికి డబ్బు కోసం ఆ అమ్మాయి తల్లికే ప్రణాళిక వేశాడు. దానికిగానూ ఆ టీనేజర్‌ను వాడుకున్నాడు. ఆఖరికి ఇంట్లోనే తల్లిని కూతురు సహకారంతో చంపాడు. అయితే అంత జరిగే పరిస్థితికి వచ్చినా.. తమ కూతురు ఏం చేస్తోందో, ఎవరిని కలుస్తోందో, ఆమె అబార్షన్‌ చేయించుకునే వరకూ వచ్చిందనే విషయాలను ఆ తల్లిదండ్రులు గుర్తించలేదా! అనేదే విషాదకరమైన విషయం.

తల్లిని హత్య చేయించడానికి ముందు ఆ అమ్మాయికి ప్రియుడు విపరీతంగా మద్యం తాగించాడనే వార్తలు గగుర్పొడిచేవిలా ఉన్నాయి. పిల్లలు ఏం చేస్తున్నారు? ఎవరితో తిరుగుతున్నారు? వారి స్నేహాలు ఎవరితో సాగుతున్నాయి? అనే విషయాల గురించి తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎంతైనా అవసరం. అలాంటి పర్యవేక్షణ ఇలాంటి ఘటనల్లో ఏమాత్రం లేని వైనం స్పష్టం అవుతోంది. పిల్లలను ఎక్కడో హాస్టల్స్‌లో ఉంచి చదివించడం ఈ రోజుల్లో ఒక స్టేటస్‌ సింబర్‌ అయిపోయింది.

బాల్యం నుంచి వాళ్లను దూరదూరంగా ఉంచడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. కేవలం హాస్టల్స్‌లో ఉంచడంతోనే చదువు వస్తుందనే భ్రమలో బతుకున్నారు మన సమాజంలోని తల్లిదండ్రులు. పిల్లలకు మొదటి నుంచి సన్నిహితంగా, వారు టీనేజ్‌లోకి వచ్చాకా వారి కార్యకలాపాల గురించి, స్నేహాల గురించి తల్లిదండ్రులు ఎంతగా తెలుసుకుంటే.. పిల్లలను అంత చక్కగా మంచి దారిలో నడిపించుకోవడానికి వీలుంటుంది.
-ఎల్‌.విజయలక్ష్మి

ఆంధ్రా రాజకీయం.. ఈవారం స్పెషల్ 'గ్రేట్ ఆంధ్ర' పేపర్