విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్న టైమ్ లో ఆంధ్రప్రదేశ్ లో మరో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలంలోని ఓ పాల డెయిరీలో గ్యాస్ లీక్ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కార్మికులందరికీ ప్రాణాపాయం తప్పింది.
మండలంలోని బండపల్లిలో హట్సన్ పాలడెయిరీ ఉంది. పాలను నిల్వ చేసేందుకు అమ్మోనియం గ్యాస్ ను ఉపయోగిస్తున్నారు. ఆ ఛాంబర్ లో నిన్న అర్థరాత్రి ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవ్వడంతో అక్కడ పనిచేస్తున్న 14 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే నిర్వహకులు స్పందించి బాధితులందర్నీ సమీపంలోని హాస్పిటల్స్ లో జాయిన్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
వివిధ హాస్పిటల్స్ లో జాయిన్ చేసిన కార్మికుల్లో 12 మంది కోలుకున్నారు. ఇద్దరు ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం కలెక్టర్ భరత్ గుప్తా పరిస్థితిని సమీక్షిస్తున్నారు,
ప్రభుత్వం ఆదేశాల మేరకు సదరు డెయిరీపై పోలీసులు కేసు నమోదుచేశారు. క్షేత్రస్థాయిలో పరిశ్రమను సందర్శించిన పూతలపట్టు ఎస్సై.. గ్యాస్ లీక్ ను పూర్తిగా నివారించారని, పరిస్థితి అదుపులోనే ఉందని ప్రకటించారు. మొత్తమ్మీద అంతా సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.