అమరావతి రైతులది ఎంత స్వార్థమంటే..?

అమరావతి రైతుల మహా పాదయాత్ర ఈరోజు మొదలవుతోంది. వీళ్లది ఎంత స్వార్థమంటే.. మన ఊళ్ల నుంచి వెళ్తూ, వాళ్ల ఊళ్లు బాగుపడాలని కోరుకుంటున్నారు. దాన్లో తప్పేమీ లేదు కానీ, వాళ్ల ఊళ్లు మాత్రమే బాగుపడాలని…

అమరావతి రైతుల మహా పాదయాత్ర ఈరోజు మొదలవుతోంది. వీళ్లది ఎంత స్వార్థమంటే.. మన ఊళ్ల నుంచి వెళ్తూ, వాళ్ల ఊళ్లు బాగుపడాలని కోరుకుంటున్నారు. దాన్లో తప్పేమీ లేదు కానీ, వాళ్ల ఊళ్లు మాత్రమే బాగుపడాలని కోరుకోవడమే వీరు చేస్తున్న తప్పు. మూడు రాజధానుల వల్ల వచ్చే ప్రయోజనాలు మీకెందుకివ్వాలి, కేవలం మేం మాత్రమే రాజధానిలో ఉండాలనేది వీరి పంతం. మరి వీరి కోర్కెను దేవుడెందుకు మన్నిస్తాడు.

అయ్యా మేం రాజధాని అమరావతి వాసులం, మీ ఊరిలో రాత్రి బస చేస్తాం, మీ మద్దతు మాకివ్వండి, అమరావతికి జై అనండి అంటారు. మరి కోస్తా జిల్లాల జనం ఏమవ్వాలి. అభివృద్ధి వికేంద్రీకరణతో మీకు దక్కే ఫలాలను కూడా మేం అమరావతికి ఎగరేసుకుపోతాం అని నిర్దయగా చెప్పేస్తున్నారు వీళ్లు. దానికి మిగతా జనాలంతా తల ఊపాలా..? అమరావతి రైతుల కోసం తమ అభివృద్ధిని త్యాగం చేయాలా..?

అమరావతి రైతులకు అసలు అన్యాయం జరగలేదనేది రాష్ట్రమంతా తెలిసిన విషయమే. భూముల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ప్రభుత్వానికి ఇచ్చిన దాంట్లో.. నెలనెలా కౌలు డబ్బులు వస్తున్నాయి. ఏడాదికేడాది ఆ కౌలు పెరిగేదే తప్ప తరిగేది కాదు. అందులోనూ వానొచ్చినా, వరదొచ్చినా, కరువొచ్చినా ఆ డబ్బులు ఆగేవి కావు. ప్రభుత్వం నుంచి అంత లాభం పొందుతున్నా ఇంకా ఆకలెందుకని మిగతా జిల్లాల వారు ప్రశ్నిస్తే అమరావతి రైతులు దేవస్థానం వెళ్తారా..? న్యాయస్థానానికి తిరిగి వెళ్తారా..?

నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు మహా పాదయాత్ర. 45 రోజుల ఈ టూర్ లో 70 ముఖ్యమైన గ్రామాల ద్వారా వీరి యాత్ర సాగుతుంది. మరి అన్ని గ్రామాలూ నాశనం అయిపోవాలి, అమరావతి మాత్రమే బాగుండాలనేది వీరి ఆలోచన. ప్రతి ఊరిలోనూ టీడీపీ నేతలు స్వాగతం పలకడం, వీర తిలకం దిద్దడం, రాచమర్యాదలు చేసి, రాత్రికి బస ఏర్పాట్లు చేసి వారిని సాగనండపం అనేది కామన్ పాయింట్ అని తేలింది. ఆ మేరకు టీడీపీ అధిష్టానం కూడా ఆదేశాలిచ్చేసింది.

ఇక కాంగ్రెస్ తరపున కూడా వీరికి మద్దతుగా పార్టీ నాయకులు తరలి వస్తారని అంటున్నారు. మొత్తమ్మీద సింపుల్ గా చేసుకోండి అంటూ డీజీపీ నిబంధనలు పెట్టినా.. టీడీపీ నేతల హంగామాతో.. ఓ భారీ కార్యక్రమంగా మహా పాదయాత్ర రూపొందింది. పోలీసులు ఆంక్షలు విధిస్తే.. అన్యాయం, అక్రమం, అణచివేత అంటూ.. రెచ్చిపోవాలనేది వీరి ప్లాన్. సో.. ఓ ప్లాన్ ప్రకారం వెళ్తోన్న టీడీపీ ప్లస్ అమరావతి రైతుల నిరసన ఎంతమేరకు సక్సెస్ అవుతుంతో చూడాలి.

సర్వేజనా సుఖినోభవంతు అనేది నానుడి. అమరావతి జనం మాత్రమే సుఖినోభవంతు అనే పేరుతో ఇప్పుడు ఉద్యమం జరుగుతోంది. మరి దీనికి మిగతా ప్రాంతాల వాసులు ఎలా మద్దతిస్తారో వేచి చూడాలి.