ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభ్యులంతా, శాసనసభలో ఏకతాటిపైకొచ్చి తీర్మానం చేస్తారు. అసెంబ్లీలో తీర్మానం చేశారంటే అది ప్రజాతీర్మానం కిందే లెక్క. ప్రజాస్వామ్యంలో అంతకుమించి మరో పెద్ద ఆప్షన్, మంచి ప్రత్యామ్నాయం లేదు. కానీ పవన్ కల్యాణ్ కు మాత్రం ఇలాంటి తీర్మానంపై గౌరవం లేదు, లెక్క లేదు. ఆయన దృష్టిలో తీర్మానం అంటే చేతులు దులుపుకోవడం.
అసెంబ్లీ తీర్మానం బదులు అఖిలపక్షం అడుగుతున్నారు పవన్. నిజంగా అసెంబ్లీలో చేసిన తీర్మానం కంటే అఖిలపక్షం గొప్పదా? తాను, తన పార్టీ అసెంబ్లీలో లేదు కాబట్టి, అఖిలపక్షంతో అయినా తన పాత్ర ఉంటుందని అనుకుంటున్నారా..? అసలు పవన్ కి కావాల్సిందేంటి..?
విశాఖ ఉక్కు సమస్య పరిష్కారం కావడం పవన్ కి ఇష్టంలేదు. ఆ పేరుతో వచ్చే ఎన్నికల వరకు జనంలో ఉండి.. కాస్తో కూస్తో క్యాపిటల్ సిటీలో మైలేజీ పెంచుకుని, తనని కాదన్న గాజువాక వాసులకు తానే ప్రత్యామ్నాయం అనే పేరు తెచ్చుకునేలా బిల్డప్ ఇవ్వడం పవన్ కోరిక. దానికి తగ్గట్టుగానే ఆయన విశాఖ సభలో శివాలెత్తారు.
సమస్య పరిష్కారం కావాలంటే నేరుగా కేంద్రం వద్దకు వెళ్లి పవన్ అభ్యర్థించాలి, లేదా గొడవ పడాలి. అంతేకానీ.. ఇలా వైసీపీ భుజంపై తుపాకీ పెట్టి కాల్చాలనుకోవడం నిజంగా పవన్ అవివేకం. అందులోనూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని తక్కువచేసి చూడటం పవన్ కి ఉన్న రాజకీయ పరిజ్ఞానం ఏపాటిదో తెలియజెప్పింది.
ఎంపీలు గొడవ చేస్తే పరిష్కారం దొరుకుతుందా?
ఎంపీలు గొడవ చేస్తే అత్యంత కీలకమైన ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే ఆగిపోలేదు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆగిపోతుందా. అప్పట్లో ఆంధ్రా ప్రాంతానికున్న 25మంది ఎంపీలు సమైక్యాంధ్ర కావాలన్నారు. తెలంగాణకు ఉన్న 17మంది ఎంపీల్లో కేవలం 10మంది మాత్రమే ప్రత్యేక తెలంగాణ కోసం గట్టిగా పోరాడారు. ఎంపీల సంఖ్యే ప్రధానం అయితే అప్పుడు సమైక్య వాదనే నెగ్గాలి కదా. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఏపీని నిట్టనిలువునా చీల్చేసింది.
ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఏకపక్షంగా ఉక్కు ప్రైవేటీకరణకు మొగ్గు చూపింది. పవన్ కల్యాణ్ ఇప్పుడు కేంద్రం మనసు కరిగించాలి కానీ, ఎంపీలతో మాత్రమే పని అవుతుందనుకుంటే పొరపాటే. అలా అని వైసీపీ ఎంపీలు సైలెంట్ గా లేరు. తమ ప్రయత్నాలు తాము చేస్తూనే ఉన్నారు. ప్రజలు చూస్తున్నారు.
అఖిలపక్ష తీర్మానాన్ని పట్టించుకునేదెవరు..?
అసెంబ్లీ తీర్మానాన్నే కేంద్రం పట్టించుకోని సందర్భంలో ఇక అఖిలపక్షం తీర్మానాన్ని పట్టించుకుంటుందా..? పోనీ అఖిలపక్షం కలుస్తానంటే అనుమతి ఇస్తుందా..? అంత సావధానంగా వినే ఓపిక కేంద్రానికే ఉంటే ఈ పాటికే సమస్య పరిష్కారం అయ్యేది. కానీ అలా కాలేదంటే.. కచ్చితంగా కేంద్రం వైఖరి ఏంటో స్పష్టమైంది.
పోనీ పోరాటాలతోనే ఫలితం వస్తుందనుకుంటే పవన్ కల్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమకారుల్ని తీసుకుని తానే హస్తిన వెళ్లాలి. పోరాటం చేయాలి. కానీ మన ఆరాటం ఏపీకే పరిమితం, పోరాటం ఏపీ సర్కారుకే పరిమితం. ఇలాంటి విధానాలు కొనసాగిస్తే.. పాతికేళ్లు కాదు, మరో యాభయ్యేళ్లు పవన్ రాజకీయాల్లో ఉన్నా ఫలితం ఉండదు.