ధనాధన్ క్రికెట్ అనుకున్న టీ20 ప్రపంచకప్ పరమ పేలవంగా మారింది. టీమిండియా వరసగా రెండు మ్యాచ్ లలో ఓడటం తర్వాత సగటు భారత క్రికెట్ అభిమానికి కలిగే ఫీలింగ్ కాదిది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లు అయితే మరీ దారుణం. లీగ్ దశ ఆరంభంలోనే ఈ సారి టీ20 ప్రపంచకప్ పై అనాసక్తి కలగడానికి కారణం, పిచ్ ల తీరు.
ఓడిపోయిన క్రికెట్ జట్టు పిచ్ ను నిందిస్తే అదో లెక్క. అయితే ఇప్పుడు క్రికెట్ చూసే వాళ్లు కూడా ఇవేం పిచ్ లు రా బాబోయ్ అనుకోవాల్సి వస్తోంది. దుబాయ్ వేదికగా ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ ల ఫలితాలను పరిశీలిస్తే.. నిన్నటి ఇండియా – న్యూజిలాండ్ మ్యాచ్ తో సహా ప్రతి మ్యాచ్ లోనూ రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే నెగ్గింది!
గమనించాల్సిన అంశం ఏమిటంటే.. టాస్ నెగ్గిన ప్రతి జట్టూ ముందుగా బౌలింగే తీసుకుంటుంది. అంతే ఇక.. మొదట బ్యాటింగ్ చేసే జట్టు ముక్కుతూ, మూలుగుతూ బ్యాటింగ్ సాగిస్తుంది. ఆరేడు ఓవర్లు అయ్యే సరికే.. ఇంకా అన్ని ఓవర్లు చూడాలా! అనే ఫీలింగ్ వీక్షకుడికి మొదలవ్వాల్సిందే.
మరీ హైస్కూల్ పిల్లల క్రికెటర్ల తరహాలో పేరున్న బ్యాట్స్ మెన్ల ఆట సాగుతూ ఉంటే.. వీక్షకాదరణ ఎలా లభిస్తుంది? ఇది కేవలం భారత క్రికెటర్లకే కాదు.. టీ20 క్రికెట్ కు నిర్వచనాన్ని ఇచ్చే వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ , ఇదే తరహా క్రికెట్లో అపారమైన అనుభవం ఉన్న ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ ది కూడా ఇదే పరిస్థితి! మొదట బ్యాటింగ్ చేస్తే.. బాల్ ను టచ్ చేయడానికే అపసోపాలు పడతారు.
మొదట బ్యాటింగ్ చేసిన జట్టు వంద నుంచి నూటాభై పరుగులు చేయడం గగనం. అది కూడా పడుతూ లేస్తే 150 చేస్తే అదే ఎక్కువ. ఇక రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టు కు సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉన్నట్టే.
ఆ పై మంచు ప్రభావంతో బాల్ బౌలర్ల నుంచి జారాల్సిందే! ఇండియా- పాక్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా అల్లాడి పోయింది. అదే పాక్ మాత్రం పది వికెట్లను చేతిలో పెట్టుకుని మ్యాచ్ ను ముగించింది!
ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ల మ్యాచ్ కథా ఇదే. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఇబ్బంది పడితే, ఇంగ్లండ్ మంచినీళ్ల ప్రాయంగా మ్యాచ్ నెగ్గింది. ఇండియా, కివీస్ మ్యాచ్ కథా ఇదేనని వేరే చెప్పనక్కర్లేదు.
ఈ మ్యాచ్ ల వరసను గమనిస్తే.. ఊరికే టాస్ వేసి విజేతను నిర్ణయించేయడం మంచిదిలాగుంది. ఇక మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేదు. టాస్ నెగ్గిన వారు బౌలింగ్ అనడం, మ్యాచ్ నెగ్గడం. ఇండియా, కివీస్ లపై పాక్ వరసగా నెగ్గింది. ఆ రెండు మ్యాచ్ లలో ఆ జట్టు టాస్ నెగ్గి, బౌలింగ్ తీసుకుంది. ఆఫ్ఘాన్ తో మ్యాచ్ లో పాక్ టాస్ ఓడినా, ఆ జట్టును గెలిపించడానికి అన్నట్టుగా ఆఫ్గాన్ జట్టు ముందు బ్యాటింగ్ తీసుకుంది!
స్థూలంగా ఆయిల్ రిచ్ కంట్రీస్ లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ పేలవంగా, ప్రహసనంగా సాగుతూ ఉంది. అలా అని క్రికెట్ అంటే బ్యాట్స్ మెన్లదేనా? అని కొందరు ప్రశ్నించవచ్చు. టీ20 క్రికెట్ అంటే.. హిట్టింగే ఆశిస్తాడు సగటు అభిమాని. అలాంటి ధనాధన్ క్రికెట్ వద్దనుకుంటే ఎంచక్కా టెస్టు క్రికెట్ చూసుకోవచ్చు. దానికో ఫార్మాట్ ఉన్నప్పుడు… ఈ తరహా లో టీ20 మ్యాచ్ లను నిర్వహించడం కూడా శుద్ధదండగ! వాస్తవానికి ఈ ప్రపంచకప్ ఇండియాలో జరగాల్సింది. అయితే కరోనా కారణంగా వేదిక మారి, ఇలా తయారయ్యింది.