చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ ను సాధించిన ఇస్రో మిషన్ చంద్రయాన్- 3 ముగింపు దశకు చేరుకుంటోంది. మరో ఏడు రోజుల వ్యవధిలో చంద్రయాన్ 3 మిషన్ పూర్తి కానుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ ను సాధించిన తొలి అంతరిక్ష పరిశోధన సంస్థగా ఇస్రో అద్భుతం సాధించింది ప్రయోగంతో. అక్కడ ల్యాండింగ్ ను సాధించడమే అతి పెద్ద విజయం అని ప్రపంచం ప్రశంసిస్తోంది.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై ప్రజ్ఞాన్ రోవర్ తన పరిశోధన కొనసాగిస్తూ ఉంది. అక్కడి తలాన్ని విశ్లేషిస్తూ ఉంది. దక్షిణ ధ్రువంపై ఉన్న నీటి జాడలు, అక్కడ ఉన్న పరిస్థితుల గురించి ఫొటోల రూపంలో తన పరిశీలనలను ప్రజ్ఞాన్ రోవర్ పంపుతూ ఉంది. తాజాగా తనను చంద్రుడి మీదకు తీసుకొచ్చిన విక్రమ్ ల్యాండర్ ఫొటోలను ప్రజ్ఞాన్ రోవర్ తీసి పంపింది. వాటిని ఇస్రో విడుదల చేసింది.
14 రోజుల వ్యవధితో చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధన కొనసాగించడానికి ఇస్రో ఈ రోవర్ ను పంపింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై లూనర్ డేలో భాగంగా 14 రోజుల పాటు ఏ మాత్రం వెలుతురు పడే అవకాశం లేదని, మామూలుగానే ఆ ప్రాంతంలో సూర్య కిరణాలు పడకపోవడంతో ఉష్ణోగ్రత అతి శీతలంగా ఉంటుందని చంద్రయాన్ 3 సందర్భంగా పరిశోధకులు చెబుతున్నారు. అలాంటి చోట ల్యాండింగే అతి పెద్ద విజయంగా, ప్రపంచంలో ఏ దేశానికీ ఇప్పటి వరకూ సాధ్యం కాని ఫీట్ గా నిలుస్తోంది.
ల్యాండింగ్ కు తోడు.. ప్రజ్ఞాన్ అక్కడి పరిస్థితుల గురించి పంపే ఫొటోలు తదుపరి అధ్యయనాలకు ఊతంగా నిలిచే అవకాశం ఉంది. విజయవంతం అయినప్పటికీ.. 14 రోజుల వ్యవధితో చంద్రయాన్ 3 మిషన్ ముగింపు దశకు చేరుకుంటుందని తెలుస్తోంది.