80 శాతం ఇండియ‌న్స్ మోడీ ప‌ట్ల అనుకూలంగాన‌ట‌!

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్నం అవుతూ ఉండ‌టంతో ర‌క‌ర‌కాల స‌ర్వేలు, ప‌బ్లిక్ ప‌ల్స్ లు ఒక‌దానితో మ‌రోటి సంబంధం లేకుండా షికారు చేస్తూ ఉన్నాయి! తాజాగా అమెరికాకు చెందిన పెవ్ రీసెర్చ్ సెంట‌ర్ ఒక అధ్య‌య‌నాన్ని…

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్నం అవుతూ ఉండ‌టంతో ర‌క‌ర‌కాల స‌ర్వేలు, ప‌బ్లిక్ ప‌ల్స్ లు ఒక‌దానితో మ‌రోటి సంబంధం లేకుండా షికారు చేస్తూ ఉన్నాయి! తాజాగా అమెరికాకు చెందిన పెవ్ రీసెర్చ్ సెంట‌ర్ ఒక అధ్య‌య‌నాన్ని ప్ర‌చురించింది. దాని ప్ర‌కారం దేశంలో ఏకంగా 80 శాతం మంది ప్ర‌జ‌లు మోడీ ప‌ట్ల సానుకూలంగా ఉన్నార‌ట‌! మోడీ నాయ‌క‌త్వంలో భార‌త‌దేశానికి ఎన‌లేని మేలు జ‌రుగుతంద‌ని వీరు ఫీల‌వుతున్నార‌ట‌! ఈ విష‌యాల‌ను ఆ సంస్థ చెప్పుకొచ్చింది!

మ‌రీ 80 శాతం అంటే చాలా ఎక్కువైందేమో! ఒక‌వేళ మోడీ ప‌ట్ల భార‌తీయులు వ్య‌తిరేక‌త‌తో ఉన్నార‌ని ఆ అమెరిక‌న్ సంస్థ అధ్య‌య‌నం ప్ర‌చురించి ఉంటే, భ‌క్తులు అమెరికా అంటూ విరుచుకుప‌డే వారు. అయితే అంతా మోడీమ‌యం అంటూ ఆ సంస్థ చెప్ప‌డంతో భ‌క్త‌గ‌ణాగ్రేస‌రులు ఈ అధ్య‌య‌నాన్ని షేర్ చేస్తూ ఉన్నారు!

ఇటీవ‌లే క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ అంతా తానై ప్ర‌చారం చేశారు. ఆ రాష్ట్రంలో ఏకంగా నెల రోజుల పాటు పండ‌గ‌లా సాగింది ప్ర‌ధాని మోడీ ఎన్నిక‌ల ప్ర‌చారం. ముఖ్య‌మంత్రి ఎవ‌ర‌నేది అవ‌స‌రం లేదు, త‌న‌ను చూసి ఓటేయండ‌న్న‌ట్టుగా మోడీ ప్ర‌చారం చేశారు. మ‌తం అంశాన్ని విప‌రీతంగా వాడారు. కేర‌ళ స్టోరీ వంటి సినిమాను కూడా వ‌ద‌ల‌కుండా వాడుకున్నారు! అంత చేస్తే బీజేపీకి క‌నీసం 40 శాతం ఓట్లు రాలేదు! సీట్ల సంగ‌తి స‌రేస‌రి!

మ‌రి క‌ర్ణాట‌క‌లో అధికారం చేతిలో ఉండి, బీజేపీ త‌ర‌ఫున అంతా తానై ప్ర‌చారం చేసి సామ‌దాన‌బేధ‌దండోపాయాల‌న్నింటినీ వాడినా.. 40 శాతం ఓట్లు ద‌క్క‌లేదు! అయితే ఆ ఎన్నిక‌లు పూర్తై మూడు నెల‌లు అయినా గ‌డ‌వ‌క‌ముందే మోడీ గ్రాఫ్ 80 శాతానికి పెరిగింద‌ని అమెరికా సంస్థ చెబితే అంతా న‌మ్మేయాల‌న‌మాట‌!

ఇస్రో విజ‌యంలో అంతా తానై చంద్ర‌యాన్ 3 ని డిజైన్ చేసి చంద్రుడి మీద‌కు పంపిన‌ట్టుగా ప్ర‌చారప‌ర్వంలో నిండా మునిగారు. ఇది భ‌క్తుల‌ను ప‌ర‌మానందానికి గురి చేస్తోందేమో కానీ, కాస్త ఆలోచ‌న ప‌రులు మాత్రం మ‌న్మోహ‌న్ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో చంద్ర‌యాన్ 1 జ‌రిగిన‌ప్పుడు అభినంద‌న‌లు తెలిపి త‌న ప‌నేదో త‌ను చేసుకున్నారు.  త‌దుప‌రి ప్ర‌యోగాల‌కు అప్పుడూ కేంద్రం పూర్తి స‌హ‌కారం అందించింది. మోడీ మాత్రం ప్ర‌చారంలో కొత్త పీక్స్ ను అందుకుంటూ ఉన్నారు. 

ఇంకోవైపు చైనా త‌న ఇష్టానుసారం మ్యాప్ లు గీసుకుని ఇండియా భాగాల‌ను త‌న‌వ‌ని చెప్పుకుంటూ విడుద‌ల చేస్తోంది. వాటిపై మోడీ స్పంద‌న ఏదీ క‌నిపించ‌డం లేదు! ఇదే విష‌యాన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌శ్నిస్తున్నా.. మోడీ స్పందించ‌డ‌మూ లేదు!