ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాక్షస పాలనలో ఉన్న పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయని, కొత్త పరిశ్రమలు అసలే రావడంలేదని తెల్లారి లేచినప్పటి నుంచి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్, అలాగే దత్త పుత్రుడు పవన్‌కల్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి విమర్శలతో పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు భయపెట్టే కుట్ర కనిపిస్తోందన్న విమర్శ లేకపోలేదు.
చిత్తూరు జిల్లాలోని అమర్‌రాజా పరిశ్రమ కూడా తరలిపోయిందంటూ ఆరోపించిన ఘనత తండ్రీతనయులకు దక్కుతుంది. అదేంటో గానీ, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి మాత్రం జగన్ పాలనలో గొప్ప భరోసా కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జగన్ పాలన ఆమెకిచ్చిన ధైర్యం ఏంటో తెలియదు కానీ, ఏపీలో భువనేశ్వరి వ్యాపారాన్ని విస్తరించడం చర్చనీయాంశమైంది.
మంగళవారం ఆమె కుప్పంలో పర్యటించారు. బుధవారం అత్తింటివారి గడప ఆమె తొక్కారు. చంద్రగిరి మండలం కాశీపెంట్ల సమీపంలో గోకుల్ హెరిటేజ్ రెండో పార్లర్‌ను భువనేశ్వరి ప్రారంభించడం విశేషం. తన పార్లర్లోని వస్తువులను భువనేశ్వరి కొని వాటిని ఉద్యోగులు, అక్కడికి వచ్చిన గ్రామస్తులకు స్వయంగా పంచిపెట్టారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ హైవేలో రవాణా సాగించే ప్రజలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందించడమే హెరిటేజ్ పార్లర్ లక్ష్యమన్నారు.
పరిశ్రమలు తరలిపోతున్నాయని నిత్యం విమర్శించే బాబు, లోకేశ్ సొంత పరిశ్రమను మాత్రం చంద్రగిరి నియోజకవర్గంలో విస్తరించాలని అనుకోవడం గమనార్హం. జగన్ పాలన వల్ల పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు ఎదురవుతుంటే సొంత సంస్థ హెరిటేజ్‌ను భువనేశ్వరి ఎలా ప్రారంభించారనే ప్రశ్న వైసీపీ నుంచి ఎదురవుతోంది. భువనేశ్వరి తన హెరిటేజ్ పార్లర్ రెండో యూనిట్‌ను చంద్రగిరిలో విస్తరించడం ద్వారా, ఆమె భర్త, తనయుడు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని నిరూపించినట్టైందనే ప్రచారం జరుగుతోంది.