ఏపీ, తెలంగాణ వామపక్ష నాయకుల మధ్య ఎంతో తేడా కనిపిస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్, వామపక్ష (సీపీఐ, సీపీఎం) పార్టీల మధ్య పొత్తు వుంటుందని అందరూ భావించారు. మునుగోడులో వామపక్షాల మద్దతును సీఎం కేసీఆర్ తీసుకున్నారు. ఆ నియోజకవర్గంలో వామపక్షాలు మిగిలిన ప్రాంతాల్లో కంటే బలంగా ఉన్నాయి. దీంతో ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎం నేతల మధ్య కేసీఆర్‌కు అవసరమైంది.
సాధారణ ఎన్నికల్లో కూడా ఇదే రీతిలో బీఆర్ఎస్‌తో పొత్తు వుంటుందని, చట్టసభలో అడుగు పెట్టొచ్చని వామఫక్షాల నేతలు ఆశించారు. అయితే వామపక్షాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో వామపక్షాల నేతలు ఉమ్మడి సమావేశం పెట్టుకుని బీఆర్ఎస్‌ను ఓడించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఇదీ పౌరుషం అంటే.
అదేంటో కానీ ఏపీ వామపక్ష నేతల్లో ఆ ఐక్యత అసలు కనిపించదు. ముఖ్యంగా చంద్రబాబు పల్లకీ మోయడంలో సీపీఐ అన్ని విలువల్ని విడిచి పెట్టిందనే విమర్శకు బలం కలిగించేలా నడుచుకుంటోంది. బీజేపీతో అంటకాగడంలో వైసీపీ, టీడీపీకి తేడా లేదు. ఇది జగమెరిగిన సత్యం. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి బిల్లుకు మద్దతు ఇవ్వడంలో టీడీపీ, వైసీపీ పోటీ పడుతుంటాయి. ఏపీకి మోదీ సర్కార్ చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించే పరిస్థితిలో ఏపీ పార్టీలు లేవు.
అయితే బీజేపీతో వైసీపీ మాత్రం అంటకాగుతున్నట్టు సీపీఐ కంటికి కనిపించడం విచిత్రంగా వుంది. సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణలకు సీఎం వైఎస్ జగన్ అంటే గిట్టదు. అందుకే జగన్ ప్రభుత్వం పోవాలని వారు కోరుకుంటున్నారు. తమకిష్టమైన నాయకుడు చంద్రబాబు బీజేపీతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నా సీపీఐ నేతలకు మాత్రం చూడ ముచ్చటగా వుంటోంది. తెలంగాణలో మాదిరిగా ఏపీలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎన్నికల యుద్ధంలో తలపడాలని సీపీఐ, సీపీఎం పార్టీలకు ఎందుకు ఆలోచన రాలేదో అర్థం కావడం లేదు.
ఇవాళ ఢిల్లీలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మీడియాతో మాట్లాడుతూ పొత్తులకు సంబంధించి టీడీపీ ఊగిసలాట వీడాలని సూచించారు. ఏపీలో వైసీపీ, బీజేపీ కలిసే ఉన్నాయని ఆయన అన్నారు. ఇప్పటికైనా టీడీపీ మేల్కొనాలని ఆయన కోరడం గమనార్హం. సీపీఐ, సీపీఎం, జనసేనతో టీడీపీ ఓ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే వైసీపీ, బీజేపీ డబుల్ ఇంజన్ ఫెయిల్ అవుతుందన్నారు.
బీజేపీతో ఇప్పటికే జనసేన అధికారిక పొత్తులో వుందన్న సంగతిని నారాయణ విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రబాబు నిద్రపోతున్నారని భావిస్తున్న నారాయణే ఆయన మత్తులో జోగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీకి వైసీపీ ఎంత దగ్గరో, టీడీపీ కూడా అంతే దగ్గరని గత కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలియజేస్తున్నారు. ఈ మాత్రం అర్థం చేసుకోకుండా నారాయణ కొత్త ఫ్రంట్‌పై ఆశలు పెట్టుకోవడం విడ్డూరంగా వుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ, జనసేనతో కలిసి కొత్త కూటమి కట్టాలనే కలలు కనడం మాని, సొంతంగా ఏం చేయాలనే అంశంపై ఆలోచిస్తే మంచిదని నారాయణకు నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు.