‘చిరు’ ఉపాయం -రామోజీని ట్రోల్ చేద్దామా?

ప్ర‌జ‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించేందుకు ర‌క‌ర‌కాల ర‌క్ష‌ణ చ‌ర్య‌ల గురించి పెద్ద‌లు చెబుతుంటారు. ఎప్ప‌టిక‌ప్పుడు మీడియా చైత‌న్య ప‌రిచే కార్య‌క్ర‌మాలు చేస్తుంటుంది. మీడియాకు వ్య‌క్తిగ‌త ,రాజ‌కీయ ఎజెండాల‌కు సంబంధించిన వార్త‌లు పోనూ, కొద్దోగొప్పో ప్ర‌జల‌కు ప్ర‌యోజ‌నం…

ప్ర‌జ‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించేందుకు ర‌క‌ర‌కాల ర‌క్ష‌ణ చ‌ర్య‌ల గురించి పెద్ద‌లు చెబుతుంటారు. ఎప్ప‌టిక‌ప్పుడు మీడియా చైత‌న్య ప‌రిచే కార్య‌క్ర‌మాలు చేస్తుంటుంది. మీడియాకు వ్య‌క్తిగ‌త ,రాజ‌కీయ ఎజెండాల‌కు సంబంధించిన వార్త‌లు పోనూ, కొద్దోగొప్పో ప్ర‌జల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించే అంశాల‌కు చోటు క‌ల్పిస్తుంటుంది. లేదంటే ఏ మీడియా సంస్థ మ‌నుగ‌డ సాగించ‌లేదు.

తాజాగా రామోజీరావు నేతృత్వంలో న‌డిచే 'ఈనాడు' ఓ ఆస‌క్తిక‌ర క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. తెలంగాణ‌లోని ఆదిలాబాద్ జిల్లా సంచిక‌లో 'చిరు ఉపాయం… చిరుత దాడి దూరం' శీర్షిక‌తో క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఇటీవ‌ల రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరుత‌ల సంచారం ప్ర‌జ‌ల్ని భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. దీంతో చిరుత‌ల దాడి నుంచి త‌మ‌ను తాము ఎలా ర‌క్షించుకోవాలో ఈనాడు ప‌త్రిక‌లో క‌థ‌నం రాశారు. అందులో ఏముందంటే…

'చిరుత పులి ఎదురు ప‌డితే రెండు చేతులు పైకి లేపి గ‌ట్టిగా అర‌వాలి. అప్పుడు త‌న‌కంటే ఎక్కువ ఎత్తు ఉన్న జంతువు ఉంద‌న్న భ్ర‌మ‌లో ప‌క్క‌కు త‌ప్పుకునే అవ‌కాశాలున్నాయి. అడ‌వి జంతువుల సైకాల‌జీ ప్ర‌కారం ఆకారంలో త‌న‌కంటే పెద్ద‌గా ఉన్న జంతువుల‌పై సాధార‌ణంగా అవి దాడికి దిగ‌వు. చిరుత ఎదురు ప‌డితే భ‌యంతో ప‌రుగెత్తొద్దు. అది కాస్త దూరంలో ఉన్న‌ప్ప‌టికీ ధైర్యంగా నిల‌బ‌డి చేతులు పైకి ఎత్తి దానిపై క‌న్నేసి నెమ్మ‌దిగా వెన‌క్కి న‌డ‌వాలి. చాలా ద‌గ్గ‌ర‌గా ఎదురు ప‌డితే మాత్రం చేతులు పైకి ఎత్తిప‌ట్టి బిగ్గ‌ర‌గా అరుస్తూ నెమ్మ‌దిగా వెన‌క్కి న‌డ‌వాలే త‌ప్ప వెనుదిరిగి ప‌రుగు తీయ‌వ‌ద్దు'

ఈ విధంగా రాసిన ఈనాడు ప‌త్రిక‌ను, దాని య‌జ‌మాని రామోజీరావును ఎవ‌రైనా ట్రోల్ చేయాల‌నే ఆలోచ‌న వ‌స్తుందా? రాకూడ‌దు. ఎందుకంటే ఎప్పుడైనా అనుకోని రీతిలో చిరుత‌లకు త‌ట‌స్థ ప‌డితే, భ‌యంతో ప‌రుగు తీసి ప్రాణాలు కోల్పోకుండా, సులువుగా ర‌క్ష‌ణ పొందే చ‌ర్య‌ల్ని ఈనాడు చ‌క్క‌గా వివ‌రించింది.

ఇటీవ‌ల తిరుమ‌ల న‌డ‌క మార్గంలో వ‌రుస చిరుత దాడులు భ‌క్తుల్ని భ‌య‌పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి స్పందిస్తూ న‌డ‌క దారిలో వెళ్లే భ‌క్తుల‌కు ప్ర‌తి ఒక్క‌రికీ పొడ‌వాటి క‌ర్ర ఇస్తామ‌ని, కొద్దోగొప్పో ధైర్యాన్ని ఇస్తుంద‌ని చెప్పారు. దీన్ని కూడా రాజ‌కీయానికి వాడుకున్నారు. టీటీడీ చైర్మ‌న్‌పై ట్రోల్ చేశారు. ఈనాడులో తాజాగా రాసిన క‌థ‌నం, ఇటీవ‌ల క‌రుణాక‌ర‌రెడ్డి చెప్పిన అంశానికి తేడా ఏముంది? అడ‌వి జంతువుల సైకాల‌జీ ప్ర‌కారం ఆకారంలో త‌న‌కంటే పెద్ద‌గా ఉన్న జంతువుల‌పై చిరుత‌లు దాడికి దిగ‌వంటూ రాశారు.

క‌రుణాక‌ర‌రెడ్డి చెప్పింది కూడా అదే. క‌ర్ర చేతిలో వుండ‌డం వ‌ల్ల త‌న‌కంటే ఎత్తుగా ఉన్న‌ట్టు మ‌నుషులు క‌నిపిస్తార‌ని, త‌ద్వారా చిరుత‌లు దూరంగా వెళ్తాయ‌ని ఆయ‌న వివ‌రించారు. అయితే ఏం చెప్పార‌నే విష‌యం కంటే, ఆ మాట మ‌న‌కు న‌చ్చ‌ని మ‌నిషి చెబితే…బుర‌ద చ‌ల్ల‌డానికి సిద్ధంగా కొంత మంది సిద్ధంగా ఉండ‌డ‌మే ఇప్పుడు స‌మ‌స్య‌గా మారింది. చిరుత‌ల దాడి నుంచి చిరు ఉపాయం చెప్పిన రామోజీపై ట్రోల్ చేయాల‌ని ఎవ‌రైనా అనుకుంటే చేసేదేముంటుంది?