టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని జనసేనాని పవన్‌కల్యాణ్ విశాఖ వేదికగా రంజింప చేయలేదా? అంటే ఔననే సమాధానం వస్తోంది. పవన్‌కల్యాణ్ నుంచి ఆశించిన విమర్శలు రాకపోవడం చంద్రబాబు, లోకేశ్‌తో పాటు టీడీపీ నాయకుల్ని, ఆ పార్టీ శ్రేణుల్ని తీవ్ర నిరాశ పరిచింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 262 రోజులుగా అక్కడి కార్మిక సంఘాలు దీక్ష చేస్తున్నాయి.
ఈ దీక్షకు జనసేనాని సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం స్టీల్‌ప్లాంటులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ఏం మాట్లాడ్తారోననే ఉత్కంఠ నెలకుంది. అయితే అందరి ఆశలను ఆయన వమ్ము చేశారు. నిజానికి అందరి కంటే ఎక్కువగా చంద్రబాబు, లోకేశ్‌లను పవన్ ప్రసంగం తీవ్ర నిరాశకు గురి చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సభా వేదికపై నుంచి బీజేపీని టార్గెట్ చేస్తారని టీడీపీ ఆశించింది. కానీ పవన్ మాత్రం చాలా తెలివిగా విశాఖ ఉక్కును ప్రైవేకరించిన ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కటంటే ఒక్క మాట కూడా అనలేదు.
ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పవన్ విమర్శలకు దిగారు. పవన్ ప్రసంగం వింటున్న వాళ్లకు… విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వమా లేక కేంద్ర ప్రభుత్వమా? అనే అనుమానాలు వచ్చాయి. అలాగే కేంద్రంలో వైసీపీ ప్రభుత్వం ఉందా? అనే ప్రశ్నలు చర్చకు వచ్చాయి. ‘విశాఖ ఉక్కు కర్మాగారం ఎవరి భిక్ష వల్లో రాలేదు. 32 మంది ప్రాణత్యాగాలు చేస్తే వచ్చింది. ఇది ఆంధ్రుల హక్కు. దీనిని కాపాడుకుని తీరుతాం’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రకటించారు. మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు నిర్ణయించిన మోడీ సర్కార్‌ను ప్రశ్నించకుండా… ఎలా సాధ్యమో పవన్‌కల్యాణే చెప్పాలి.
వైసీపీ వాళ్ల మాటలకు అర్థాలు వేరని, వారిని నమ్మలేమని పవన్ చెప్పుకొచ్చారు. మరి పవన్‌ను నమ్మడం ఎలా? …ఈ ప్రశ్న టీడీపీ వేస్తోంది. ఈ సభా వేదికపై నుంచి కేంద్రంలో పాలన సాగిస్తున్న బీజేపీని పెద్ద ఎత్తున విమర్శించి, ఆ పార్టీకి తాను దూరమనే సంకేతాల్ని ఇస్తారని టీడీపీ లెక్కలేసుకుంది. బీజేపీకి తాను దూరమని చెప్పడం ద్వారా పరోక్షంగా టీడీపీకి దగ్గరనే సంకేతాల్ని ఈ సభా వేదికపై నుంచి పవన్ ఇస్తారని చంద్రబాబు ఆశించారు. చివరికి ఎప్పట్లాగే వైసీపీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసి… విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించి మమ అనిపించారు.
2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే వైసీపీని ఎదుర్కోవడం అసాధ్యమని టీడీపీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. ఆంధ్రప్ర దేశ్‌లో అత్యధిక జనాభా కలిగిన కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్‌కల్యాణ్ మద్దతు ఉంటే తప్ప వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాలేనని చంద్రబాబు స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. టీడీపీ ఉనికి పవన్ మద్దతుపై ఆధారపడి ఉందనేది బహిరంగ రహస్యమే. అందువల్లే బీజేపీ, జనసేనతో మరోసారి పొత్తు పెట్టుకునేందుకు ఆయన శ్రమిస్తున్నారు. కానీ చంద్రబా బును నమ్మి మరోసారి మోసపోయేందుకు సిద్ధంగా లేమని బీజేపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు.
బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనను ఎలాగైనా పక్కకు లాగేందుకు చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు విశాఖ ఉక్కు ఉద్యమం దోహదం చేస్తుందని ఆశించారు. ఆ ఒక్క ఆశ నిన్నటి పవన్ ప్రసంగంతో ఆవిరై పోయింది. జగన్‌ను పవన్ ఎన్ని విమర్శించినా… వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ జనసేనాని పవన్‌ను తన శత్రు పక్షం కిందే లెక్కేసి వైసీపీ రాజకీయాలు చేస్తోంది.
ఇప్పుడు కొత్తగా వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ ఎన్ని విమర్శించినా నష్టం ఏంటి? ఎలాగూ పవన్ తమను విమర్శిస్తారని వైసీపీకి బాగా తెలుసు. వైసీపీని విమర్శించడం కంటే బీజేపీని టార్గెట్ చేయడం టీడీపీకి కావాలి. అది జరగలేదు. అందుకే పవన్ ప్రసంగం విన్న తర్వాత బాబు సహా టీడీపీ నేతలంతా నిరుత్సాహంతో నిట్టూర్చారు.