ఎట్టకేలకు పవన్ కల్యాణ్ లో చంద్రబాబు కనిపించారు. విశాఖ సభలో ఆయన ఒక్కో డైలాగ్ చెబుతుంటే, అణువణువునా చంద్రబాబు కనిపించారు. టీడీపీ స్క్రిప్ట్ ను పవన్ కల్యాణ్ చదువుతుంటే పసుపు తమ్ముళ్లు పొంగిపోయారు.
ఇవన్నీ పక్కనపెడితే, బుకాయింపులో బాబును మించిపోయారు పవన్ కల్యాణ్. తన ప్రసంగాలతో చంద్రబాబు ఎలాగైతే హింసిస్తారో, సరిగ్గా ఈ రోజు పవన్ బాబు కూడా అదే పనిచేశారు.
దొంగే.. దొంగ-దొంగ అని అరిచినట్టు..
ఇది చంద్రబాబు స్టయిల్. తనే గిల్లుతారు, తనే ఏడుస్తారు. క్లాసిక్ ఎగ్జాంపుల్ పట్టాభే. ఆయనతో నీచమైన వ్యాఖ్యలు చేయించి, మళ్లీ తనే నేరుగా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి పాలన పెట్టాలని గగ్గోలు పెడతారు. ఇప్పుడీ విద్యను పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో అవపోసన పట్టారు. విశాఖ వేదికగా పవన్ చేసిన ప్రసంగం దీనికి సజీవ ఉదాహరణ.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ సర్కారు ఎప్పుడో వ్యతిరేకించింది. ఉద్యోగులకు సంఘీభావం తెలిపింది. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. ఇది కాకుండా, స్వయంగా ముఖ్యమంత్రి జగన్ తన అసంతృప్తిని, వ్యతిరేకతను తెలుపుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అదే లేఖలో కొన్ని మంచి పరిష్కార మార్గాల్ని కూడా సూచించారు.
ఇక ఎంపీలైతే పార్లమెంట్ లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు, పార్లమెంట్ ప్రాంగణంలో ప్లకార్డులు ప్రదర్శించారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన దీక్షలకు పూర్తి మద్దతు తెలిపారు. ఇవన్నీ పవన్ కల్యాణ్ మరిచిపోయినట్టున్నారు. మైక్ పుచ్చుకునే ముందు పవన్ ఓసారి గూగుల్ లో సెర్చ్ చేసి ఉంటే బాగుండేదేమో.
వైసీపీలో చిత్తశుద్ధి లేదంటూ నోటికొచ్చినట్టు వాగేశారు. కార్మికుల కష్టాలు కేంద్రానికి తెలియవని, రాష్ట్ర నేతలే కేంద్రానికి చెప్పాలని, ఈ విషయంలో వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయలేదని విమర్శించారు. ఈ విషయంలో పవన్ కు, చంద్రబాబు స్పెషల్ కోచింగ్ ఇచ్చారేమో అనిపిస్తుంది ఆ ప్రసంగం చూస్తే. కళ్లెదుట వీడియోలు, ఫొటోలు కనిపిస్తున్నా తను అనుకున్నదే పదే పదే చెబుతుంటారు చంద్రబాబు. “అవునా..కాదా తమ్ముళ్లూ” అంటూ రెట్టించి అడుగుతుంటారు. ఈరోజు పవన్ కూడా అదే పని చేశారు.
బీజేపీ తప్పుని కూడా కవర్ చేస్తున్న పవన్
గట్టిగా గొంతు చించుకొని అరిస్తే అబద్ధం నిజం అయిపోతుందా? ఎల్లో మీడియాలో తాటికాయంత అక్షరాలతో హెడ్ లైన్స్ పెడితే అబద్ధం నిజం అయిపోతుందా? పవన్ కల్యాణ్ ఇదే భ్రమల్లో ఉన్నట్టున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తిగా కేంద్రం ఆధీనంలో ఉందనే విషయం పదో తరగతి పిల్లాడ్ని అడిగినా చెబుతారు. దానిపై పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానిది. మోదీ సర్కారు నిర్ణయం తీసేసుకుంది. అది పవన్ కు నచ్చలేదు. అలాంటప్పుడు ఎవ్వర్ని తిట్టాలి?
పవన్ మాత్రం మోదీని తిట్టరు, వైసీపీ నేతల్ని, ముఖ్యమంత్రి జగన్ ను తిడతారు. తప్పంతా జగన్ దే అంటారు. పవన్ మంచి నటుడు కాబట్టి సినిమా డైలాగ్ రూపంలోనే దీన్ని చెప్పుకుందాం. ఓ సినిమాలో కమెడియన్ లేచి ఇక్కడ నన్ను ఎవ్వరో పూలచొక్కా అన్నారు, లెక్చరర్ వెంటనే క్షమాపణలు చెప్పాలంటాడు. పవన్ వరస కూడా అలానే ఉంది. కేంద్రం, ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేస్తుంటే, జగన్ తప్పు చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు జనసేనాని.
స్టీల్ ప్లాంట్.. పవన్ దృష్టిలో మరో పాచిపోయిన లడ్డూ
ఈమధ్య మైక్ దొరికితే గంటల పాటు ఊకదంపుడు ప్రసంగం దంచికొడుతున్న పవన్ కల్యాణ్, ఈరోజు కూడా అదే పని చేశారు. విశాఖ ఉక్కు కార్మికుల కోసం అంటూ మైక్ పుచ్చుకున్న జనసేనాని.. చాలా సేపు మాట్లాడారు. అందులో పాయింట్ ఒక్కటే. అఖిల పక్షం పెట్టాలని. ఈ డైలాగ్ పై పూర్తి పేటెంట్ హక్కులు చంద్రబాబువి. ఏమైనా అంటే అఖిలపక్షం పెట్టమంటారు బాబు. ఇప్పుడు అదే మాట పవన్ నోట వినిపించిందంతే.
దీని సంగతి పక్కనపెడితే.. గతంలో ప్రత్యేక హోదా ఉద్యమం, ప్రజా పోరాటం అంటూ కలరింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. మరి ఈసారి కూడా అలాంటి సాహసం చేస్తారని చాలామంది జనసైనికులు ఎదురుచూశారు. కానీ పవన్ మాత్రం తను చట్టసభల్లో బలహీనుడ్ని అని ఒప్పుకున్నారు. మనం పోరాటం చేయకుండా, కేంద్రాన్ని నిందించడంలో తప్పు లేదన్నారు. ఈ రెండు డైలాగ్స్ తో పవన్ కాడె పడేశారనే విషయం స్పష్టంగా అర్థమౌతూనే ఉంది. తను కేవలం మాటలు చెబుతానని, ఆ తర్వాత షూటింగ్స్ కు వెళ్లిపోతానని, మిగతా పనంతా మీరే చూసుకోవాలని పరోక్షంగా గీతోపదేశం చేసినట్టయింది.
ఓవరాల్ గా తన మొత్తం ప్రసంగంలో పవన్ కల్యాణ్, బీజేపీని విమర్శిస్తారనుకుంటే.. చుట్టూతిరిగి మరోసారి వైసీపీపై పడ్డారు. చంద్రబాబును కాపీకొడుతూ, అతడ్నే మించిపోయారు. బహుశా.. జనసేనాని దృష్టిలో ప్రశ్నించడం ఇదే ఇదేనేమో!