Advertisement

Advertisement


Home > Politics - Gossip

నాటకాలు ఎన్నాళ్లిలా పవన్?

నాటకాలు ఎన్నాళ్లిలా పవన్?

పిల్లి కళ్లు మూసుకున్నంత మాత్రాన మిగిలిన వాళ్లు మూసుకున్నట్లు కాదు. పవన్ కళ్యాణ్ చెప్పనంత మాత్రాన నిజాలు జనాలకు తెలియనివి కావు. తన నటనా వైదుష్యం అంతా రాజకీయ యవనిక మీద చూపించేద్దాం అనుకున్నంత మాత్రాన అది నటనే అని ప్రేక్షకులకు తెలియంది కాదు.  

చాలా కాలం అయింది విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ వ్యవహారం తెరపైకి వచ్చి. అక్కడి జనాలు తప్ప మిగిలిన వారు దాదాపు మరచిపోయారు. సరే, దానికి మద్దతు ప్రకటించి, ఉద్యమాన్ని మళ్లీ రాజేద్దాం అని పవన్ బాబు అక్కడికి వెళ్లారు. సరే వెళ్లినపుడు నిజాలు మాట్లాడాలి. 

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు కారణం ఎవరు? అసలు విశాఖ ఉక్కు లో ఓ అటెండర్ పోస్టు అయినా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో వుందా? ఈ మాత్రం లోక జ్ఞానం పవన్ కు లేదా? పవన్ స్పీచ్ మొత్తం మీద మోడీ, అమిత్ షా, భాజపా, కేంద్రం అన్న పదాలు దొర్లాయా? పవన్ కు తెలియదేమో కానీ స్టీల్ ప్లాంట్ లో పని చేసేవారికి, మిగిలిన వారికి ఇదంతా కేంద్రం వ్యవహారం అని క్లారిటీగా తెలుసు. పవన్ రంకెలు వేసినంత మాత్రాన వైకాపా ఖాతాలో పడిపోదు ఇదంతా.

విశాఖ ఉక్కు నిర్మాణం ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే సుమారుగా నాలుగు దశాబ్దాల కాలం ఏ పార్టీ ఎక్కువగా అధికారంలో వుంది? వైకాపానా? తేదేపానా? మరి నిర్వాసితుల సమస్య ఇప్పటికీ అపరిష్కృతంగా వుండిపోవడంపై ఎవరిని నిందించాలి? నిజంగా పవన్ కు చిత్తశుద్ది వుంటే విశాఖ ఉక్కు నిర్వాసితులకు ఇచ్చిన ఆర్ కార్డులు చేతులు మారిన వైనం, అలా వాటిని కొనుగోలు చేసి ఉద్యోగాలు పొందిన వారిపై సిబిఐ విచారణకు డిమాండ్ చేయాలి. అప్పుడు తెలుస్తుంది పవన్ వెనుక ఎంత మంది వుంటారో? 

విశాఖ ఉక్కు ను ప్రయివేటీకరణ చేయకూడదు. మంచిదే. కానీ పవన్ చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. తాను ప్రయివేటీకరణకు వ్యతిరేకం కాదు అంటూనే ఈ మాట చెబుతున్నారు. పనిలో పనిగా ఈ పని చేస్తున్న మోడీని, అమిత్ షా ను ఎందుకు నిందించకూడదు. ఎందుకు నిలదీయకూడదు? కేవలం వైకపానే టార్గెట్ నా?  పవన్ చేస్తున్న పని తెలుగుదేశం పార్టీకి తప్ప ఉక్కు ఉద్యమానికి ఏమాత్రం అయినా ఉపయోగపడుతుందా?

వైకాపా జనాలు రాజీనామా చేయడం గురించి డిమాండ్ చేయడం కన్నా పవన్ ఒక మాట అనొచ్చు కదా? ''విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆపుతారా? భాజపాతో తో స్నేహ బంధం తెంచుకోమంటారా?'' అని నిలదీయవచ్చు కదా? దానికి ఇంకా టైమ్ వుందేమో? ఎన్నికలు దగ్గరకు వచ్చేసాక, భాజపా ఇక ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి చేరువ కాదు అని డిసైడ్ అయిపోతే, అప్పుడు బంధాలు తెంపుకుని, మోడీ, అమిత్ షా లను నిలదీస్తారేమో? అప్పటి వరకు ఆ యాంగిల్ అలా రిజర్వ్ లో వుంచుకుంటారేమో?

విశాఖ ఉక్కు దగ్గర వచ్చిన పవన్ వేరే విషయాలను కూడా ప్రస్తావించారు. అవి కూడా వైకాపాను టార్గెట్ చేసేందుకు ఉద్దేశించినవే. మరి అప్పుడు కూడా వెయ్యి రూపాయలకు చేరువ అయిపోయిన వంట గ్యాస్ గురించి మాట్లాడరు. పెట్రోలును జిఎస్టీ పరిధిలోకి తీసుకురమ్మని డిమాండ్ చేయరు. వంట గ్యాస్ సబ్సిడీ అన్నది ఖాతాల్లోకి రాని విషయాన్ని ప్రస్తావించారు.

తన సభలకు జనం వస్తారు కానీ ఓటు వేయరు అని పదే పదె చెబుతున్న పవన్ దానికి కారణం పసిగట్టలేరా? తనకు నచ్చిన వాళ్లను ఉద్దేశ పూర్వకంగా విస్మరించి, తనకు నచ్చనివాళ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతూ వుంటే జనాలకు పవన్ పై నమ్మకం ఎలా వస్తుంది? పవర్ స్టార్ కు పవర్ ఎలా ఇస్తారు. 

అఖిలపక్షం వేయాలని గడువుతో సహా డిమాండ్ చేస్తారు. తనకు ప్రజా బలం వుంది కనుక తనకు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇచ్చారని చెప్పే పవన్, మరి మరోసారి తనే వెళ్లి విశాఖ ఉక్కు గురించి మాట్లాడి రావచ్చు కదా? పని సులువు అయిపోతుంది కదా?  తెలంగాణ ఉద్యమం ఎన్నాళ్లు సాగిందో పవన్ కు ఎరుకలేదా? దానికి గాను కేసిఆర్ చేసిన ఆమరణ నిరశన ఎంత దోహదం చేసిందో తెలియదు. తను కూడా అదే దారి పట్టవచ్చు కదా? మోడీ, అమిత్ షా దిగి వచ్చేవరకు ఆమరణ నిరశన అని మొదలు పెట్టవచ్చు కదా?

వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్ అన్నాడు మహా కవి. పవన్ కూడా ఈ ఏకపక్ష టార్గెటింగ్ పక్కన పెట్టి వాస్తవాలు మాట్లాడితే బెటర్. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?