ఒక వ్యక్తికి నిజమైన నివాళి అంటే…వారి ఆశయాలను కొనసాగించడం. ఆ వ్యక్తి చేపట్టిన సామాజిక సేవను కొనసాగించడం. కన్నడ పవర్‌స్టార్ పునీత్‌రాజ్‌కుమార్ ఆకస్మిత మృతితో దక్షిణ భారతదేశమంతా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. పలువురు సినీ సెలబ్రిటీలు బెంగళూరు వెళ్లి ఆయన మృతదేహాన్ని సందర్శించి కన్నీటి నివాళులర్పించడం చూశాం. పునీత్ సామాజిక సేవను ప్రశంసలతో ముంచెత్తారు.
పునీత్‌కు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. రోజు గడిచింది. ఇక పునీత్‌ను కుటుంబ సభ్యులు తప్ప మరొకరు గుర్తించుకునే అవకాశం లేదు. కానీ పునీత్‌కు నిజమైన నివాళులర్పించే మాట హీరో విశాల్ చెప్పారు. ‘పునీత్ రాజ్‌కుమార్ లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు. తను లేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఇంకా నా కళ్లలోనే మెదులుతున్నారు’ అని విశాల్ భావోద్వేగానికి గురయ్యారు.
‘ఎనిమి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పునీత్‌కి నివాళులర్పించిన అనంతరం విశాల్ మాట్లాడుతూ….
‘పునీత్ రాజ్‌కుమార్ మరణం చిత్ర పరిశ్రమకే కాదు సమాజానికీ తీరని లోటు. మేకప్ ఉన్నా, మేకప్ తీసినా, ఇంట్లో కలిసినా, బయట కలిసినా ఎప్పుడూ ఒకేలా మాట్లాడేవారు. ఎంతో మందికి ఉచిత విద్యని అందించారు. వృద్ధాశ్రమాల్ని నడిపారు. ఇవే కాదు సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారు. ఇన్ని పనుల్ని ప్రభుత్వం చేసిందంటే నమ్మొచ్చు. కానీ, ఒక మనిషి చేశాడంటే నమ్మడం కష్టమే. ఇప్పటి వరకూ చదివించిన 1800 మంది చిన్నారులని తన స్నేహితుడిగా నేను చదివిస్తానని పునీత్‌కి మాటిస్తున్నా. పునీత్ సేవా కార్యక్రమాలకి నా వంతు చేయూతనందిస్తా’ అని విశాల్ ప్రకటించి తన పేరుకు తగ్గట్టే విశాల హృదయాన్ని చాటుకున్నారు.
ఒక స్నేహితునికి ఇంతకంటే నివాళి ఏం కావాలి? స్నేహితుడిపై రెండు మంచి మాటలతో సరిపెట్టకుండా అతని సేవా కార్యక్రమాలకు మరణం లేదని చాటి చెప్పిన విశాల్ ప్రకటనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పునీత్‌కి నిజమైన స్నేహితుడు తానేనని విశాల్ నిరూపించుకున్నారు.