తన సినిమాల ప్రచారం కోసం ఎవర్ని పడితే వాళ్లను వాడేస్తుంటాడు ఆర్జీవీ. అమెరికా అధ్యక్షుడి నుంచి ఏపీ ప్రతిపక్ష నేత వరకు… స్పీల్ బర్గ్ నుంచి టాలీవుడ్ డైరక్టర్ల వరకు ఎవ్వర్నీ విడిచిపెట్టడు. అందర్నీ తన ట్వీట్స్ తో కెలుకుతూనే ఉంటాడు. ఇప్పుడీ దర్శకుడు తన సినిమా ప్రచారం కోసం రాజమౌళిని కూడా ఇరికించేశాడు.
కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపై ప్రస్తుతం ఫోకస్ పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ రాజకీయ నేతల పేర్లు అన్నీ వాడేశాడు. ట్రయిలర్ రిలీజ్ చేసిన సందర్భంగా వర్మ వాడకాన్ని అంతాచూశారు. ఇప్పుడీ దర్శకుడు, రాజమౌళిని టార్గెట్ చేశాడు.
కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాకు సంబంధించి కేఏ పాల్ పై ఓ సాంగ్ రిలీజ్ చేశాడు వర్మ. జేమ్స్ బాండ్ థీమ్ మ్యూజిక్ స్టయిల్ లో సాగుతూనే, మధ్యలో కేఏ పాల్ ను అనుకరిస్తూ డైలాగ్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి వర్మ ట్వీట్ చేస్తూ.. “జోకర్ సినిమా ఇండియాలో పెద్ద హిట్ అయితే, కేఏ పాల్ బయోపిక్ బాహుబలి 3 కంటే పెద్ద సినిమా అవుతుంది. దీనికి సంబంధించి దర్శకుడు రాజమౌళి, వాషింగ్టన్ డీసీలో కేఏ పాల్ తో చర్చల్లో ఉన్నాడని నేను విన్నాను. ఇదే కేఏ పాల్ నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు.” అంటూ ట్వీట్ చేశాడు వర్మ.
ఇలా తన సినిమా ప్రచారం కోసం బాహుబలి సినిమాను, రాజమౌళి పేరును వాడేశాడు వర్మ. కేవలం సరదా కోసమే వర్మ ఇలా ట్వీట్ చేశాడు. దీనిపై రాజమౌళి కూడా రియాక్ట్ అవ్వడం విశేషం. నన్ను ఇన్ వాల్వ్ చేయకండి రాజుగారు అంటూ ఫన్నీగా రాజమౌళి రీట్వీట్ చేశాడు. ఇక సాంగ్ విషయానికొస్తే.. సినిమాలో కేఏ పాల్ ను ఎంత కామెడీగా చూపించబోతున్నారనో ఈ ఒక్క పాట వింటే అర్థమైపోతుంది.