cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: మీకు మాత్రమే చెప్తా

సినిమా రివ్యూ: మీకు మాత్రమే చెప్తా

సమీక్ష: మీకు మాత్రమే చెప్తా
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌, గ్లోబల్‌ సినిమాస్‌
తారాగణం: తరుణ్‌ భాస్కర్‌, అభినవ్‌ గోమటం, అనసూయ భరద్వాజ్‌, వాణి భోజన్‌, అవంతిక మిశ్రా, వినయ్‌ వర్మ, నవీన్‌ జార్జ్‌ థామస్‌, పావని గంగిరెడ్డి తదితరులు
కూర్పు: శ్రీజిత్‌ సారంగ్‌
సంగీతం: శివకుమార్‌
ఛాయాగ్రహణం: మదన్‌ గుణదేవ
నిర్మాతలు: వర్ధన్‌ దేవరకొండ, విజయ్‌ దేవరకొండ
రచన, దర్శకత్వం: షామిర్‌ సుల్తాన్‌
విడుదల తేదీ: నవంబర్‌ 1, 2019
రేపు పెళ్లనగా, ఈరోజు పెళ్లికొడుకు పాత 'హనీమూన్‌ వీడియో' ఒకటి ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయితే? కాన్సెప్ట్‌లోనే బోలెడంత ఫన్‌కి స్కోప్‌ వుందనిపిస్తుంది కదా? విజయ్‌ దేవరకొండ ఎక్సయిట్‌ అయి ఈ ఐడియాని ఫినాన్స్‌ చేయడానికి, సినిమా తీయడానికి సంకల్పించాడంటే అందుకు కారణం ఇది మంచి కామెడీ కాగలదనిపించే నమ్మకమే. అయితే దురదృష్టవశాత్తూ... ఈ ఐడియా కేవలం కొన్ని నవ్వులకి మాత్రమే పరిమితమయింది తప్ప థియేటర్‌కి వెళ్లి చూడతగ్గ సినిమా కాలేకపోయింది.

ఐడియాగా ఎక్సయిట్‌ చేసిన దానిని ఒక కంప్లీట్‌ సినిమాగా మలచడానికి అనువైన సంఘటనలు సృష్టించడంలో, ఆకట్టుకునే కథనం రాయడంలో దర్శకుడు షామిర్‌ సుల్తాన్‌ విఫలమయ్యాడు. ప్రోమోస్‌లో ఏదైతే చూపించారో మొత్తం సినిమా అంతా చూపించారు తప్ప అంతకుమించి నవ్వించలేకపోయారు. షార్ట్‌ ఫిలిం తీయడానికి సరిపడా కాంటెంట్‌ తీసుకుని దానిని సినిమా కోసం సాగదీసారు. ఈ ప్రాసెస్‌లో బాగా నవ్వించిన దాని కంటే 'ఎలాగో వచ్చేసాం కాబట్టి చివరి వరకు చూద్దాంలే' అని వెయిట్‌ చేయించిన సందర్భాలే ఎక్కువ.

వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడమనేది తొలి పదిహేను నిమిషాల లోపే జరిగిపోతుంది. ఆ సీన్‌ జరిగిన తర్వాత తన భవిష్యత్తు ఏమిటో, తన పెళ్లేమవుతుందో అంటూ తరుణ్‌ భాస్కర్‌ టెన్షన్‌ పడే దృశ్యాలు, దానికి స్నేహితుడు అభినవ్‌ ఇచ్చే రియాక్షన్లు బాగానే నవ్విస్తాయి. అయితే ఆ పాయింట్‌ మీదే పూర్తి సినిమా నడిపించడం జరిగే పనికాదు. ఆ పరిస్థితిని మరింత జఠిలంగా మార్చే మరిన్ని సంఘటనలు కావాలి. తరుణ్‌ని మరింత టెన్షన్‌లోకి నెట్టే వ్యవహారాలు ఒకటి తర్వాత ఒకటిగా జరుగుతుండాలి. అప్పుడే ఆ ఫన్‌ మూడ్‌ ఆద్యంతం మెయింటైన్‌ అవుతుంది.

ఈ కథని ముందుకి తీసుకు వెళ్లడానికి కొత్త, కొత్త పాత్రలు తరచుగా కథలోకి ప్రవేశిస్తుంటాయి కానీ వాటి వల్ల ఒరిగేదేమీ వుండదు. ఉదాహరణకి తరుణ్‌, అభినవ్‌ల ఫోటోగ్రాఫర్‌ ఫ్రెండ్‌, హ్యాకర్‌ ఫ్రెండ్‌, అతని అక్క... ఇలా ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తుంటారు కానీ వాళ్లెవరూ ఫన్‌కి హెల్ప్‌ అవలేదు. వీడియోలో అమ్మాయి తరఫు వారు రావడమనేది టెన్షన్‌ బిల్డ్‌ చేయడానికి హెల్ప్‌ కావాల్సింది. కానీ ఆ పాత్రలతో అటు కామెడీని పండించలేకపోయారు, ఇటు టెన్షన్‌ కూడా పెట్టలేకపోయారు. అన్నిటికంటే మించి తన పెళ్లి ఏమవుతుందో, తన వీడియో లీక్‌ అయితే తాను ప్రేమించిన అమ్మాయి ఎలా రియాక్ట్‌ అవుతుందోనని భయపడ్డ తరుణ్‌కి నిజంగా తాను కంగారుపడ్డ స్థాయి సిట్యువేషనే ఎదురు కాదు.

ఏవో ఒకటీ అరా సన్నివేశాలు వున్నాయి కానీ అవి హీరో భయపడ్డంత ఎఫెక్టివ్‌గా ఏమాత్రం అనిపించవు. ప్రథమార్ధంలో సదరు సిట్యువేషన్‌కి సంబంధించిన ఇనీషియల్‌ రియాక్షన్స్‌తో హ్యూమర్‌ జనరేట్‌ అయినా కానీ దానిని సస్టెయిన్‌ చేసే స్టఫ్‌లేక సెకండ్‌ హాఫ్‌ తేలిపోయింది. అవే సన్నివేశాలు రిపీట్‌ అవుతూ వుండడం, ఆ వీడియో డిలీటింగ్‌ కోసం చేసే ప్రయత్నాలలో పస లేకపోవడం, ఆ వీడియో అప్‌లోడర్‌ ఎవరనే దాంట్లో ఎలాంటి సర్‌ప్రైజెస్‌ లేకపోవడం, తర్వాత అదే వీడియోని లీక్‌ చేస్తానంటూ మరో హ్యాకర్‌ బ్లాక్‌మెయిల్‌ చేయడం లాంటివేమీ హాస్యానికి తోడవ్వలేదు.

కనీసం పతాక సన్నివేశాలలో అయినా వినోదం పెరుగుతుందని ఆశిస్తే అదీ జరగలేదు. పాత్రల్ని ఇంటర్‌ఛేంజ్‌ చేయడం ద్వారా సర్‌ప్రైజ్‌ చేద్దామని చూసారు కానీ అది కూడా ఆశించిన రిజల్ట్‌ రాబట్టలేదు. టెక్నాలజీ వలన ఎన్ని నష్టాలు జరుగుతాయి, సరదాగా తీసిన వీడియోనే ఆ తర్వాత ఎలా మెడకి చుట్టుకుంటుంది లాంటి ఎలిమెంట్స్‌ ఆసక్తి కలిగించినా, అందులో వినోదానికి చాలా ఆస్కారమున్నా కానీ అన్నిటినీ పైపైన మాత్రమే టచ్‌ చేయడం వల్ల ఒక ఐడియా పూర్తి స్థాయిలో వాడుకోకుండానే వృధా అయినట్టయింది. చివరకు వీడియోలోని కాంటెంట్‌, దానికి పెట్టుకున్న బ్యాక్‌డ్రాప్‌ కూడా అంత త్రెట్‌లా అనిపించకపోవడం వల్ల అది కూడా ఇంట్రెస్ట్‌ని హోల్డ్‌ చేయలేకపోయింది.

హీరోయిన్‌ క్యారెక్టరైజేషన్‌ ఇంకా డీటెయిల్డ్‌గా వున్నట్టయితే, ఆమె రియాక్షన్‌ ఎలా వుంటుందోననే టెన్షన్‌ పెరిగేది. కానీ ఆ పాత్రని చాలా సాదాసీదాగా తీర్చిదిద్దారు. హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలలో కూడా వారి రిలేషన్‌ ఏమవుతుందోనని వర్రీ అయ్యేటంత డెప్త్‌ లేదు. రచనా పరంగా జరిగిన లోటుపాట్లు, లోపాలు అటుంచితే... ఈ చిత్రానికి నిర్మాత విజయ్‌ దేవరకొండ లాంటి స్టార్‌ కనుక, అతనికి నిర్మాతగా తొలి చిత్రం కాబట్టి క్వాలిటీ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయడం అంత పెద్ద ఎక్స్‌పెక్టేషనేం కాదు. కానీ ఈ చిత్రానికి కనీస నిర్మాణ విలువలు లేవు. బడ్జెట్‌ పరంగా వున్న లిమిటేషన్స్‌ కొట్టొచ్చినట్టు కనిపించేస్తూ వుంటాయి.

కనీసం సాంకేతికంగా కూడా క్వాలిటీ ప్రోడక్ట్‌ కోసం జరిగిన కృషి లేదు. అతి సాధారణ నిర్మాణ విలువలతో, షార్ట్‌ ఫిలింని తలపించే స్టాండర్డ్స్‌తో 'మీకు మాత్రమే చెప్తా' మేకింగ్‌ క్వాలిటీ పరంగా చాలా నిరాశపరుస్తుంది. ఈ కాన్సెప్ట్‌కి ఎక్కువ ఖర్చు అవసరం లేదు కానీ నిర్మాతగా ఒక పాపులర్‌ హీరో వున్నపుడు ప్రోడక్ట్‌ క్వాలిటీ చూసుకోవడం కూడా ముఖ్యమే కదా. సపోర్టింగ్‌ స్టార్‌ కాస్ట్‌ విషయంలోనే కాస్ట్‌ కటింగ్‌ ఎంత జరిగిందో తెలిసిపోతుంది. పోనీ కొత్త వాళ్లయినా టాలెంట్‌ వున్న వారా అంటే అదీ లేదు. చాలా పాత్రలు అవి పోషించిన నటుల వల్ల తేలిపోయాయి.

దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న తరుణ్‌ భాస్కర్‌ నటనలోను నిష్ణాతుడేనని ఈ చిత్రం నిరూపించింది. ఒక ఇబ్బందికర పరిస్థితిలో చిక్కుకున్న ఒక సగటు యువకుడిగా అతని నటన మెప్పిస్తుంది. పాత్రకి తగినట్టు కనిపించడమే కాకుండా, చక్కని నటనతో ఆకట్టుకున్నాడు. ఏడుస్తూ కూడా 'డస్ట్‌, డస్ట్‌' అంటూ కవర్‌ చేసుకునే అతని పర్‌ఫార్మెన్స్‌ ఈ చిత్రాన్ని చాలా వరకు నిలబెట్టింది. అలాగే అతని స్నేహితుడిగా దాదాపు సినిమా అంతటా వుండే అభినవ్‌ కూడా పెద్ద ప్లస్‌ అయ్యాడు. అనసూయ ఓకే అనిపించగా, వాణి కూడా ఎక్స్‌ప్రెసివ్‌ ఫేస్‌తో ఇంప్రెస్‌ చేసింది. సంభాషణలు మినహా సాంకేతికంగా గుర్తించదగ్గ అవుట్‌పుట్‌ అయితే ఎవరినుంచీ రాలేదు.

కాసిని జోకులుంటే సరిపెట్టుకుంటామంటే తప్ప 'మీకు మాత్రమే చెప్తా' ఆశించిన వినోదాన్ని అయితే అందించలేకపోయిందనే చెప్పాలి. కాన్సెప్ట్‌లో కనిపించిన మెరుపు సినిమాలో లేకపోయింది. విజయ్‌ దేవరకొండ పేరు అసోసియేట్‌ అవడం, అతి తక్కువ బడ్జెట్‌లో తీసేయడం వల్ల ఫినాన్షియల్‌గా ఇది లాభదాయకం కావచ్చు కానీ... థియేటర్లకి వచ్చిన ప్రేక్షకులని సంతృప్తి పరిచేంత కాంటెంట్‌ కానీ, కామెడీ కానీ ఖచ్చితంగా లేదనే చెప్పాలి.
బాటమ్‌ లైన్‌: అంతంత మాత్రమే!
- గణేష్‌ రావూరి

సినిమా రివ్యూ: విజిల్‌   సినిమా రివ్యూ: ఖైదీ