cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఖైదీ

సినిమా రివ్యూ: ఖైదీ

సమీక్ష: ఖైదీ
రేటింగ్‌: 3/5
బ్యానర్‌: డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌
తారాగణం: కార్తీ, నరైన్‌, జార్జ్‌ మర్యన్‌, రమణ, దీన, మహానది శంకర్‌ తదితరులు
సంగీతం: సామ్‌ సి.ఎస్‌.
కూర్పు: ఫిలోమిన్‌ రాజు
ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌
నిర్మాతలు: ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌ ప్రభు, ఎస్‌.ఆర్‌. ప్రభు
రచన, దర్శకత్వం: లోకేష్‌ కనగరాజ్‌
విడుదల తేదీ: అక్టోబర్‌ 25, 2019
ఒకప్పుడు తెలుగు సినిమాలలో అరుదైపోయిన వైవిధ్యాన్ని తమిళ చిత్రాల్లో వెతుక్కునేవారు మన ప్రేక్షకులు. ఇప్పుడు తెలుగు సినిమాలలోనే వైవిధ్యం పెరుగుతోంటే, తమిళం నుంచి ఎక్కువగా మసాలా చిత్రాలు అనువాదమవుతున్నాయి. తమిళంలో వైవిధ్యభరిత చిత్రాలు రాచ్చసన్‌, తని ఒరువన్‌, అసురన్‌ లాంటివి ఇక్కడ రీమేక్‌ అవుతూ వుండగా, కార్తీ చేసిన ఒక ఉత్కంఠభరిత యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఖైదీ' తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కేవలం ఒక్క రాత్రిలో జరిగే సంఘటనలతో, నాన్‌స్టాప్‌ యాక్షన్‌తో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ బాగా ఎంగేజ్‌ చేసే ఒక నిఖార్సయిన థ్రిల్లర్‌ ట్రీట్‌ అందించాడు.

పాటలు, హీరోయిన్‌ లాంటివేమీ లేని ఈ చిత్రంలో దర్శకుడు పెట్టుకున్న సెటప్‌ కాసేపు మనల్ని వాళ్ల లోకంలోకి తీసుకెళ్లిపోయి ఆ యాక్షన్‌తో ట్రావెల్‌ అయ్యేలా చేస్తుంది. ఒక పెద్ద డ్రగ్‌ రాకెట్‌ని చేధించిన పోలీసులు అదంతా ఎస్పీ ఆఫీస్‌లో భద్రపరుస్తారు. ఆ పట్టుబడిన వారిలో సదరు డ్రగ్‌ మాఫియా కింగ్‌పిన్‌ వుంటాడు. అయితే ఈలోగా పోలీస్‌ ఉన్నతాధికారులు, ముఖ్యమైన ఆఫీసర్లు అందరికీ డ్రగ్స్‌ ఇచ్చి సదరు ఎస్పీ ఆఫీస్‌ మీద ఎటాక్‌ చేయడానికి వెళతారు. ఈ ఆఫీసర్లని భద్రంగా లారీలో హాస్పిటల్‌ చేర్చే బాధ్యత పదేళ్ల జైలు శిక్ష అనుభవించి, అంతవరకు కనీసం చూడను కూడా చూడని కూతుర్ని చూడ్డానికి వెళుతోన్న ఢిల్లీకి (కార్తీ) అప్పగిస్తారు.

ఇటు ఢిల్లీ వారిని హాస్పిటల్‌కి తీసుకెళ్లేలోగా వారిపై పలు ముఠాలు ఎటాక్స్‌ చేస్తుంటాయి. మరోవైపు ఆ ఎస్పీ ఆఫీస్‌లో ఒక లైన్‌ కానిస్టేబుల్‌ (జార్జ్‌ మరియన్‌), ఒక నలుగురు కాలేజ్‌ విద్యార్థులు మాత్రమే వుంటారు. వారు డ్రగ్స్‌ కోసం వస్తోన్న ముఠాని లోనికి రానివ్వకుండా అడ్డుకోవాలి. ఇదంతా ప్యారలల్‌గా సాగుతూ, ఇటు పోలీసుల గ్యాంగ్‌లో ఒక కోవర్ట్‌, అటు రౌడీల గ్యాంగ్‌లో ఒక పోలీస్‌ కోవర్ట్‌... వగైరా దృశ్యాలతో బిగి సడలకుండా కథనం ముందుకి సాగుతుంటుంది. అలాగే ఢిల్లీకి కూతురనే ఎమోషనల్‌ యాంగిల్‌ కూడా తోడయి ఆ పాత్ర పట్ల సానుభూతిని కలిగిస్తూ, తన కోసం రూట్‌ చేసేట్టు చేస్తుంది.

లోకేష్‌ కనగరాజ్‌ తన కథ చెప్పాలనే చూసాడు కానీ ఎక్కడా హీరోకి ఎక్కువ స్క్రీన్‌ టైమ్‌ ఇవ్వాలి, లేదా ఇక్కడేదైనా కమర్షియల్‌ ఎలిమెంట్‌ వుండాలి లాంటి ఆలోచనలు పెట్టుకోలేదు. కార్తీ కథానాయకుడే కానీ సినిమా అంతా అతనే వుండడు. ఇటు లారీలో పోలీసులని రక్షించడానికి అతనెంత కష్టపడతాడో అటు ఎస్పీ ఆఫీసులో కానిస్టేబుల్‌, కాలేజ్‌ స్టూడెంట్స్‌ కూడా హీరోల్లానే పోరాడతారు. కథని నమ్మి ఈ పాత్ర చేసిన కార్తీ తన అభినయంతో ఢిల్లీ పాత్రని రక్తి కట్టించాడు. తన గతం చెప్పే సన్నివేశంలో చాలా ఎమోషనల్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. అలాగే నరైన్‌, జార్జ్‌తో సహా మిగిలిన పాత్రలు చేసిన వారంతా తమ వంతు సహకారం అందించి ఈ చిత్రాన్ని ఉత్కంఠభరితం చేసారు.

నేపథ్య సంగీతం అద్భుతంగా వుంది. ప్రతి సీన్‌లోను ఇన్‌వాల్వ్‌ చేస్తూ సదరు సన్నివేశంలోని టెన్షన్‌ని మనం ఫీలయ్యేట్టు చేస్తుంది. సినిమాటోగ్రాఫర్‌ అద్వితీయమైన ప్రతిభ చూపించాడు. ఆద్యంతం చీకట్లోనే జరిగే ఈ చిత్రాన్ని అత్యంత సహజమైన లైటింగ్‌తో అట్మాస్ఫిరిక్‌గా మలిచాడు. యాక్షన్‌ దృశ్యాలు చాలా బాగున్నాయి. ప్రతి ఫైట్‌ ఎఫెక్టివ్‌గా తెరకెక్కింది. ప్రీ క్లయిమాక్స్‌ ఫైట్‌ కాస్త మోతాదు మించిన వయొలెన్స్‌తో శృతి మించినా, ఫైనల్‌ షూటవుట్‌ మిగతా సినిమాకి సంబంధం లేని టోన్‌లో వున్నా ఓవరాల్‌గా యాక్షన్‌ డైరెక్టర్స్‌కి క్రెడిట్‌ ఇవ్వాలి. అలాగే ప్రొడక్షన్‌ డిజైన్‌ కూడా చాలా బాగుంది.

ఈ చిత్రాన్ని దర్శకుడు పూర్తిగా తన మదిలో ప్లే చేసుకుని చూడకపోతే దానిని ఇలా తెర మీదకి తీసుకురావడం చాలా కష్టం. ప్రతి డీటెయిల్‌ పట్ల అతనికి పూర్తి అవగాహనతో పాటు, ఏ సీన్‌నుంచి ఎప్పుడు కట్‌ అవ్వాలి, మళ్లీ ఎక్కడ తిరిగి ఎంట్రీ ఇవ్వాలి అనేది ఒక ప్రేక్షకుడిలా చూడగలగాలి. లేదంటే ఇంత అథెంటిక్‌గా ఇలాంటి చిత్రాన్ని తెరకెక్కించడం కష్టమవుతుంది. లెంగ్త్‌ పరంగా కూడా జాగ్రత్త తీసుకుని వుండాల్సింది. ఇలాంటి తరహా చిత్రాన్ని రెండు గంటల లోపు నిడివితో ముగించినట్టయితే ఇంకా చాలా బాగుండేది.

ఒక అరగంట ఎక్కువ సమయం పొడిగించడం వలనే అవే సీన్లు రిపీట్‌ అవుతున్న భావన కలుగుతుంది. సెకండ్‌ హాఫ్‌లో ఒక స్టేజ్‌ దాటిన తర్వాత మొనాటనీ అనిపించేయడమే కాకుండా స్టోరీ స్టక్‌ అయిన ఫీలింగ్‌ కూడా వస్తుంది. అంత పెద్ద గ్యాంగ్‌ ఆ బిల్డింగ్‌లోకి ఆయుధాలతో కూడా ఎంటర్‌ కాలేకపోవడం, ఏ గ్యాంగ్‌ కూడా కన్వీనియంట్‌గా గన్స్‌ వాడకపోవడం లాంటివి ఈ ఎక్స్‌ట్రా రన్‌ టైమ్‌ వల్ల మన దృష్టిలో పడతాయి. లాజిక్‌ దిశగా ఆలోచించనివ్వనంత బిగితో కథనం ఉన్నట్టయితే ఖైదీ ఇంకో లెవల్లో వుండేది.

అలాగే పతాక సన్నివేశాల దగ్గరకి వచ్చేసరికి కార్తీని హీరోలా చూపించే ప్రయత్నం మోతాదుకి మించి జరగడం కూడా అంతవరకు చూపించిన కన్విక్షన్‌కి తగ్గ టోన్‌లో లేకపోయింది. ఇలాంటి లోపాలని ఓవర్‌ లుక్‌ చేసేంత స్టఫ్‌ అయితే ఖైదీలో ఖచ్చితంగా వుంది. ఎలాంటి కమర్షియల్‌ హంగులు, హ్యూమర్‌ లేకుండానే కథలో లీనం చేసి చివరి వరకు అటెన్షన్‌ పే చేసేట్టు చేయగలిగింది. ఎంగేజ్‌ చేసే థ్రిల్లర్స్‌ని మిస్‌ అవుతోన్న మూవీ లవర్స్‌ ఖచ్చితంగా చూడాల్సిన చిత్రమిది. కథ, కథనం పక్కాగా వుంటే ఇక దానికి ఎలాంటి ఎక్స్‌ట్రా డెకరేషన్స్‌ అవసరం లేదని మరోసారి చాటి చెబుతుంది ఖైదీ.
బాటమ్‌ లైన్‌: కట్టిపడేసే ఖైదీ!
-గణేష్‌ రావూరి

సినిమా రివ్యూ: విజిల్‌   సినిమా రివ్యూ: రాజుగారి గది 3