టార్గెట్ పవన్.. రూటు మార్చిన వర్మ

మొన్నటివరకు చంద్రబాబును ఆడుకున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుచెప్పి చంద్రబాబుపై వర్మ వేసిన సెటైర్లు, రిలీజ్ చేసిన సాంగ్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుపై ఆ స్థాయిలో ఇప్పటివరకు ఎవ్వరూ…

మొన్నటివరకు చంద్రబాబును ఆడుకున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుచెప్పి చంద్రబాబుపై వర్మ వేసిన సెటైర్లు, రిలీజ్ చేసిన సాంగ్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుపై ఆ స్థాయిలో ఇప్పటివరకు ఎవ్వరూ విమర్శలు చేయలేదు. తలపండిన రాజకీయ నాయకులు సైతం బాబుపై ఆ రేంజ్ లో విరుచుకుపడలేదు. అలా బాబును బద్నామ్ చేసిన వర్మ, ఇప్పుడు తన ఫోకస్ ను పవన్ కల్యాణ్ పై పెట్టాడు.

కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమా రెడీ చేస్తున్నాడు వర్మ. దీపావళి కానుకగా ఈ మూవీ ట్రయిలర్ రిలీజ్ చేస్తున్నామంటూ ఊరిస్తున్నాడు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో చంద్రబాబు, జగన్, పవన్, లోకేష్, కేఏ పాల్.. ఇలా చాలా పాత్రల్ని చూపించాడు. అయితే ఎంతమంది ఉన్నప్పటికీ వర్మ మరోసారి బాబును చెడుగుడు ఆడేసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ ఆర్జీవీ మాత్రం ఈసారి పవన్ ను టార్గెట్ చేశాడు.

కొద్దిసేపటి కిందట ఓ స్టిల్ రిలీజ్ చేశాడు వర్మ. పవన్ ను పోలిన వ్యక్తి, భుజంపై ఎర్రకండువా, అదే హెయిర్ స్టయిల్, అంతే ఆవేశంతో స్పీచ్ ఇస్తున్నాడు. కానీ చుట్టూ అందమైన అమ్మాయిల్ని పెట్టాడు వర్మ. బ్యాక్ గ్రౌండ్ లో కూడా దాదాపు జనసేన జెండా వాడినంత పనిచేశాడు. కానీ తన ట్వీట్ లో ఎక్కడా పవన్ పేరు ప్రస్తావించలేదు. ఈ స్టిల్ చూసిన తర్వాత ఎవరైనా గుర్తొస్తే అది పూర్తిగా కాకతాళీయం మాత్రమే అని కూడా ట్వీట్ పెట్టి జనసైనికుల్ని మరింత రెచ్చగొట్టాడు వర్మ.

అక్కడితో ఆగకుండా ఆ వెంటనే మరో స్టిల్ రిలీజ్ చేశాడు. ఈసారి పవన్ పాత్రధారి పక్కన మరో వ్యక్తిని పెట్టాడు. అది చూసిన వాళ్లకు ఎవరికైనా వెంటనే లోకేష్ గుర్తుకురావడం సహజం. కానీ వర్మ మాత్రం మళ్లీ టీజ్ చేశాడు. ఫొటోలో వాళ్లిద్దర్నీ ఎవరైనా గుర్తుపడితే మంచి బహుమతి ఇస్తానని ప్రకటించాడు.

ఇలా తన సినిమాకు ఓవైపు జోరుగా ప్రచారం చేస్తూనే, మరోవైపు పవన్ పై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టాడు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు ఇదే పవన్ ను వీరుడు-శూరుడు అని పొగిడిన వర్మ, ఇప్పుడు అదే నోటితో పవన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నాడు. దీపావళికి రానున్న ట్రయిలర్ లో పవన్ పై ఇంకెన్ని సెటైర్లు వేశాడో చూడాలి.

యూజ్‌ అండ్‌ త్రో కెసియార్‌