పవన్ కల్యాణ్ క్రేజ్ ని, ఆయన ఆశయాలను శంకించలేం కానీ.. కొన్ని సందర్భాల్లో పవన్ తన ప్రసంగాలతో నవ్వులపాలవుతుంటారు. “లక్షల” కొద్దీ ఎక్కువగా పుస్తకాలు చదివానని పవన్ గతంలో చెప్పుకున్నారు. ఆ ప్రభావం వల్లనో లేక, అప్పటికప్పుడు అనుకుని చెప్తారో తెలియదు కానీ.. పవన్ చారిత్రక విషయాలు చెప్పేటప్పుడు మాత్రం చాలాసార్లు తడబడ్డారు. ఇలాంటి విషయాల్లో లోకేష్ కి ఏమాత్రం తీసిపోనని మరోసారి నిరూపించారు.
ఆమధ్య అబ్దుల్ కలాంని చంద్రబాబే రాష్ట్రపతిని చేశారని చెబుతూ 2012లో వాజ్ పేయిని ప్రధానిగా మార్చేశారు లోకేష్. గణాంకాల గురించి, సంవత్సరాల గురించి మాట్లాడేటప్పుడు రాజకీయనాయకులు తెలియకపోతే తెలియనట్టుండాలి, లేదా పేపర్ పై రాసుకుని వచ్చి ఉన్నదున్నట్టు చదవాలి. ఎవరినో మోసం చేయాలని, తానేదో మేథావినని చెప్పుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఇలాగే అభాసుపాలవుతుంటారు. అప్పుడు లోకేష్ ఇలా నవ్వులపాలయితే, ఇప్పుడు పవన్ కల్యాణ్ చైనా దురాక్రమణని ప్రస్తావిస్తూ తనలోని మేథావిని బైటకు తెచ్చారు.
తాను నెల్లూరులో ఐదో తరగతి చదివేటప్పుడు చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని తెలుసుకుని ఆవేదనకు గురయ్యానని, తనలో తాను మథనపడి, సంఘర్షణపడి.. చివరకు ఇలా పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ పుట్టింది 1971లో. ఆయన నెల్లూరు జిల్లాలో ఐదో తరగతి చదివేటప్పుడు అంటే 1981-82 అయి ఉంటుంది. 1962లో చైనా-భారత్ యుద్ధ సమయంలో చైనా మన భూభాగాలను ఆక్రమించుకుంది. మరి ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ 20ఏళ్ల తర్వాత తెలుసుకున్నారా? నెల్లూరు మీటింగ్ కి వచ్చేముందే చైనా ఆక్రమణ గురించి ఏదో పుస్తకంలో పవన్ చదివి ఉంటారు, దాన్ని ఇలా ప్రస్తావించి నవ్వులపాలయ్యారు.
పవన్ ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. పాపం చైనా యుద్ధం గురించి తెలియని జనసైనికులు మాత్రం పవన్ కల్యాణ్ ప్రసంగం విని చప్పట్లతో హోరెత్తించారు. వినేవాళ్లు జనసైనికులైతే, చెప్పేవాడు పవన్ కల్యాణ్ కాక ఇంకెవరవుతారు. లోకేష్ బాబు కూడా కావచ్చనుకోండి. మొత్తమ్మీద మన పవన్ కల్యాణ్ మాత్రం ప్రసంగాలతో లోకేష్ ని మించిపోతున్నారని అంటున్నారు సోషల్ మీడియా జనాలు.