తెలుగుదేశం పార్టీనుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కొందరు ఫిరాయించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారనే పుకార్లు చాలాకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. మీ వాళ్లు ఎప్రోచ్ అవుతున్నారు… చేర్చుకోమంటారా? అంటూ జగన్ స్వయంగా అసెంబ్లీలోనే చంద్రబాబును ప్రశ్నించారు కూడా. అయితే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా తెదేపా ఎవ్వరినీ చేర్చుకోరాదని.. జగన్ నిర్ణయించినందు వల్లనే ఆ చేరికలకు బ్రేక్ పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు రాజీనామాకు కూడా సిద్ధపడి వల్లభనేని వంశీ వైకాపాలో చేరుతున్నారు.
మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలతో కలిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డిని కలిశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అయినా సరే.. వైకాపాలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఆల్రెడీ వార్తలు వచ్చాయి. రాజీనామా విషయంలో బేరాలాడలేదని, ఉపఎన్నిక జరిగేప్పుడు టికెట్ గ్యారంటీ మాత్రం హామీపొందారని తెలుస్తోంది.
నిజానికి తెలుగుదేశం నుంచి చాలామంది ఎమ్మెల్యేలే జగన్ జట్టులో చేరడానికి ఉత్సాహపడుతున్నారు గానీ.. అందరికీ టికెట్ హామీ లభించడం లేదని సమాచారం. కొందరికి టికెట్ హామీ ఉంది గానీ.. వారు రాజీనామాలకు సిద్ధంగాలేరు. ఇంత స్వల్ప వ్యవధిలో మరోమారు ఎన్నికలకు వెళ్లడం ఆర్థికంగా తమవల్ల కాదనే భయంలో ఉన్నారు. అలాంటివారు.. బయటపడకుండా.. ఇంకా తెదేపాలోనే కొనసాగుతున్నారు.
కొందరి విషయంలో జగన్ టికెట్ గ్యారంటీ ఇవ్వడంలేదు. ప్రస్తుతానికి మా పార్టీని నమ్ముకుని గత ఎన్నికల్లో పోటీచేసిన వారికే టికెటిస్తాం. నెక్ట్స్ టైం మళ్లీ మీకు అవకాశం ఇవ్వగలం అంటున్నట్లు సమాచారం. అందుకు కొందరు ఇష్టపడడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, మాజీ ఎమ్మెల్యేగా కూచోడానికి విముఖంగా ఉన్నారు.
తెదేపా పరిస్థితి చాలా గడ్డుగా ఉంది. స్థానిక రాజకీయాల పుణ్యమాని వైకాపాలో తమకు ఠికానా లేదు గనుక.. భాజపాలోకి వెళ్లడానికి చాలామంది ప్రయత్నించినప్పటికీ.. అనర్హత వేటు పడుతుందనే భయం కారణంగానే ఆగారు. ఇప్పుడు వల్లభనేని వంశీ అందుకు కూడా సిద్ధపడి వైకాపాలో చేరుతున్నారు.