సమీక్ష: విజిల్
రేటింగ్: 2.5/5
బ్యానర్: ఏ.జి.ఎస్. ఎంటర్‌టైన్‌మెంట్
తారాగణం: విజయ్, నయనతార, జాకీ ష్రాఫ్, డేనియల్ బాలాజీ, వివేక్, యోగి బాబు, ఇందుజ, రెబా మోనికా జాన్, వర్ష బొల్లమ్మ తదితరులు
కథ: అట్లీ
కథనం: అట్లీ, ఎస్. రమణ గిరివాసన్
కూర్పు: రూబెన్
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
ఛాయాగ్రహణం: జి.కె. విష్ణు
నిర్మాతలు: ఎస్. అఘోరం, ఎస్. గణేష్, ఎస్. సురేష్
దర్శకత్వం: అట్లీ
విడుదల తేదీ: అక్టోబర్ 25, 2019
కొందరు హీరోలు కొన్ని ప్రాంత సినీ ప్రేక్షకులకి కనక్ట్ అవుతారు. వారి స్టయిల్, వారి మేనరిజమ్స్ నచ్చి వాళ్లని ప్రేక్షకులు సూపర్‌స్టార్స్‌ని చేస్తారు. సదరు ప్రాంతీయ సూపర్‌స్టార్స్ నటన, మేనరిజమ్స్ మిగతా ప్రాంతాల వారికి, పర భాషల వారికీ నచ్చాలని లేదు. తమిళ హీరోల్లో రజనీ, కమల్ తర్వాత అలా మనల్ని ఆకట్టుకున్న తమిళ హీరోలు సూర్య, విక్రమ్. అయితే తమిళనాట రజనీ తర్వాతి తరంలో అంతటి ఫాలోయింగ్ తెచ్చుకున్న తమిళ సూపర్‌స్టార్ విజయ్. ఇతనిదో ప్రత్యేక శైలి. నటన పరంగా చాలా యావరేజ్ అయినా కానీ తన స్టయిల్స్, మేనరిజమ్స్ తమిళ జనాలకి నచ్చుతుంటాయి. మురుగదాస్ తుపాకీ, సర్కార్ లాంటి చిత్రాలతో తెలుగులో కూడా విజయ్ ఇప్పుడిప్పుడే కొద్దిగా పాపులర్ అవుతున్నాడు.
కమర్షియల్ చిత్రాలు మాత్రమే చేసే విజయ్‌తో మురుగదాస్ తీసే చిత్రాల్లో సోషల్ ఎలిమెంట్స్ వుంటాయి కనుక వాటితో ఇతర ప్రాంతాల వారు కూడా రిలేట్ అవ్వవచ్చు. కానీ అట్లీ తీసే చిత్రాలు పూర్తిగా విజయ్ ఇమేజ్‌ని, స్టయిల్‌ని, మేనరిజమ్స్‌ని దృష్టిలో పెట్టుకుని రూపొందుతుంటాయి. ఇవి నచ్చాలంటే మనకి ముందుగా విజయ్ నచ్చాలి. 'విజిల్' కూడా విజయ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా మలచిన ఫక్తు కమర్షియల్ చిత్రమే. కాకపోతే దీనికి విమెన్ ఫుట్‌బాల్ అంటూ ఒక నేపథ్యాన్ని పెట్టుకున్నారు. అవడానికి స్పోర్ట్స్ డ్రామా అయినా కానీ పూర్తిగా మసాలా సినిమా. కథలో ఎప్పుడేం జరుగుతుందనేది ముందే ఊహించేయవచ్చు. ఫుట్‌బాల్ గేమ్‌కి సంబంధించిన సీన్లలో టెక్నికల్ వేల్యూస్ మినహాలో ఆటలో ఎలాంటి ఎక్సయిట్‌మెంట్ కానీ, ఇమాజినేషన్ కానీ, ఎమోషన్ కానీ వుండదు.
'బిగిల్' (తమిళంలో) ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా విజయ్ ఫాన్స్‌కి మాత్రం ఫెస్టివల్ ఫీస్ట్ అవ్వాలని అట్లీ కేర్ తీసుకున్నాడు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేసాడు. తండ్రీ కొడుకులుగా నటించిన విజయ్‌కి చెరో ఇంట్రడక్షన్ సీన్ ఇచ్చాడు. మళ్లీ కొడుక్కి ఫుట్‌బాల్ నేపథ్యం వుంది కాబట్టి అదనంగా మరో ఇంట్రడక్షన్ సీన్ పెట్టాడు. ఈ సీన్లన్నీ విజయ్ ఫాన్స్ కోసం. మిగతా వారిని మెప్పించడానికి ఏవైనా వుండాలని కూడా అట్లీ ఆలోచించినట్టు లేడు. హీరోయిన్‌గా నయనతార పాత్ర పరిచయం, దానికి కొనసాగింపుగా వచ్చే సన్నివేశాలు రైటింగ్‌లో డొల్లతనాన్ని ఎత్తి చూపిస్తాయి.
బిగిల్ ఎందుకు ఫుట్‌బాల్ మానేసి రౌడీలతో తిరుగుతున్నాడనే దానికో ఫ్లాష్‌బ్యాక్ వుంటుంది. అది కూడా అనాదిగా చూస్తోన్న అదే గాడ్‌ఫాదర్ తరహా నేపథ్యం. తండ్రి రౌడీయిజం చేస్తూ కొడుకు అందరికీ స్ఫూర్తిగా నిలవాలని కలలు కంటుంటాడు. ఈ తండ్రీ కొడుకులు అనుబంధాన్ని చూపించడానికి 'కావలించుకోరా' అని రాజప్ప పిలవడం, విజయ్ అదోలాంటి నడకతో చిన్నపిల్లాడిలా కౌగిలించుకోవడం జస్ట్ విజయ్ థింగ్స్ అనుకోవాలి. అలాంటివి అతని శైలి నచ్చని వారికి 'దే..వుడా' అనిపిస్తాయి.
ఇక సెకండ్ హాఫ్ సదరు బిగిల్ ఒక విమెన్ ఫుట్‌బాల్ టీమ్‌కి కోచ్‌గా వెళ్లడమనే పాయింట్‌పై నడుస్తుంది. తమిళనాడు టీమ్ అని స్కోర్ బోర్డ్ కనబడుతోంటే, ఆంధ్రా టీమ్ అని కామెంటరీ చెబుతుంటారు. డబ్బింగ్ సినిమా కనుక అడ్జస్ట్ అవ్వాలి. అయినా శంకర్ మాదిరిగా అనువాద చిత్రంలో కూడా ఏ ఊర్లో జరుగుతోందో అదే పేరు పెడితే తప్పేమిటో మరి? సరే, ఇది చిన్నది. అసలైన సంగతి మ్యాచ్‌లలో జరుగుతుంటుంది. ఈ కోచ్‌ని ఇష్టపడని 'చక్ దే ఇండియా' హాకీ ప్లేయర్స్.. అదే ఫుట్‌బాల్ ప్లేయర్స్ సమన్వయం లేక ఒక మ్యాచ్‌లో ఓడతారు. దాంతో తానొక్కడే ఒక వైపు వుండి మూడు గోల్స్ వేస్తానని, మీరంతా ఒకవైపు వుండి గోల్ వేస్తే కోచ్‌గా రిజైన్ చేస్తానంటాడు.
విజయ్ కాబట్టి మూడు గోల్సూ వేసేస్తాడని వేరే చెప్పాలా? ఇలాంటివి తమిళవాళ్లు 'బిగిల్' వేసుకునే మూమెంట్స్ కదా. ఒక్కడు అటు వైపు వుంటే అటో గోల్ వేయడం కానీ, ఇటో గోల్ ఆపడం కానీ చేయలేని ఈ టీమ్‌కి అతనిచ్చే కోచింగ్ సీనొకటుంటుంది. అతను రెండు హోల్స్ పెట్టి క్లోజ్ చేసి పెట్టిన గోల్ పోస్ట్‌లో గోల్ వేయలేకపోతే వాళ్లు గ్రౌండ్‌లో పది రౌండ్లు పరుగెత్తాలి. అలా నాలుగైదుసార్లు పరుగెత్తే సరికి వాళ్లకి అలా చిన్న గ్యాప్‌లోంచి గోల్ వేయడం వచ్చేస్తుంది. అదే టీమ్ స్పిరిట్ అని చెప్తాడు హీరో. మళ్లీ బిగిల్.
ఈ సీన్‌తో వాళ్లకి ఫుల్‌గా కోచింగ్ అయిపోయినట్టు టీమ్‌లోంచి మిస్ అయిన ఇద్దరు ప్లేయర్స్‌ని వెతుకుతూ వెళతాడు. లేడీస్ సెంటిమెంట్ పండించడానికి, స్త్రీవాదాన్ని ఎలుగెత్తి చాటడానికి సదరు సీన్లని వాడుకున్నారు. కొంతకాలంగా గ్రౌండ్‌లోకే రాని ఆ ఇద్దరూ ఆ తర్వాత సరాసరి ఫైనల్స్ మ్యాచ్ ఆడేసి గోల్స్ వేసేస్తారు. అదో బిగిల్ మూమెంట్ అనుకొందురూ! ఈమధ్య హీరో ఎలివేషన్ కోసం జరిగే సీన్లు, వగైరా ఏది చూసినా కానీ ఇది విజయ్ సినిమా, ఇదిలాగే వుంటుంది అన్నట్టుగా అట్లీ తానింతకు ముందు అతనితో తీసిన సినిమాల మాదిరిగానే దీనినీ తీసేసాడు. మళ్లీ దీనికి లేడీస్‌కి అంకితం అంటూ పెద్ద మాటలేమిటో అట్లీకే తెలియాలి.
స్త్రీవాదాన్ని ప్రోత్సహిస్తున్నామని బలంగా ఫీలయిన ఇదే సినిమాలో… ఫైనల్స్‌లో సరిగా ఆడని ప్లేయర్స్‌ని హీరో ఎలా రెచ్చగొడతాడో తెలుసా? గుండమ్మ అంటూ. లావుగా వున్న ఆమెని గుండమ్మ అని అతను అంటూ వుంటే ఆమె కోపంతో ఊగిపోయి గోల్స్ కొడుతుంది. ఇదో 'బిగిల్' సీన్ అనుకున్నాడే కానీ దీనిని 'బాడీ షేమింగ్' అంటారని గ్రహించినట్టు లేరు. గాల్లో రివర్స్ కిక్ ఇవ్వడం, మరొకరు పాస్ చేస్తే తలతో గోల్ చేయడం లాంటి స్టాక్ సీన్లతో సాగే ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఏమాత్రం ఉత్కంఠ రేకెత్తించవు.
మన సినిమాలలో స్పోర్ట్స్ డ్రామాలు మాత్రమే ఇంకా కమర్షియల్ మకిలి పట్టకుండా వాస్తవానికి దగ్గరగా రూపొందుతుంటాయి. చక్ దే ఇండియా, జెర్సీ లాంటివి. అలాంటివి తీయలేనపుడు కనీసం తమ కమర్షియల్ అవసరాల కోసం వాటి జోలికి పోకపోతే 'విమెన్ ఎంపవర్‌మెంట్'కి మించి సమాజానికి హెల్ప్ చేసిన వాళ్లవుతారు. నటన పరంగా చెప్పుకోతగ్గ పర్‌ఫార్మెన్స్ ఏదీ లేదు. తెర వెనుక మాత్రం ఫుట్‌బాల్ మ్యాచ్‌లు అంత గ్రాండ్‌గా తెరకెక్కడానికి బాగానే కష్టపడ్డారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. రెహమాన్ నేపథ్య సంగీతం మెప్పిస్తుంది.
స్త్రీ జనోద్ధారణ, స్పోర్ట్స్ డ్రామా లాంటి పెద్ద మాటలు దేనికి గానీ ఒక సగటు మసాలా చిత్రాన్ని తమిళ హీరో చేయగా చూడగలమనుకుంటే ఆ తరహా చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులు ఓసారి ట్రై చేయవచ్చు. కమర్షియల్ చిత్రాల కోసం మన స్టార్లు మనకున్నారు అనుకుంటే వాళ్ల సినిమాలొచ్చినప్పుడే వెళ్లి విజిలేయవచ్చు.
బాటమ్ లైన్: పొరుగింటి పుల్లకూర!
-గణేష్ రావూరి
సినిమా రివ్యూ: రాజుగారి గది 3 సినిమా రివ్యూ: ఆర్‌డిఎక్స్ లవ్