“మీ ఇంటి పెళ్లికొచ్చా, మీతో నాకు పర్సనల్ రిలేషన్ షిప్ ఉంది. ఆ అనుబంధం అలాగే కొనసాగనీయండి, మధ్యలో లేనిపోని విమర్శలు చేయకండి. పద్ధతిగా మాట్లాడండి”. అంబటి రాంబాబుని ఉద్దేశించి పవన్ కల్యాణ్ అన్న మాటలివి. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అంటూ అంబటి విమర్శలు చేయడంతో.. పవన్ నొచ్చుకున్నారు. అందుకే ఇలా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు దిగారు.
అంబటి వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలనుకుంటే తాను దత్తపుత్రుడిని ఎందుకు కాదో చెప్పుకోవాలి, చంద్రబాబుకి వ్యతిరేకంగా తాను చేసిన పోరాటాలు (ఒకవేళ ఉంటే) ప్రస్తావించాలి. అది మానేసి అంబటిపై రివర్స్ అటాక్ మొదలు పెట్టారు పవన్. పోనీ అది రాజకీయ విమర్శల రూపంలో ఉంటే బాగుండేది. పవన్ కూడా హుందాగానే స్పందించారని సరిపెట్టుకునేవాళ్లం. అలా స్పందిస్తే పవన్ ఎందుకవుతారు. అందుకే అంబటిని సెంటిమెంట్ తో కొట్టాలని చూశారు, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కి దిగారు.
పర్సనల్ రిలేషన్ గుర్తుచేస్తూ తనపై విమర్శలు చేయడం సరికాదని అంటున్నారు జనసేనాని. అంబటి ఇంట్లో జరిగిన పెళ్లికి పవన్ కల్యాణ్ వెళ్లి ఉండొచ్చు. అన్నీ తానై చేసి ఉండొచ్చు కూడా. అంత మాత్రాన వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేయకూడదంటే ఎట్లా. పోనీ పవన్ కల్యాణ్ పై విమర్శలు వస్తే జనసైనికులు చూస్తూ ఊరుకుంటారా. తిరిగి వారిపై విరుచుకు పడరూ..? అలాగే అంబటి కూడా తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తూ పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలకు నొచ్చుకున్నారు.
ఢిల్లీ పర్యటనపై వ్యంగాస్త్రాలు విసిరిన పవన్ కు అంతకంటే సెటైరిక్ గా సమాధానాలిచ్చారు. పుస్తకాలు చదివి చదివీ పవన్ కి జ్ఞానం ఎక్కువైందని అన్నారు అంబటి. అంతమాత్రానికే పవన్ ఇదైపోతే ఎలా? పవన్ కల్యాణ్ ఇసుక ఇబ్బందుల గురించి మాట్లాడితే తప్పులేదు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు పోలీసు విచారణలో ఉండగా.. దాన్ని కూడా జగన్ కి సంబంధం పెడుతూ మాట్లాడితే ఎలా? జనసైనికులు మాత్రం తమ పరిధిలు దాటి ఏమైనా చేయొచ్చు, ఎదుటివారు ఏమన్నా అంటే మాత్రం కుదరదా? ఇదెక్కడి నీతి?
ఇంకోసారి ఫ్యామిలీలు, పెళ్లిళ్లు అంటే.. పవన్ చేసుకున్న మూడు పెళ్లిళ్లకూ నేను కూడా వెళ్లానని ఇంకెవరైనా కొత్త పల్లవి అందుకుంటే.. అప్పుడు ఆయన ఏం సమాధానం చెబుతారు.