ఎన్నికల ముందుమాట.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్కడ నుంచి అక్కడ నుంచి డైరెక్టుగా లోటస్ పాండ్ కు వెళ్లక ఆ సమీపంలోనే ఉన్న త్రిదండి శ్రీమాన్ నారాయణ చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. శంషాబాద్ కు సమీపంలోనే ఆ ఆశ్రమం ఉంటుంది. చిన్నజీయర్ స్వామీజీ అప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ కు గురువు స్థాయిలో ఉన్నారు. యాదాద్రి అభివృద్ధి విషయంలో అయితేనేం, ఇతర హోమాలు, యాగాల విషయంలో అయితేనేం.. చిన్నజీయర్ స్వామీజీ ఆశీస్సులు పలుసార్లు తీసుకున్నారు కేసీఆర్!
అలా కేసీఆర్ కు గురువులాంటి చిన్నజీయర్ ను వెళ్లి జగన్ కలిస్తే.. తెలుగుదేశం పార్టీ వాళ్లు ఒకేమాట అన్నారు. చిన్నజీయర్ దగ్గర నుంచి జగన్ డబ్బులు తెచ్చుకున్నారని, కేసీఆర్ ఫండ్స్ చిన్నజీయర్ ద్వారా జగన్ కు అందాయని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. చిన్నజీయర్ ఆశ్రమానికి జగన్ వెళ్లడం వెనుక రీజన్ అదే అని టీడీపీ నొక్కివక్కాణించింది.
వెయ్యి కోట్ల రూపాయలకు పైగా డబ్బులను చిన్నజీయర్ ఆశ్రమం నుంచినే జగన్ తెచ్చుకున్నారని ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టింది! కట్ చేస్తే.. చిన్నజీయర్ ఆశ్రమంలో తేలారు చంద్రబాబు నాయుడు. అక్కడకు వెళ్లి ఆ స్వామీజీకి చంద్రబాబు నాయుడు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఏ స్వామీజీ అయితే జగన్ కు బ్లాక్ మనీ ఇచ్చారని తెలుగుదేశం పార్టీ ఆరోపించిందే.. ఐదు నెలల తర్వాత అదే స్వామీజీ పాదాల వద్ద చంద్రబాబు కనిపించడం.. తెలుగుదేశం పార్టీ స్థితి గతులను చాటుతూ ఉందని పరిశీలకులు అంటున్నారు.