విశాఖ పరిసర ప్రాంత వాసులు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న విచారణ మొదలైంది. విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల 13 మండలాల్లో జరిగిన అతిపెద్ద భూ కుంభకోణంపై సిట్ విచారణ మొదలైంది. ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో తెలపాలంటూ ప్రజలకు విజ్ఞప్తిచేశారు సిట్ సభ్యులు. దీనికోసం ఏకంగా 19 కౌంటర్లు ఏర్పాటుచేశారు. మొదటి రోజు ఏకంగా 79 వినతులు రావడం విశేషం. వీటిలో సిట్ కు 14, నాన్-సిట్ కు 65 వినతులు వచ్చాయి. ఈరోజు 2వందలకు పైగా వినతులు వస్తాయని అంచనా.
విశాఖ రెవెన్యూ డివిజన్ లో వేల ఎకరాల భూమి ఆక్రమణలకు గురైంది. వీటిలో ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూములు కూడా ఉన్నాయి. సబ్బవరం, పెందుర్తి, పరవాడ, భీమునిపట్నం, గాజువాక ఇండస్ట్రీయల్ ఏరియా, గంట్యాడ ప్రాంతాల్లో కోట్ల రూపాయల ఖరీదు చేసే భూములున్నాయి. వీటన్నింటిపై సిట్ ఏర్పాటైంది. మొదటి రోజు భయపడి చాలామంది బాధితులు వినతులు ఇవ్వడానికి ముందుకురాలేదని సిట్ భావిస్తోంది. ఇవాళ్టి నుంచి వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈనెల 7 వరకు సిట్ బృందం వినతిపత్రాలు స్వీకరిస్తుంది.
విశాఖ పరిసర ప్రాంతాల్లో వేల ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లలో కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కబ్దాలన్నింటిపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని చంద్రబాబు హయాంలో ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేశాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో వాటిని పట్టించుకోలేదు. సిట్ నివేదికను కూడా బయటపెట్టలేదు. అప్పట్లో ఆయన ఎందుకు విచారణకు ఆదేశించలేదో అందరికీ తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుచేశారు ముఖ్యమంత్రి జగన్. ఈ బృందం తమ దర్యాప్తు ప్రారంభించింది. 3 నెలల్లో ముఖ్యమంత్రికి పూర్తి నివేదిక ఇవ్వబోతోంది. వినతులు అన్నీ పరిశీలించిన తర్వాత, సాక్ష్యాలు సమగ్రంగా ఉన్నాయని భావిస్తే అప్పుడు అరెస్టుల పర్వం మొదలవుతుంది. విశాఖ భూపందేరం మొత్తం టీడీపీ నేతల చేతుల మీదుగా జరిగిందనేది బహిరంగ రహస్యం.
మరీ ముఖ్యంగా ఈ వేలాదిఎకరాల భూ కుంభకోణంలో అప్పటి మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు హస్తం ఉందంటూ ఇప్పటికే పలువురు నేతలు ఆరోపించారు. దీనిపై గతంలో గంటా కూడా స్పందించారు. ఎలాంటి విచారణకైనా తను సిద్ధం అంటూ మేకపోతు గాంభీర్యం ప్రకటించారు. త్వరలోనే విజయ్ కుమార్ నేతృత్వంలోని సిట్ ఆక్రమణలన్నీంటినీ నిగ్గుతేల్చబోతోంది. పోలవరం అవకతవకల తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణంగా విశాఖ భూపందేరానికి పేరుంది.