టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని కరోనా చికిత్స నిమిత్తం నేరుగా హైదరాబాద్‌కు తరలించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కడప కేంద్ర కారాగారంలో పెద్ద ఎత్తున ఖైదీలు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. అదే జైల్లో ఉన్న జేసీ బ్రదర్ కూడా ఆ మహమ్మారి బారి నుంచి తప్పించుకోలేకపోయారు.
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో రెండు నెలల క్రితం జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డిలను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేసిన కడప సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఆ కేసులో తండ్రీకొడుకులు 55 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అనంతపురం జిల్లా కోర్డు బెయిల్ ఇవ్వడంతో మందీమార్బలం మధ్య ఆయన తాడిపత్రికి వెళ్లారు.
తాడిపత్రి రూరల్ పరిధిలో ట్రాఫిక్‌లో భాగంగా జేసీ కాన్వాయ్‌ని ఆపిన సీఐతో ప్రభాకర్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. తనను కులం పేరుతో దూషించారని సీఐ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదైంది.
దీంతో బెయిల్‌పై విడుదలైన 24 గంటల్లోనే తిరిగి ఆయన్ను అరెస్ట్ చేసి కడప జైలుకు తరలించారు. కరోనా బారిన పడిన జేసీ ప్రభాకర్‌రెడ్డికి అనంతపురం ఎస్సీ, ఎస్టీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో బెయిల్‌పై గురువారం విడుదలైన జేసీ ప్రభాకర్‌రెడ్డిని కడప నుంచి నేరుగా హైదరాబాద్‌కు బంధువులు తరలించారు. అక్కడ ఆయనకు కరోనా ట్రీట్‌మెంట్ అందించనున్నారు.