సరిగ్గా 24 గంటల కిందట టెలివిజన్/మూవీ ఆర్టిస్టుల్ని కడిగి పారేసిన సీనియర్ నటి శివపార్వతి.. ఇప్పుడు మాట మార్చారు. తనకు కరోనా సోకిన తర్వాత ఎవరేంటనే విషయం బాగా తెలిసిందని, ఎవ్వర్నీ ఎవ్వరూ పట్టించుకోరంటూ భావోద్వేగానికి గురైన శివపార్వతి.. ఇప్పుడు అంతా బాగుందంటున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో పాటు.. సీరియల్ యూనిట్ సభ్యులంతా తనకు సపోర్ట్ గా ఉన్నారని చెప్పుకొచ్చింది.
“మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, నా తోటి ఆర్టిస్టులు ఎప్పుడూ నాకు సపోర్ట్ గా ఉన్నారు. పరుచూరి బ్రదర్స్ నాకు మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఏ విషయంలో నాకు ఇబ్బంది లేదు. నేను వర్క్ చేస్తున్న ప్రొడక్షన్ హౌజ్ నుంచి స్పందన లేదని ఓ వీడియో పెట్టాను. అది అందరికీ మనస్తాపానికి గురిచేసింది. అలాంటిదేం లేదు. యూట్యూబ్ ఛానెల్స్ ప్రకటించిన కొంతమంది వ్యక్తులు మరోలా భావించాల్సిన అవసరం లేదు.”
ఈ కరోనా కాలంలో ఎవ్వరూ ఎవ్వర్నీ విమర్శించుకోవాల్సిన అవసరం లేదని, తనను పలకరించలేదని మాత్రమే ఫీలయ్యానని శివపార్వతి కవర్ చేసే ప్రయత్నం చేశారు. తనకు సానుభూతి, ఆర్థిక సాయం కూడా అవసరం లేదని.. నైతిక ధైర్యం కావాలని మాత్రమే అడిగానంటున్నారు.
శివపార్వతి క్లారిటీ ఇవ్వడానికి ముందే ఆమె ఆరోపణలు చేసిన యూనిట్ కు చెందిన ప్రధాన వ్యక్తి ప్రభాకర్ లైన్లోకి వచ్చారు. కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల శివపార్వతి తమను అపార్థం చేసుకున్నారని.. ఆమె కొడుకుతో తామంతా టచ్ లో ఉన్నామని.. ఆ విషయం శివపార్వతికి తెలియదన్నారు.