ఏపీ, తెలంగాణ జల వివాదాలపై ఈనెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారు. ఈనెల 5న జరగాల్సిన ఈ మీటింగ్ వాయిదా పడినా, 25న మాత్రం ఖాయంగా జరుగుతుందని అంటున్నారు. ఇప్పటికే జలవివాదాలపై ఇరు రాష్ట్రాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. ఈ నేపథ్యంలో 25న ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డులకు అందిన ఫిర్యాదుల మేరకు పరిష్కారం దిశగా ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. కృష్ణాలో నీళ్లు మీరు ఎత్తుకెళ్తున్నారని తెలంగాణ అంటే, కొత్త ప్రాజెక్ట్ లతో గోదావరిని మీరు ఖాళీ చేస్తున్నారని ఏపీ ఆరోపణలు చేస్తోంది. ఇలా ఇరు రాష్ట్రాలు వాడివేడిగా ఆరోపణలు చేసుకోవడంతో అపెక్స్ కౌన్సిల్ లో జరిగే చర్చ రచ్చగా మారేలా ఉంది.
ఇంటికి పిలిచి భోజనం పెట్టి మర్యాద చేస్తే, మనకే సున్నం పెడుతున్నారంటూ ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైసీపీ నేతలు వీటిపై స్పందించలేదు కానీ, ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయాలని చూశాయి. అయితే సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలనేది సీఎం జగన్ ఆలోచన. తెలంగాణ ఆరోపిస్తున్నట్టు రాయలసీమ ఎత్తిపోతల పథకంతో కృష్ణా జలాలను ఏపీ అదనంగా తీసుకుపోయేదేమీ ఉండదు. పోతిరెడ్డిపాడులో అంతర్భాగంగా చేపట్టిన ఈ పథకాన్ని, కొత్త ప్రాజెక్ట్ గా తెలంగాణ భావిస్తోంది. దీంతోనే అసలు చిక్కంతా వచ్చి పడింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మిగులు జలాలు మాత్రమే తరలిస్తామంటోంది ఏపీ సర్కారు. దీని కోసమే పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యాన్ని పెంచుతోంది. పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం జలాశయం 854 మీటర్ల వద్ద గ్రావిటీతో తెలుగుగంగ, శ్రీశైలం కుడిగట్టు కాల్వ, గాలేరు నగరి సుజల స్రవంతి పథకాలకు నీరందిస్తారు. వరద ప్రభావం ఉన్నప్పుడు ఆ స్థాయి వరకు వేచి చూడకుండా 800 మీటర్ల వద్ద ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టడమే రాయలసీమ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. దీంతో అదనంగా నీరు లభ్యమై రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది.
దీనిపై తెలంగాణ సర్కారు అభ్యంతరాలు లేవనెత్తుతోంది. దీనికి పర్యావరణ అనుమతి కూడా అక్కర్లేదని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. అపెక్స్ కౌన్సిల్ కి హాజరై తాడో పేడో తేల్చుకుందామంటూ ఇప్పటికే అధికారులకు సూచించారు తెలంగాణ సీఎం కేసీఆర్. పక్కాగా నీటి లెక్కలు తయారు చేయాలని ఆదేశాలిచ్చారు.
అటు తెలంగాణ సర్కారు గోదావరిపై నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్ట్ లపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే ఇవేవీ కొత్త ప్రాజెక్ట్ లు కావని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ ల సామర్థ్యాన్ని మాత్రమే పెంచామని చెబుతోంది తెలంగాణ సర్కారు. సామర్థ్యం మాత్రమే పెంచితే.. తెలంగాణలో కొత్త ప్రాజెక్ట్ లు, భగీరథుడు కేసీఆర్.. అంటూ అక్కడ ప్రభుత్వమే ఎందుకు ప్రచారం చేసుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది.
మొత్తమ్మీద.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ అపెక్స్ కమిటీ మీటింగ్ వేదికగా గొడవ మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ పడేదే లేదని తేల్చి చెబుతున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. అపెక్స్ కౌన్సిల్ లో సంధి చేసుకుంటారో లేదో చూడాలి.