వివాదాలు లేందే ఆ నటికి పొద్దు గడిచేలా లేదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండడం ఆమెకు ఓ హ్యాబీగా మారినట్టుంది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆ నటే మీరా మిథున్. తాజాగా హీరో విశాల్‌ను ఆమె టార్గెట్ చేశారు.
ఇంతకు ముందు హీరోలు విజయ్, సూర్యలపై కూడా మీరా వ్యక్తిగత విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా మీరాపై ఫైర్ అయ్యారు. మీరా వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు భారతీరాజా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారంటే…ఆమె ఎంత వివాదాస్పద నటో అర్థం చేసుకోవచ్చు.
ఎవరెంతగా ఆగ్రహించినా, సోషల్ మీడియాలో ట్రోల్ చేసినా, చేస్తున్నా తనది వివాదాల రూట్ అని పదేపదే నిరూపించుకుంటున్నారామె. ఈ పరంపరలో భాగంగానే హీరో విశాల్‌పై వివాదాస్పద కామెంట్స్ చేశారు. మీరా మాజీ మేనేజర్ ఈ సందర్భంగా ఓ వీడియో విడుదల చేశాడు.
తనను విశాల్ పెళ్లి చేసుకుంటానని రెండుమూడేళ్లుగా అడుగుతున్నాడని మీరా మిథున్ చెప్పుకొచ్చారు. అంతేకాదు, తన తల్లికి విశాల్ అంటే చాలా ఇష్టమని కూడా తెలిపారు. అయితే తనకు సంపన్నుడైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, ఆ ఫిలాసఫీలో భాగంగానే విశాల్‌ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినట్టు మీరా ప్రకటించి సంచలనానికి తెర లేపారు.
మీరా తాజా కామెంట్స్‌పై విశాల్, ఆయన అభిమానులు ఎలా స్పందిస్తారో అనే అంశం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.