విజయవాడ నగరంలోని స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదానికి సంబంధించి విజయవాడ పోలీసులు ఇప్పటికే పలువురు నిందితు లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక నిందితుల ఆచూకీ తెలిపితే లక్ష రూపాయలు అందజేస్తామని విజయవాడ సీపీ శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు.
విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యశాల రమేశ్ ఆస్పత్రి యాజమాన్యం స్వర్ణ ప్యాలెస్‌ను తీసుకుని కోవిడ్ సెంటర్ నిర్వహి స్తోంది. ఇటీవల ఆ సెంటర్‌లో అగ్ని ప్రమాద దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడైన డాక్టర్ రమేశ్ తప్పించుకు తిరుగుతున్నాడు. అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ సీపీ మీడియాతో మాట్లాడుతూ స్వర్ణ ప్యాలెస్ కేసు విచారణలో నిందితులు సహకరించడం లేదన్నారు.
స్వర్ణ ప్యాలెస్ హోటల్, రమేష్ ఆస్పత్రి యాజమాన్యాల మధ్య ఏం ఒప్పందం జరిగిందో కూడా చెప్పలేకపోతున్నారన్నారు. వైద్యానికి భారీగా డబ్బులు వసూలు చేశారని తేలిందన్నారు. ఈ కేసులో ముఖ్యంగా టాప్ మేనేజ్మెంట్ కోసం వెతుకుతున్నట్టు సీపీ తెలిపారు. ఈ కేసులో కీలక వ్యక్తుల సమాచారం ఇస్తే లక్ష రూపాయలు బహుమతిగా అందజేస్తామని సీపీ శ్రీనివాసులు ప్రకటించారు.