అదిగో పవన్ అంటే ఇదిగో సినిమా అన్నట్లు తయారైంది వ్యవహారం. ఓ పక్క దర్శకుడు క్రిష్ ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ తో కలిసి సెట్ ల డిజైన్లు, లెక్కలు చేయించేస్తున్నారు. మరోపక్క నిర్మాత దిల్ రాజు తన ఏర్పాట్లు తాను చేసుకుంటున్నారు. ఎవరి ఫీలర్లు వాళ్లు వదులుతున్నారు. కానీ ఈ హడావుడి అంతాచూసి ఫ్యాన్స్ మాత్రం కిందామీదా అవుతున్నారు. ఎక్కడ పవన్ కళ్యాణ్ కు మూడ్ ఆఫ్ అయి, క్యాన్సిల్ అంటారేమో? అని.
నిర్మాతలు అందరూ 'మా సినిమా మా సినిమా' అంటున్నారు తప్ప, పవన్ కు కాస్త టైమ్ ఇవ్వడంలేదు. పవన్ కూడా అందరినీ చూద్దాం.. చేద్దాం అంటున్నారు తప్ప, ఎవ్వరికీ ఫైనల్ స్టేజ్ కు తీసుకురాలేదని బోగట్టా. దిల్ రాజు-హారిక హాసినికి అలాగే క్రిష్ కు చేయడం పక్కా అన్నదే ఖరారు అయింది తప్ప, అంతకుమించి ఒక్క అంగుళం ముందుకు జరగలేదని తెలుస్తోంది.
కానీ దిల్ రాజు సినిమా విషయంలో అప్పుడే బాలీవుడ్ జర్నలిస్ట్ ల ట్వీట్ ల వరకు వెళ్లిపోయింది వ్యవహారం. ఇదే ఇప్పుడు టెన్షన్ పాయింట్ అవుతోంది. పవన్ మనసు ఎప్పుడు ఎలా మళ్లుతుందో ఎవరికీ తెలియదు. ఈ హంగామా అంతాచూసి క్యాన్సిల్ అంటారేమో అన్న అనుమానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.