రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రేపు విశాఖపట్నం వేదికగా లాంగ్ మార్చ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయాలకు వాడుకుంటున్న వేళ.. పవన్ కూడా ఎప్పట్లానే కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా ఇసుక కొరతపై స్పందిస్తున్నారు. లాంగ్ మార్చ్ కు అన్ని రాజకీయ పార్టీలూ తనతో కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. అయితే పిలుపైతే బాగుంది కానీ, పవన్ పిలుపిస్తే కదిలే రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయా అనేది డౌట్.
పవన్ చేపట్టబోతున్న లాంగ్ మార్చ్ పై ఇప్పటికే పార్టీలన్నీ తలోదారి ఎంచుకున్నాయి. ఈ అంశంపై బీజేపీ కుండబద్దలు కొట్టినట్టు వ్యవహరిస్తోంది. పవన్ తో కలిసి రావాల్సిన అవసరం తమకు లేదంటున్నారు ఆ పార్టీ పెద్దలు. మరికొన్ని రోజుల్లో గవర్నర్ ను కలుస్తామని, అవసరమైతే అప్పుడు పవనే తమతో కలిసి రావాలని సూచిస్తున్నారు. అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా దీనిపై మల్లగుల్లాలు పడుతోంది. పైకి మద్దతు తెలిపినట్టు కవరింగ్ ఇస్తున్నప్పటికీ చంద్రబాబుకు తన భయాలు తనకు ఉన్నాయి.
కొడుకును పార్టీకి పెద్దదిక్కుగా చేసే క్రమంలో ఇసుక కొరత పుణ్యమా అంటూ తొలిసారిగా కొడుకు లోకేష్ ను జనాలపైకి వదిలారు. ఒక్కరోజు దీక్షలంటూ చినబాబు బాగానే హంగామా చేశారు. రాసిచ్చిన స్క్రిప్ట్ ను పదేపదే వల్లెవేశారు. స్క్రిప్ట్ దాటి ఒక్క ముక్క కూడా బయటకు వెళ్లలేదు. మొత్తమ్మీద టీడీపీ శ్రేణులంతా లోకేష్ వైపు చూడగలిగేలా చేసారు చంద్రబాబు. ఇలాంటి టైమ్ లో మళ్లీ అదే అంశంపై పవన్ ఇప్పుడు లాంగ్ మార్చ్ అంటున్నారు.
ఇప్పుడు పవన్ కు మద్దతిచ్చి, తమ కార్యకర్తలందర్నీ అదే లాంగ్ మార్చ్ కు పంపిస్తే.. మొన్నటివరకు అష్టకష్టాలు పడి లోకేష్ సంపాదించుకున్న మైలేజీ మొత్తం పోతుంది. కాస్త్ ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తి కాబట్టి క్రెడిట్ మొత్తం ఆటోమేటిగ్గా పవన్ కు వెళ్లిపోతుంది. ఇదే ఇప్పుడు చంద్రబాబును ఇరకాటంలో పడేసింది. మద్దతు ఇస్తే ఒక సమస్య, ఇవ్వకపోతే మరో సమస్య. ఈ విషయంలో తనదైన శైలిలో పైకి ఒకటి చెబుతూ, లోలోపల పవన్ కు వ్యతిరేకంగా పనిచేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
మొత్తమ్మీద పవన్ లాంగ్ మార్చ్ ఈసారి వెలవెలబోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీనికితోడు ఏ ప్రాంతంలో అయితే పవన్ లాంగ్ మార్చ్ చేపట్టబోతున్నారో, అదే ప్రాంతానికి చెందిన జనసేన కీలకనేత బాలరాజు పార్టీని వీడుతున్నారు. మరికొన్ని గంటల్లో ఈయన తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఇలా ఇతర పార్టీలే కాదు, సొంత పార్టీలో కూడా తలోదారి చూసుకోవడంతో లాంగ్ మార్చ్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.