ఎంత పెద్ద సినిమా అయినా పాటకు మహా అయితే కోటి, రెండుకోట్లు ఖర్చుచేస్తారు. అయిదు కోట్లు ఖర్చు చేయడం అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. అయినా పెద్ద హీరోల సినిమాలకు పాటలు కూడా అందమే కాబట్టి, నిర్మాతలు ఖర్చు విషయంలో వెనుకాడడం లేదు. భరత్ అనే నేను సినిమాలో వచ్చాడయ్యా సామి పాటకు అలాగే భారీగా ఖర్చుచేసారు. అది విజువల్ ట్రీట్ అయింది. అలాగే చాలా సినిమాల్లో చాలా పాటలు వున్నాయి.
లేటెస్ట్ గా బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో రాములో రాములు పాటకు అయిదు కోట్ల మేరకు ఖర్చు అయిందని బోగట్టా. ఆ పాటను భారీగా సెట్ వేసితీసారు. ఆ సెట్ కే రెండున్నర కోట్లు ఖర్చుచేసారు. ముంబాయి డ్యాన్సర్లను, ముంబాయి మేకప్ మెన్ లను రప్పించారు. పైగా పాట విడుదలకు మళ్లీ కవర్ విడియో ఒకటి చేసి వదిలారు దానికి కూడా భారీగా ఖర్చయింది. మొత్తంమీద ఇలా ఆ పాటకు అన్నీకలిపి అయిదు కోట్ల మేరకు ఖర్చయిందని తెలుస్తోంది.
కాసర్ల శ్వామ్ రాసిన ఈ పాట ఇప్పటికే భయంకరమైన హిట్ అయిపోయింది. బన్నీ హాఫ్ కోట్ స్టెప్ సోషల్ మీడియాలో తెగ కనిపిస్తోంది. టిక్ టాక్ లో ఈ పాట ఫుల్ వైరల్ అయిపోయింది. అందువల్ల అయిదు కోట్లు ఖర్చు పెట్టినా, సినిమాకు అంతకు అంతా పబ్లిసిటీ వచ్చేసినట్లే. రేపు సినిమా విడుదలయ్యాక విజువల్ గా కూడా ఆ రేంజ్ లో వుంటే సినిమాకు మరింత ప్లస్ అవుతుంది.