టీడీపీ అధినేత తమను మోసం చేశారని విమర్శించిన వారి జాబితా చాలా పెద్దదే. ఈ క్రమంలో తాజాగా బాబు కొత్త బాధితుడు తెరపైకి వచ్చారు. ఆయన మరెవరో కాదు… ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కావడం గమనార్హం. చివరికి అందరూ పొలిటికల్ కమెడియన్‌గా భావించే పాల్ కూడా బాబును శపించే పరిస్థితి వచ్చింది. కందుకూరు దుర్ఘటన మొదలుకుని చంద్రబాబుపై కేఏ పాల్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
బాబుపై ప్రధాన ప్రత్యర్థుల కంటే ఎక్కువగా పాల్ విమర్శలు చేయడం, పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం, టీడీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ జగనే బెటర్ అనడంతో పాటు బాబుపై శాపనార్థాలు కురిపించడం గమనార్హం. చంద్రబాబు సభల్లో వరుస విషాద ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై రహదారులపై ర్యాలీలు, బహిరంగ సభల నిర్వహణపై జగన్ సర్కార్ నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని కేఏ పాల్ స్వాగతించారు. ఈ క్రెడిట్ అంతా తనకే దక్కుతుందని ఆయన అన్నారు. చంద్రబాబు సభలపై డీజీపీకి ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టుకెళ్లడం వల్లే ఏపీ సర్కార్ తాజాగా నిషేధం విధించిందని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. జగన్‌కు తన హృదయపూర్వక ధన్యవాదాలన్నారు. బాబు కంటే జగన్ వెయ్యి రెట్లు బెటర్ అని ఆకాశమే హద్దుగా పాల్ ప్రశంసలు కురిపించడం విశేషం.
తన సలహాల్లో కొన్నింటిని జగన్ పాటించారన్నారు. ఇందుకు తాజాగా ర్యాలీలు, బహిరంగ సభలపై ప్రభుత్వ ఉత్తర్వులే నిదర్శనమన్నారు. ఏపీ అభివృద్ధి కోసం తనను పిలిచి జగన్ మాట్లాడ్తారేమో చూడాలని ఆయన అన్నారు. తనను పిలిచి జగన్ ఎందుకు సలహాలు తీసుకోరని పాల్ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎటూ బుద్ధి లేదని విమర్శించారు. కందుకూరులో 8 మంది మృత్యువాత పడిన తర్వాత కూడా కావలిలో కార్యక్రమాన్ని చంద్రబాబు ఎలా నిర్వహిస్తారని కేఏ పాల్ ప్రశ్నించారు. బాబు, టీడీపీ నేతలను శపిస్తున్నట్టు ఆయన అన్నారు.
వారు నాశనమై పోతారని కేఏ పాల్ శపించారు. చాలా మందిని చంద్రబాబు మోసం చేశారని ఆయన విమర్శించారు. మామ ఎన్టీఆర్‌తో పాటు తనను కూడా చంద్రబాబు మోసగించినట్టు కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. చంద్రబాబు బాధిత జాబితాలో తాజాగా కేఏ పాల్ చేరిందన్న మాట.