ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలం ఎంతో అందరికీ తెలుసు. కనీసం ఒక్క శాతం కూడా ఆ పార్టీకి ఓటు బ్యాంకు లేదు. జాతీయ స్థాయిలో బీజేపీ హీరో అయినప్పటికీ, ఏపీలో మాత్రం రాజకీయంగా జీరో అని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో ఏపీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటన ఖరారైంది. మరీ ముఖ్యంగా రెండు చోట్ల బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించడంతో జనాన్ని తరలించడం ఏపీ బీజేపీ నాయకత్వానికి సవాల్‌గా మారింది.
ఈ నెల 8న కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అమిత్‌షా పర్యటించనున్నారు. 8న ఉదయం 11.15 గంటలకు కర్నూలులో, అలాగే సాయంత్రం 3 గంటలకు పుట్టపర్తిలో బహిరంగ సభలు నిర్వహించతలపెట్టారు. మిగిలిన సమావేశాలు పార్టీ నేతలతో కావడం విశేషం. రాయలసీమలో బీజేపీ బలం అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో అమిత్‌షా బహిరంగ సభల్ని విజయవంతం చేయడం ఎలా? అనే అంశంపై బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ఇటీవల ప్రధాని మోదీ విశాఖ పర్యటన విజయవంతమైంది. దీనికి కారణం ప్రధాని పర్యటనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే. ప్రధాని ర్యాలీ మొదలుకుని, ఆ మరుసటి రోజు బహిరంగ సభ వరకూ అన్నీ వైసీపీ భుజాన వేసుకుని సక్సెస్ చేసింది. ఇప్పుడు అమిత్‌షా పర్యటన పూర్తిగా పార్టీ పరంగా చేపట్టిందే. నిజానికి కర్నూలుకు బదులు కడపలో నిర్వహించాలని మొదట అనుకున్నారు.
అయితే రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తెలివిగా తప్పించారు. అమిత్‌షా సభ నిర్వహణ బాధ్యత, భారాన్ని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌పై వేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్ కర్నూలు సిటీ టీడీపీ ఇన్‌చార్జ్. దీంతో టీడీపీ శ్రేణుల్ని అమిత్‌షా సభకు తరలించొచ్చనే వ్యూహంలో భాగంగా కర్నూలులో నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ శ్రేణుల తరలింపునకు చంద్రబాబు ఎంత వరకు ఆమోదం తెలుపుతారో చూడాలి. మొత్తానికి అమిత్‌షా ఏపీ పర్యటన బీజేపీ నేతల్లో గుబులు రేపుతోంది.