సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై బాలీవుడ్ జనాల రన్నింగ్ కామెంట్రీ కొనసాగుతూ ఉంది. ఎవరికి తోచింది వారు మాట్లాడుతూ ఉన్నారు. సినిమాలు, షూటింగులు కూడా లేకపోవడంతో వార్తల్లో ఉండటానికి కొందరికి ఇదే పని అయినట్టుగా సామాన్య ప్రేక్షకులకు అనిపిస్తూ ఉంది.
ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై కొంతమంది హీరోయిన్లు డైరెక్టు టార్గెట్ అయిపోయారు. కొందరేమో అలియా భట్ ను నిందిస్తూ ఉన్నారు, మరి కొందరు రియా చక్రబర్తిపై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వారికి ఎవరి రీజన్లు వారికున్నాయి.
కొందరు బాలీవుడ్ నెపొటిజం పోస్టర్ గర్ల్ గా అలియాను చూస్తూ తిట్టిపోస్తున్నారు. మరి కొందరు సుశాంత్ ను రియా వాడుకుందని వీళ్లే ఆరోపిస్తూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు మరో హీరోయిన్ పేరు ను వాడుకుంటూ సంచలన అంశాలను చర్చలోకి తెస్తున్నారు!
అదేమంటే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ – సారా అలీఖాన్ ల మధ్య ఎఫైర్ ఉండేదట, వీరిద్దరూ ఒకే రూమ్ లో కూడా ఉండేవారట. వీళ్లిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించినట్టుగా ఉన్నారు. ఆ సమయంలో ఔట్ డోర్ షూటింగులో వీరిద్దరూ ఒకే రూమ్ ను షేర్ చేసుకునే వారని.. ఆ తర్వాత సారా అతడికి బ్రేకప్ చెప్పిందనేది కొందరి వాదన!
ఇలా ఇప్పుడు సుశాంత్ ఆత్మహత్యకు కారణం సారా అనే నిందలు కూడా మొదలయ్యాయి. ఈ విషయంలో కంగనా రనౌత్ ముందుంది. సారా సినీ వారసత్వంతో వచ్చిందని, అలాంటి వారికి ప్రేమ విలువ తెలీదని కంగనా క్లాసు వేసుకుంది! ప్రేమ విలువ తనకు మాత్రమే తెలుసని కూడా కంగనా చెప్పుకొచ్చింది. హృతిక్ రోషన్ కు తనను తాను చాలా నిజాయితీగా అర్పించుకున్నట్టుగా అతడు తనను అర్థం చేసుకోలేదని కంగనా తన పాత ప్రేమను వివరించింది!
ఈ రచ్చ అంతా చూస్తుంటే… ఏమిటో వీళ్ల గోల అనిపిస్తే నేరం సామాన్యుడిది కాదు. సుశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో కానీ.. కాసేపు అలియా, రియాలను ఆడేసుకుంటున్నారు. ఇప్పుడు సారాను కూడా దించేసి రచ్చ మొదలయ్యేలా ఉంది.
సారా మొదట్లో అతడితో రూమ్ షేర్ చేసుకుని, ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసిందంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి మాటల ద్వారా వీరు సారాను మాత్రమే నిందిస్తున్నట్టుగా భావిస్తున్నారు. అయితే బాలీవుడ్ మొత్తం వలువలు వదిలేసి పచ్చిగా తిరుగుతోందని వారే చాటి చెప్పుకుంటున్నట్టు కాదా? ఈ రచ్చకు తోడు కంగనా తన పాతివ్రత్యపు కథలు చెబుతూ మంటకు మరింత ఆయిల్ పోస్తోంది!