ఇండియాలో కరోనా వైరస్ పీక్ స్టేజ్ కు సమీపించిందని అంచనా వేస్తున్నారు నిపుణులు. జనవరి 30న ఇండియాలో తొలి సారి కరోనా వైరస్ సోకిన వ్యక్తిని గుర్తించారు. మార్చి 21 గానీ ప్రభుత్వం నివారణ చర్యలు మొదలుపెట్టలేదు. రెండున్నర నెలల పాటు సుదీర్ఘ లాక్ డౌన్ ను అమలు చేశారు. జూన్ ఒకటి నుంచి లాక్ డౌన్ మినహాయింపులు మొదలు కాగా.. అప్పటికే చాప కింద నీరులా కొన్ని రాష్ట్రాల్లో వ్యాపించిన కరోనా ఆ తర్వాత దేశమంతా అల్లుకుపోయింది.
జూన్ మొదటి వారంలో రోజుకు వెయ్యి స్థాయిలో దేశంలో కేసులు పెరగ్గా, ప్రస్తుతం రోజువారీ మొత్తం ఏకంగా 70 వేల స్థాయికి చేరింది. అయితే కరోనా ప్రభావం ఇప్పుడప్పుడే ఇండియాను వదిలే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. విషయం ఏమిటంటే.. కరోనా అతి త్వరలోనే ఇండియాలో పీక్ స్టేజ్ కు చేరబోతోందని వారు అంచనా వేస్తూ ఉండటం.
కరోనా పీక్ స్టేజ్ అనే అంచనా విషయంలో కొన్ని పరీశీలనలను ప్రముఖంగా పేర్కొంటున్నారు. ఇప్పటి వరకూ కొన్ని దేశాల్లో కేసుల ట్రెండ్ ను పరిశీలించి వారు ఈ మాట చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో కరోనా వ్యాప్తి పీక్ స్టేజ్ కు చేరి ఆ తర్వాత కాస్త కాస్త నెమ్మదించింది. ఆ లెక్కలను బట్టి ఇండియాలో పీక్ స్టేజ్ కు సమీపంలో కరోనా ఉందని వారు అంటున్నారు.
75 శాతం రికవరీ కేసులు నమోదు కావడాన్ని పీక్ స్టేజ్ కు ప్రామాణికంగా తీసుకుంటున్నారు నిపుణులు. ఇప్పటి వరకూ 75 శాతం రికవరీని సాధించిన వివిధ దేశాల్లో ఆ తర్వాత కరోనా కేసుల వ్యాప్తి గణనీయంగా తగ్గిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.
భారీ ఎత్తున కేసులతో నిలుస్తున్న బ్రెజిల్, అలాగే ఎక్కువ కేసులు నమోదైన దేశాల్లో ఒకటైన ఇరాన్, ఇంకా చిలీ వంటి దేశాలను ఇందుకు ఉదాహరిస్తున్నారు. అలాగే తక్కువ కేసులు నమోదైన దేశాలైన మలేసియా, బెహ్రెయిన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో కూడా రికవరీ రేటు 75 శాతానికి చేరువ అయ్యాకా.. కరోనా కేసుల వ్యాప్తి నంబర్ లో క్షీణత చోటు చేసుకుందని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు.
ఈ రకంగా ఇండియాలో కూడా 75 శాతం రికవరీ రేటు నమోదు అయిన తర్వాత కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో శాస్త్రీయత ఎంత? అంటే.. అంత తేలికగా అంతుబట్టే విషయం కాదు. 75 శాతం రికవరీ రేటుకు చేరుకున్న చాలా దేశాల్లో ఆ తర్వాత కరోనా వ్యాప్తి నంబర్ తక్కువగా నమోదు కావడంతో.. ఇండియాలో కూడా అదే పరిస్థితి ఉండవచ్చని ఆశ, అంచనా.
ఇంతకీ ఇండియాలో ఇప్పుడు రికవరీ శాతం ఎంత అంటే? దాదాపు 71. ఈ రికవరీ శాతం మరో నాలుగు వరకూ పెరిగితే.. ఆ తర్వాత దినవారీగా కేసుల సంఖ్య తగ్గవచ్చని ఈ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత వారం పది రోజుల కేసుల సంఖ్య ట్రెండ్ ను పరిశీలిస్తే.. గ్రాఫ్ లో కాస్త హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక్కో రోజు నంబర్లు తగ్గినట్టుగానే కనిపిస్తున్నా ఆ తర్వాత ఉన్నట్టుండి పెరుగుతున్నాయి. మళ్లీ కాస్త తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో 75 శాతం రికవరీ రేటు నమోదు అయితే.. ఆ తర్వాత కొత్త కేసుల సంఖ్యలో క్షీణత ఉండవచ్చని అంచనా.
అలాగని పూర్తిగా తగ్గిపోతుందని కాదు.. ఆ స్థాయికి చేరిన దేశాల్లో ఆ తర్వాత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన విషయం మాత్రం స్పష్టం అవుతోంది.