వైసీపీకి తొలి పాఠం.. పథకాలు ఇంటికే పరిమితమా?

బద్వేల్ లో పోలింగ్ శాతం 68.12. గత సాధారణ ఎన్నికల కంటే ఇది  తక్కువ. అంతెందుకు 20 ఏళ్లలో ఇదే తక్కువ శాతం పోలింగ్ అని గణాంకాలు చెబుతున్నాయి. సహజంగా ఉప ఎన్నికలంటే ఎవరూ…

బద్వేల్ లో పోలింగ్ శాతం 68.12. గత సాధారణ ఎన్నికల కంటే ఇది  తక్కువ. అంతెందుకు 20 ఏళ్లలో ఇదే తక్కువ శాతం పోలింగ్ అని గణాంకాలు చెబుతున్నాయి. సహజంగా ఉప ఎన్నికలంటే ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించరు. అయితే ప్రభుత్వం ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

పథకాలు అందుకున్న లబ్ధిదారులంతా పోలింగ్ బూతుల ముందు పోటెత్తుతారని ఆశించింది. కానీ అదేమీ జరగలేదు. సామాన్య జనానికి ఓట్ల సంబరం పట్టలేదు. అంటే పోల్ మేనేజ్ మెంట్ సరిగా జరగలేదు.

కారణం-1

ప్రధాన ప్రతిపక్షం టీడీపీ  బరిలో లేకపోవడంతో వైసీపీ కూడా ఈ ఎన్నికను లైట్ తీసుకుంది. అటు జనాలు కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ఇక బీజేపీకి జనసేన సపోర్ట్ లేకపోవడంతో.. వైసీపీ మరీ సైలెంట్ గా ఉన్నట్టే చెప్పాలి. 

పక్క జిల్లాల నుంచి నేతలు వచ్చి ప్రచారం చేస్తున్నారే కానీ.. పోలింగ్ రోజు మాత్రం అంతా స్తబ్దుగా ఉన్నారు. దీనికితోడు జగన్ బహిరంగ సభ కూడా లేకపోవడంతో జనానికి పెద్దగా కిక్ ఎక్కలేదు.

కారణం-2

డబ్బులు, మద్యం పంపిణీ లేదు. తిరుపతి ఉప ఎన్నికల విషయంలో కూడా వైసీపీ ఇదే స్ట్రాటజీ అలవాటు చేసింది. మద్యం, డబ్బులు పంచేది లేదని తెగేసి చెప్పింది. దీంతో టీడీపీ ఆ రెండిటిపై ఆధారపడి ఓట్లు తెచ్చుకుంది. ఇక్కడ బద్వేలులో కూడా అధికార పార్టీ ప్రలోభాలకు పూర్తిగా దూరంగా ఉంది. మండలాల మెజార్టీ కోసం స్థానిక నాయకులు ప్రచారం చేసుకుని సరిపెట్టారు. 

పోలింగ్ రోజు కూడా మాటలతోనే సరిపెట్టారు కానీ, చేతల్లోకి దిగలేదు. అటు బీజేపీ కూడా ఓడిపోయే ఎన్నికే కదా అని డబ్బుల జోలికి వెళ్లలేదని సమాచారం. దీంతో సహజంగానే పోలింగ్ శాతం తగ్గింది. డబ్బులు ఇవ్వలేదు కాబట్టి కొంతమంది ఓటర్లు ఓట్లు వేయలేదనేది పచ్చి నిజం.ప్రజాస్వామ్యంలో అందరం సిగ్గుపడాల్సిన అంశం. 

మేలుకొలుపు-1

పథకాలపై నమ్మకం పెట్టుకోవచ్చు కానీ, వాటిపైనే పూర్తిగా ఆధారపడటం తప్పు అని బద్వేల్ ఉప ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. బద్వేలే కాదు, ఏపీలోని ఏ నియోజకవర్గంలో అయినా చాలా గడపలు నవరత్నాల కార్యక్రమాలతో లబ్ధి పొందుతున్నాయి. మరి ఆ లబ్ధి, ఓట్ల రూపంలోకి మారిందా? ఈ సందేహాన్ని పోల్ పర్సంటేజీ క్లియర్ చేసింది. 

ఒకవేళ బద్వేల్ లో పోలైన ఓట్లన్నీ వైసీపీకే అనుకున్నా.. నూటికి 30 మందికి ఇంకా ఏదో కావాలి. అదేంటనేది వైసీపీ నేతలు ఎన్నికల్లోగా ఆలోచించాలి. కాస్త సీరియస్ గానే దృష్టిపెట్టాల్సిన అంశం ఇది.

మేలుకొలుపు-2

కచ్చితంగా గెలుస్తామనే ధీమా ఉన్నా కూడా ఏ ఒక్క ఓటునీ లైట్ తీసుకోకూడదు. బద్వేల్ లో వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయం కాబట్టి అక్కడ పెద్దగా ప్రచారం జరగలేదు. మరోవైపు టీడీపీ హయాంలో జరిగిన నంద్యాల ఉప ఎన్నికలకు, వైసీపీ హయాంలో బద్వేల్ ఉప ఎన్నికలకు తేడా చూపాలని జగన్ అనుకున్నారు. 

అది ఆత్మసంతృప్తిని ఇవ్వచ్చేమో కానీ, ప్రజలు ఆ తేడాను గుర్తు పెట్టుకుంటారని అనుకోలేం. పోల్ పర్సంటేజీ తగ్గడాన్ని టీడీపీ అనుకూల మీడియా భూతద్దంలో చూపిస్తోంది. వైసీపీ పథకాలు ప్రజలపై పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయనే అపవాదుని మోపుతోంది.

ఎల్లో మీడియా వ్యాఖ్యల్ని పక్కనపెడితే, ఇంతమంది ఓట్లు వేయడానికి విముఖత చూపించారంటే క్షేత్రస్థాయిలో కచ్చితంగా ఇంకేదో ఉందనే వాస్తవాన్ని వైసీపీ గుర్తించాలి. బద్వేల్ ఉప ఎన్నికలతో అయినా వైసీపీ తన పంథా మార్చుకోవాలి. ఫలితాల్లో వచ్చిన మెజారిటీ చూసి సంబరాలు చేసుకునే కంటే.. ఈ ఎన్నిక నుంచి పాఠాలు నేర్చుకుంటే మంచిది.